విపత్కర పరిస్థితుల్లో.. ఔదార్యం

ABN , First Publish Date - 2020-03-30T10:09:44+05:30 IST

కరోనా లాక్‌డౌన్‌తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, యాచకులను ఆదుకునేందుకు పలువురు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు.

విపత్కర పరిస్థితుల్లో.. ఔదార్యం

యాచకులకు ఆహార పొట్లాల పంపిణీ 


గుంటూరు, మార్చి 29: కరోనా లాక్‌డౌన్‌తో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పేదలు, యాచకులను ఆదుకునేందుకు పలువురు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. ఎవరికి వారే ఇళ్ళ వద్దే భోజనాలు సిద్ధం చేసి ప్యాకెట్ల రూపంలో పంపిణీ చేస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. ఇప్పటికే అమ్మ చారిటబుల్‌ సంస్థ ప్రతి రోజు నగరంలో యాచకులు, ఉపాధి లేక పని కోల్పోయిన వారికి, రోడ్లపై విధులు నిర్వహిస్తున్న పోలీసులకు భోజన సదుపాయాన్ని కల్పిస్తుంది. అనేక మంది ప్రజలు స్వచ్ఛందంగా ఆహార పొట్లాలను అందిస్తున్నారు. 


నల్లపాడుకు చెందిన తాపీ మేస్త్రీ జాన్‌సైదా, సెల్‌ఫోన్‌ టవర్స్‌ వద్ద పని చేసే టవర్‌ శ్రీను, మిర్చియార్డులో పని చేసే వీరాంజనేయులు, సెల్‌ఫోన్‌ సిమ్‌లు విక్రయించే నాగరాజు, విద్యార్థి సతీష్‌లు కలిసి తమ వంతు సాయంగా ఆదివారం తమ ఇళ్ళ వద్ద సుమారు 200 మందికి ఆహార పొట్లాలను సిద్ధం చేసుకుని ఏసీ కళాశాల వద్ద పంపిణీ చేశారు.హనుమయ్యనగర్‌ ప్రాంతానికి చెందిన జొన్నలగడ్డ  రాజమోహన్‌రావు, ఆయన భార్య సుజాత, సోదరుడు రత్నకుమార్‌, మేనళ్లుళ్లు దిలిప్‌కుమార్‌, విజయ్‌, ప్రభాకర్‌లు పోలీసులు, రోడ్ల వెంట ఉండే యాచకులకు శీతల పానీయాలు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అరటిపండ్లు, మినరల్‌ వాటర్‌ను అందజేశారు. నగరంలో అనేక మంది యువకులు జట్లుగా ఏర్పడి మధ్యాహ్నం, సాయంత్రం వేళల్లో యాచకులు, పేదలకు ద్విచక్ర వాహనాలపై తిరుగుతూ ఆహార పొట్టాలను అందజేస్తున్నారు. వీధి కుక్కులకు కూడా అల్పాహారం అందిస్తూ ప్రశంసలను అందుకుంటున్నారు.  


ఏపీ ఫార్మా సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో..

నిరాశ్రయులు, అన్నార్థులకు ఏపీ ఫార్మా సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. అసోసియేషన్‌ సలహాదారు బందా శశిధర్‌, అధ్యక్షుడు ఎస్‌ రాజశేఖర్‌ అరండల్‌పేటతో పరిసర ప్రాంతాల్లో 300 మందికి ఆహార పొట్లాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో శశిధర్‌, వెంకటేశ్వరరావు, శ్యామ్‌, బషీర్‌, నట్వర్‌ తదితరులున్నారు.


టీడీపీ పశ్చిమ నియోజకవర్గ ఇన్‌చార్జి కోవెలమూడి రవీంద్ర(నాని) ఆదివారం నగరంపాలెంలో 23 డివిజన్‌ టీడీపీ కార్పొరేటర్‌ అభ్యర్థి గంటా వెంకట మౌళిక, గంటా పెద్దబ్బాయ్‌ తదితరులతో కలిసి హోమియో మందులు, భోజన ప్యాకెట్లుతో పాటు కరోనాపై అవగాహనకు కరపత్రాలను పంపిణీ చేశారు. 

Updated Date - 2020-03-30T10:09:44+05:30 IST