వైద్యులను వదలని కరోనా

ABN , First Publish Date - 2022-01-28T05:22:34+05:30 IST

కరోనా వైరస్‌ వైద్యులను, వైద్య సిబ్బందిని వదలట్లేదు. పాల మూరు జనరల్‌ ఆసుపత్రిలో కరోనా కల్లోలం సృష్టిస్తోం ది.

వైద్యులను వదలని కరోనా
పాలమూరు జనరల్‌ ఆసుపత్రి

మహబూబ్‌నగర్‌ (వైద్యవిభాగం) జనవరి 27: కరోనా వైరస్‌ వైద్యులను, వైద్య సిబ్బందిని వదలట్లేదు. పాల మూరు జనరల్‌ ఆసుపత్రిలో కరోనా కల్లోలం సృష్టిస్తోం ది. రోజు రోజుకు పాజిటివ్‌ కేసులు పెరుగుతుండడంతో పాటు ఆసుపత్రికి వచ్చే రోగుల సంఖ్య కూడా అదే స్థాయిలో పెరుగుతోంది. ప్రజల నిర్లక్ష్యం కారణంగా ఆసు పత్రిలోని డాక్టర్లకు, ఇతర సిబ్బందికి కూడా వైరస్‌ సోకుతోంది.  పనిచేసే డాక్టర్లు, హౌజ్‌ సర్జన్లు, ఇతర నర్సింగ్‌, పారామెడికల్‌ సిబ్బందితో కలిపి మొత్తం 160 మంది కరోనా బారిన పడ్డారు.  

  ఆసుపత్రిలో పెరుగుతున్న కేసులు..

ఆసుపత్రిలో జనవరి నెల నుంచే పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరిగింది. ప్రతిరోజు 20 నుంచి 30 మంది వరకు కరోనా రోగులు వస్తున్నారు.  పరీక్షలు చేసుకోకుండా వైరస్‌ లక్షణాలతో దాదాపు 150 నుంచి 200 మంది వరకు వస్తున్నారు. ప్రతీ ఇంట్లో ఒకరిద్దరు జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు వంటి లక్షణాలతోనే ఆస్పత్రికి వస్తున్నారు.   ప్రస్తుతం జనరల్‌ ఆసుపత్రిలో దాదాపు 200 మందికి పైగా వైరస్‌ లక్షణాలతో ఉన్న వారు చికిత్స పొందుతున్నారు.   

 వైద్యులు, వైద్య సిబ్బందికి వైరస్‌.. 

 జనరల్‌ ఆసుపత్రిలో పనిచేసే వైద్యులు, వైద్య సిబ్బంది వైరస్‌ బారిన పడుతున్నారు. ఈ నెల 1 నుంచి ఇప్పటి వరకు మొత్తం 160 మందికి పాజిటివ్‌ వచ్చింది. అందులో 10 మంది రెగ్యులర్‌ డాక్టర్లు ఉండగా, మిగతా 71 మంది హౌస్‌ సర్జన్లు, 5 మంది సీనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు, 5 మంది జూనియర్‌ రెసిడెంట్‌ డాక్టర్లు ఉన్నారు. వీరితో పాటు 34 మంది స్టాఫు నర్సులు, 12 మంది ల్యా బ్‌ టెక్నీషియన్లు, 5 మంది ఫార్మసిస్టులు, 5 మంది పారా మెడికల్‌ స్టాఫు, మిగతా పరిపాలన విభాగం, సానిటేషన్‌, సెక్యూరిటి విభాగాలకు చెందిన వారు ఉన్నారు.

 వారం రోజులకే మళ్లీ విధుల్లోకి.. 

ఆసుపత్రిలో వైరస్‌ సోకి పాజిటివ్‌ వచ్చిన వారు వాస్తవానికి 14 రోజులు క్వారంటైన్‌లో ఉండాలి. కాని చాలా మంది వారంరోజులకే మళ్లీ విధుల్లో చేరుతున్నా రు. ఆసుపత్రిలో అన్ని విభాగాల్లో పాజిటివ్‌ వచ్చిన వారు ఉన్నారు. పనిభారం పెరుగుతుండడంతో వారం రోజులకే క్వారంటైన్‌ పూర్తి చేసుకొని నెగెటివ్‌ వచ్చిన తర్వాత మళ్లీ విధుల్లో చేరుతున్నారు. 

 ప్రసూతి విభాగంలోనే అత్యధికం

ఆసుపత్రిలోని ప్రసూతి విభాగంలోనే పాజిటివ్‌లు ఎక్కువగా వస్తున్నాయి. ఉమ్మడి జిల్లాల నుంచి పాజిటివ్‌ వచ్చిన గర్భిణులను జనరల్‌ ఆసుపత్రికే రెఫర్‌ చేస్తున్నారు. అంతే కాకుండా చాలా వరకు ప్రతీ గర్భిణికి పాజిటివ్‌ వస్తోంది. దీంతో ఆ విభాగంలో పనిచేసే ప్రతీ ఒక్కరికి పాజిటివ్‌ వస్తోంది. ప్రస్తుతం ఇదే విభాగంలో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బంది దాదాపు 50 మంది పాజిటివ్‌లో ఉన్నారు. అంతే కాకుండా 30 మంది వరకు పాజిటివ్‌ వచ్చిన గర్భిణులు చికిత్స పొందుతున్నారు.  

Updated Date - 2022-01-28T05:22:34+05:30 IST