కరోనా కమ్మేస్తోంది!

ABN , First Publish Date - 2022-01-25T06:14:16+05:30 IST

జిల్లాలో కరోనా వైరస్‌ కమ్మేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే జిల్లాలో 502 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్‌ నిబంధనలను పెడచెవిన పెడు తూ విచ్చలవిడిగా వివిధ కార్యక్రమాలకు హాజరుకావడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందుతోంది.

కరోనా కమ్మేస్తోంది!

జిల్లాలో వేగంగా వ్యాప్తిచెందుతున్న వైరస్‌  

సోమవారం అత్యధికంగా 502 కేసుల నమోదు

ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వైద్యులు  

జ్వర సర్వేలో లక్షణాలు ఉన్నవారందరికీ మందుల పంపిణీ

నిజామాబాద్‌, జనవరి 24(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): జిల్లాలో కరోనా వైరస్‌ కమ్మేస్తోంది. రోజురోజుకూ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. సోమవారం ఒక్కరోజే జిల్లాలో 502 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. కొవిడ్‌ నిబంధనలను పెడచెవిన పెడు తూ విచ్చలవిడిగా వివిధ కార్యక్రమాలకు హాజరుకావడం వల్ల వైరస్‌ వ్యాప్తి చెందుతోంది. మాస్కు లు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం వల్ల రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతోంది. గ్రామం నుంచి జిల్లాకేంద్రం వరకు జ్వరాలు, కరోనా లక్షణాలతో అనేక మంది అవస్థలు పడుతున్నారు. జిల్లాలో నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేలో ఈ కేసులు ఎక్కువగా బయటపడుతున్నాయి. కరోనా వ్యాప్తి వేగంగా ఉన్న తీవ్రత తక్కువగా ఉండడంతో 98 శాతానికి పైగా పాజిటివ్‌ వచ్చినవారు ఇంటి వద్దనే చికిత్స పొందుతున్నారు. జిల్లాలో కరోనా లక్షణాలతో వైద్య ఆరోగ్య, పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ సిబ్బందితో పాటు ఇతర శాఖల సిబ్బంది కూడా హోం ఐసొలేషన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.

సర్వేలో బయటపడుతున్న కేసులు..

జిల్లాలో నిర్వహిస్తున్న ఫీవర్‌ సర్వేతో భారీగా కరోనా కేసులు బయట పడుతున్నాయి. సాధారణ జ్వరం, జలుబు, దగ్గుతో పాటు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. జిల్లాలో నాలుగు రోజులుగా ఈ సర్వేను నిర్వహిస్తున్నారు. ప్రతిరోజూ  1500 నుంచి 2వేల మధ్యన జ్వర లక్షణాలు ఉన్న కేసులు బయటపడుతున్నాయి. జిల్లాలో చేపట్టిన ఈ ఫీవర్‌ సర్వేలో ఇప్పటి వరకు 2లక్షల 87వేల 7 ఇళ్లను సర్వే చేశారు. ఈ సర్వేలో మొత్తం 10లక్షల 88వేల 476 మంది వివరాలను నమోదు చేశారు. జిల్లాలో ఇప్పటి వరకు 5686 మంది జ్వర, కరోనా లక్షణాలు ఉన్నవారిని గుర్తించారు. వారందరిని ఇంటి వద్దనే ఐసొలేషన్‌లో ఉండాలని కోరారు. ప్రతి ఒక్కరికీ మందులతో కూడిన కిట్లను అందజేశారు.

 స్వల్ప లక్షణాలే ఎక్కువ..

జిల్లాలో కొవిడ్‌ వ్యాప్తి గడిచిన రెండు వారాల్లో బాగా పెరిగినా పాజిటివ్‌ వచ్చిన వారికి స్వల్ప లక్షణాలే ఎక్కువగా ఉన్నాయి. మొదటి, రెండో వేవ్‌తో పోలిస్తే ఈ థర్డ్‌వేవ్‌లో ఎక్కువ మందికి తీవ్ర లక్షణాలు ఉండడంలేదు. పాజిటివ్‌ వచ్చిన వారిలో 98 శాతానికి పైగా మంది జలుబు, దగ్గు, సాధారణ జ్వరాలతోనే ఇబ్బందులు పడుతున్నారు. వైద్యుల సలహా మేరకు మందులను తీసుకుంటూ హోం ఐసొలేషన్‌లో చికిత్స పొందుతూ బయటపడుతున్నారు. సెకండ్‌వేవ్‌లో ఎక్కువ మంది శ్వాసతో ఇబ్బంది పడేవారు. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యాక్సినేషన్‌ చేయడం వల్ల థర్డ్‌వేవ్‌లో ఎక్కువ మందికి ఇబ్బందులు తలెత్తడంలేదని వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

స్వీయ నియంత్రణ పాటించాలి..

  కరోనా వ్యాప్తి ఎక్కువ కాకుండా అందరూ స్వీయ నియంత్రణ పా టిస్తే త్వరగా తగ్గించే అవ కాశం ఉంటుందని వారు కోరుతున్నారు. కరోనా లక్షణాలతో పాటు కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ కేసులు కూడా ఎక్కువగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. జిల్లాలో ఫీవర్‌ సర్వే ద్వారా జ్వరం, ఇతర లక్షణాలు ఉన్నవారిని గుర్తించి వెంటనే మందులను అందిస్తున్నామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ సుదర్శనం తెలిపారు. లక్షణాలు ఉన్నవారందరు తప్పనిసరిగా హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స తీసుకోవాలని కోరుతున్నారు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అందిస్తున్న మందులను పూర్తిస్థాయిలో వాడాలని కోరారు. సీరియస్‌గా ఉన్నవారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని ఆయన తెలిపారు.

Updated Date - 2022-01-25T06:14:16+05:30 IST