Advertisement
Advertisement
Abn logo
Advertisement

కరోనాతోనే అల్లాడిపోతోంటే.. మరో కొత్త టెన్షన్.. అసలేంటీ ఈ MIS-C..?

కరోనా సెకండ్ వేవ్ దేశంలో కొంత తగ్గుముఖం పట్టింది. దీని వల్ల దేశంలో కనిపించిన హృదయవిదారక దృశ్యాలను ప్రజలు నెమ్మదిగా మర్చిపోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి సమయంలో మళ్లీ అందరి వెన్నులో వణుకు పుట్టించే మరో షాకింగ్ విషయం వెలుగు చూసింది. అదే మల్టీసిస్టం ఇన్‌ఫ్లేమటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్. దీన్ని వైద్య పరిభాషల్ ఎమ్ఐఎస్-సీ అని పిలుస్తారు. కరోనా సోకిన చిన్నారుల్లో ప్రస్తుతం ఈ వ్యాధి ప్రబలుతోంది. దీని తీవ్రత ఎక్కువగా ఉండటంతో కేంద్ర ప్రభుత్వం కూడా రాష్ట్రాలను ఈ వ్యాధిపై ఒక కన్నేసి ఉంచాలని సూచనలు చేసింది.  దీని చికిత్సలో నైపుణ్యం ఉన్న ఆస్పత్రులను, వైద్యసంస్థలను గుర్తించాలని సలహా ఇచ్చింది. 


కరోనా తగ్గుతోందని ఊపిరి పీల్చుకుంటున్న దేశంలోని కోట్లాదిమంది తల్లిదండ్రులపై ఈ వార్త పిడుగుపాటులా పడింది. ఈ ఎమ్ఐఎస్-సీ చికిత్స కూడా కష్టసాధ్యం కావడంతో వారి ఆందోళన రెట్టింపయింది. అసలీ ఎమ్ఐఎస్-సీ అంటే ఏంటి?.. ఇది ప్రస్తుతం కరోనాతో కలిసి చిన్నారులను వేధిస్తున్న వ్యాధి. ప్రస్తుతానికి కరోనా సోకిన చాలా మంది చిన్నారుల్లో లక్షణాలు చాలా తక్కువగానే కనిపిస్తున్నాయి. అదే సమయంలో వారిలో కొందరిలో ఈ ఎమ్ఐఎస్-సీ బయటపడుతోంది. దీని వల్ల చిన్నారుల శరీరంలోని గుండె, ఊపిరితిత్తులు, రక్తనాళాలు, కిడ్నీలు, జీర్ణవ్యవస్థ, మెదడు, చర్మం, కళ్లు వంటి భాగాలు ఎర్రగా వాచిపోతాయి. మంట ఎక్కువగా ఉంటుందట. ఈ లక్షణాలు కూడా శరీరంలోని ఏ భాగం ఈ వ్యాధి బారిన పడిందో అనే అంశంపై ఆధారపడి ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.


ఈ ఎమ్ఐఎస్-సీ ఏ వయసు వారిలో ఎక్కువగా వస్తుంది? అనే ప్రశ్నకు కూడా సరైన సమాధానం లేదు. ఇది ఎందుకు వస్తుందో కూడా వైద్యుల వద్ద సరైన అవగాహన లేదు. అమెరికాలోని న్యూయార్క్ నగరంలో జరిగిన కొన్ని పరిశోధనల ప్రకారం, జన్యుపరంగా ఉండే కొన్ని లక్షణాల వల్ల ఈ వ్యాధి సోకే ప్రమాదం ఉందని పరిశోధకులు భావిస్తున్నారు. ఇది సోకిన వారిలో కనిపించే లక్షణాలు కూడా వ్యాధి బారిన పడిన శరీరభాగం, తీవ్రత బట్టి మారుతుందని డాక్టర్లు చెప్తున్నారు. ఎక్కువగా కడుపునొప్పి, వికారం, వాంతులు, ఊపిరితీసుకోవడం ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇది కరోనా సోకిన చిన్నారుల్లో వెలుగు చూస్తుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది.


కరోనా సోకిన రెండు నుంచి ఆరువారాల తర్వాత ఎమ్ఐఎస్-సీ మొదలవుతోంది. ఈ వ్యాధి సోకిన పిల్లాడికి చేసిన ఆర్‌టీ-పీసీఆర్ పరీక్షలో నెగిటివ్ ఫలితం వచ్చేసరికి అతని రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయడం లేదని వైద్యులు తెలిపారు. దీని వల్ల శరీరంలో ఏ ప్రాంతమైనా దెబ్బతినవచ్చని, అయితే ఇది గుండెపై ప్రభావం చూపితే మాత్రం చాలా ప్రమాదకరమని ఫోర్టిస్ మెమోరియల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో పీడియాట్రిక్ క్రిటికల్ కేర్ విభాగం హెచ్ఓడీ, డైరెక్టర్ అయిన డాక్టర్ కృషన్ చుగ్ తెలిపారు. ఇది కార్డియాక్ షాక్ లేదంటే కరోనరీ ధమనులపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన చెప్పారు.  కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టిందని సంతోషిస్తున్న పెద్దవారు అప్రమత్తంగా ఉండాలని, లేదంటే కరోనా తగ్గిన చిన్నారుల్లో కొంతమంది ఎమ్ఐఎస్-సీ బారిన పడే అవకాశం ఉందని డాక్టర్ కృషన్ హెచ్చరించారు.

కరోనా సోకిన రెండు వారాలు దాటే వరకూ ఈ వ్యాధి బయటపడటం లేదు. ఇదే ప్రస్తుతం ఆందోళన కరమ అంశమని కొందరు వైద్యులు అంటున్నారు. ఇది సోకిన తొలిదశలోనే గుర్తిస్తే ఆస్పత్రుల్లో మంచి వైద్యం అందించవచ్చని చెప్తున్న వైద్యులు.. దీన్ని గుర్తించడం మాత్రం చాలా కష్టసాధ్యమని అంటున్నారు. ప్రస్తుత వేసవిలో మలేరియా, డెంగ్యూ, వైరల్ అంటువ్యాధులు, టైఫాయిడ్, కవాసాకి డిసీజ్ వంటి చాటున ఎమ్ఐఎస్-సీ దాగి ఉంటోందని, దాన్ని గుర్తించాలంటే చాలా కష్టమని తెలుస్తోంది. దీని గుర్తించాలంటే జ్వరం వచ్చిన రెండో రోజే దీనికి సంబంధించిన ల్యాబొరేటరీ పరీక్షలు నిర్వహించాలని వైద్యనిపుణుల సలహా. ఒకసారి ఇది సోకితే వాపును తగ్గించడం కోసం స్టెరాయిడ్స్ వాడతారట. అలాగే ఇవిగ్, స్టెరాయిడ్స్ వంటి ఇమ్యూనోమాడ్యులేటర్ చికిత్సలు వాడినప్పటికీ ఫలితం చాలా తక్కువగానే కనబడుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి చిన్నారులున్న తల్లిదండ్రుల.. కరోనా వెళ్లిపోయిందని చేతులు దులుపుకొని కూర్చోకుండా, ఇలాంటి వ్యాధులు రాకుండా పిల్లలను కాపాడుకోవాలని గుర్తించాలి.

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement