‘కట్టు’తప్పింది!

ABN , First Publish Date - 2020-06-07T08:07:09+05:30 IST

కరోనా వైరస్‌ అంటే జనంలో భయం పోయిందా? లేదంటే వస్తే రాని....ఏమవుతుందన్న నిర్లక్ష్యమా?...లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల తర్వాత బాహ్య ప్రపంచంలో జనం తీరు చూసి వైద్యులు

‘కట్టు’తప్పింది!

కరోనా అంటే డోంట్‌ కేర్‌ అన్నట్టు వ్యవహరిస్తున్న జనం 

నిర్లక్ష్యమా...భయం పోయిందా!

లాక్‌డౌన్‌ సడలింపు తర్వాత విచ్చలవిడితనం

మాస్క్‌లు, ముందుజాగ్రత్తలు అంతంతే

భౌతిక దూరం పట్టని వైనం

తేలికగా తీసుకోవద్దంటున్న వైద్యులు

స్వీయ జాగ్రత్తలు తప్పనిసరని హెచ్చరిక

అత్యవసరమైతే బయటకు వెళ్లవద్దని సూచన

పని ప్రదేశాల్లో మరింత అప్రమత్తంగా ఉండాలి


కరోనా వైరస్‌ విస్తరిస్తూనే ఉంది. రోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఎప్పుడు ఎవరి నుంచి ఎవరికి సోకుతుందో తెలియని పరిస్థితి. ఇంతటి క్లిష్ట పరిస్థితుల్లో స్వీయ జాగ్రత్తలే అసలైన మందు. కానీ లాక్‌డౌన్‌తో ప్రభుత్వం కట్టడి చేసినప్పుడు వున్న భయం, బాధ్యత, వైరస్‌ పట్ల జాగరూకత...నిబంధనలు సడలించాక జనంలో కనిపించడం లేదు. అసలు కరోనా అంటే భయం పోయిందో...ఇంతకంటే ఏమైపోతుందిలే? అన్న నిర్లక్ష్యమో తెలియదుగానీ జనంలో విచ్చలవిడితనం, కనీస నిబంధనలు పట్టని వైనం చూసి వైద్యులు, అధికారులు మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


(ఆంధ్రజ్యోతి/విశాఖపట్నం)

కరోనా వైరస్‌ అంటే జనంలో భయం పోయిందా? లేదంటే వస్తే రాని....ఏమవుతుందన్న నిర్లక్ష్యమా?...లాక్‌డౌన్‌ నిబంధనల సడలింపుల తర్వాత బాహ్య ప్రపంచంలో జనం తీరు చూసి వైద్యులు, అధికారులు అందోళనతో అంటున్న మాట ఇది. కేసుల మీద కేసులు నమోదవుతున్నా, కాంటాక్ట్‌ కేసులే అధికమని వెల్లడవుతున్నా జనం పట్టనట్టు వ్యవహరిస్తుండడంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓవైపు రోజురోజుకూ కరోనా వైరస్‌ బారినపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో జనంలో అలసత్వం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ‘వైరస్‌ మనకు సోకదులే’ అన్న రీతిలో పలువురు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు.స్వీయ జాగ్రత్తలతోనే కరోనా వైరస్‌ను కట్టడి చేయగలమని నిపుణులు చెబుతున్నా మెజారిటీ జనం పట్టించుకోవడం లేదు. మాస్క్‌ ధరించాలని, సామాజిక దూరం పాటించాలని, చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని అధికారులు పదేపదే చెబుతున్న మాటలు అరణ్య రోదనే అవుతున్నాయి. ప్రసార మాధ్యమాల ద్వారా పెద్దఎత్తున ముందుజాగ్రత్తలపై అప్రమత్తం చేస్తున్నా వాటిని చెవికెక్కించుకోవడం లేదు. ఫలితంగా ఒకరి నిర్లక్ష్యం పదుల సంఖ్యలో జనాన్ని బాధితులుగా మారుస్తోంది.


మొదట్లో పరిస్థితి వేరు

విశాఖ జిల్లాలో తొలుత నమోదైన కరోనా కేసులన్నీ విదేశాల నుంచి వచ్చిన వారివి, వారి కుటుంబ సభ్యులవే. ఆ తర్వాత ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వలస కూలీల్లో కనిపించాయి. కానీ గత కొద్దిరోజులుగా నమోదవుతున్న పాజిటివ్‌ కేసుల్లో అత్యధికం స్థానిక వ్యక్తులే ఉంటున్నారు. ఉదాహరణకు అనకాపల్లిలో ఓ దుకాణ యజమాని ద్వారా పద్దెనిమిది మందికి, కూర్మన్నపాలెంలో ఓ ఫార్మా కంపెనీ ఉద్యోగి వల్ల మరో పది మందికి వైరస్‌ సోకిందంటే కాంటాక్ట్‌ పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా దండుబజార్‌ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వల్ల 30 మందికి వైరస్‌ విస్తరించింది. వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకుని ఉంటే వీరిలో చాలామందికి వైరస్‌ సోకేది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. వైరస్‌ మనకు సోకదులే అన్న భావనతో కనీసం జాగ్రత్తలు తీసుకోకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడమే ఈ స్థాయిలో కేసుల నమోదుకు కారణమని వారు చెబుతున్నారు. 


అవగాహన ఉండీ కొందరు...లేక మరికొందరు

పలు శాఖలు నిర్వహిస్తున్న సమావేశాల్లో కొంతమంది అధికారులు మాస్క్‌లు ధరిస్తున్న ప్పటికీ ఎంతోమంది వాటిని కిందకు జారవిడిచి మాట్లాడుకోవడం కనిపిస్తుంది. అదే స మయంలో గుంపులుగా వెళ్లడం మంత్రులు, అధికారిక సమావేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏ ఒక్కరికి వైరస్‌ వున్నా...ఆ ఒక్కరి వల్లా మరెంతోమంది బాధితులుగా మారే అవకాశం ఉంది. అవగాహన వుండీ కొంతమంది అధికారులు, ఉద్యోగులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మనకు వైరస్‌ సోకదులే అన్న ధీమా కొందరిది. తన పక్కన కూర్చున్న వ్యక్తులంతా ఆరోగ్యంగానే ఉన్నారన్న భ్రమతో మరికొందరు వ్యవహరిస్తున్నారు. వీరిలో అధికారులు, విద్యావంతులు కూడా ఉండడం గమనార్హం.


పని ప్రదేశాల్లో...

లాక్‌డౌన్‌ తర్వాత రోజువారీ పనులు, వ్యాపారాలకు అవకాశం రావడంతో జిల్లాలో పలుచోట్ల సందడి నెలకొంది. పనులు చేసే ప్రాంతాలు, టిఫిన్‌ బండ్లు, ఇతర వ్యాపార సముదాయాల వద్ద కనీస జాగ్రత్తలు పాటించడం లేదు. సామాజిక దూరం అన్న మాటనే మర్చిపోతున్నారు. కరోనా వైరస్‌ వుందన్న భావనే అక్కడి వారిలో కనిపించడం లేదు. కొంతమంది మాస్క్‌ ధరిస్తున్నా, ఎదుటి వ్యక్తులతో మాట్లాడుతున్నప్పుడు దాన్ని పైకో, కిందకో తొలగించి మాట్లాడుకోవడం కనిపిస్తోంది. ఇక చాలామంది వ్యాపారులు మాస్క్‌లు లేకుండానే రోజువారీ వ్యాపార కార్యకలాపాల్లో నిమగ్నమై ఉండడం గమనార్హం. 


నిబంధనలకు నీళ్లు

  • మార్కెట్లు, దుకాణాల వద్ద కనీసం సామాజిక దూరం పాటించడం లేదు. ఒకరిపై ఒకరు అన్నట్టు పరిస్థితి కనిపిస్తోంది. 
  • ఆటోలు, ట్యాక్సీల్లో నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణికులను ఎక్కిస్తున్నారు. 
  • కొంతమంది గుట్కా, పాన్‌ వంటివి నములుతూ ఇష్టానుసారంగా రోడ్లపైనే ఊసేస్తున్నారు. ఎవరైనా అడిగితే గొడవలకు దిగుతున్నారు.
  • ఈ జాగ్రత్తలు తప్పనిసరి.. 
  • ముఖానికి మాస్క్‌ తప్పనిసరిగా పెట్టుకోవాలి. మాస్క్‌ లేకుండా బయటకు వచ్చే వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండడం మంచిది.
  • సామాజిక దూరం పాటించాలి. పని ప్రాంతాల్లో కూడా కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరి చేయాలి.
  • బయటకు వెళ్లిన తరువాత ఎట్టి పరిస్థితుల్లోను నోరు, ముక్కు చేతితో తాకకుండా ఉండాలి. 
  • ఎప్పటికప్పుడు చేతులను సబ్బు, శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలి.
  • బయటకు వెళ్లినప్పుడు ఎదుటి వ్యక్తి వైరస్‌తో ఉన్నట్టుగానే భావించి జాగ్రత్త వహించాలి. ఆరోగ్యంగానే ఉన్నాడన్న భ్రమను వీడాలి.

Updated Date - 2020-06-07T08:07:09+05:30 IST