అదుపులో కరోనా

ABN , First Publish Date - 2020-04-10T11:04:17+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కరీంనగర్‌లో అదుపులోనే ఉంది. ఇప్పటి వరకు కరోనా సోకిన 18 మందిలో 11 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. గాంధీ

అదుపులో కరోనా

హాస్పిటల్‌ క్వారంటైన్‌ ఖాళీ 

నెగెటివ్‌ రిపోర్టులతో ఊరట 


కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 9: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌ కరీంనగర్‌లో అదుపులోనే ఉంది. ఇప్పటి వరకు కరోనా సోకిన 18 మందిలో 11 మంది చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయ్యారు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మిగిలిన ఏడుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. ఇందులో ఇండోనేషియన్లు 10 మంది కాగా, వారితో సన్నిహితంగా ఉన్న స్థానికులు మరో నలుగురు, ఢిల్లీ మర్కజ్‌కు వెళ్ళిన ముగ్గురు, వారిలో ఒకరి సోదరుడు కూడా కరోనా బారినపడ్డారు. ఇండోనేషియన్లతో సన్నిహితంగా, నేరుగా సంబంధాలు కలిగిన 73 మంది, మర్కజ్‌కు వెళ్లివచ్చిన 19 మందితోపాటు వారి కుటుంబసభ్యులు, సన్నిహితంగా ఉన్న 55 మందిని హాస్పిటల్‌ క్వారంటైన్‌కు తరలించారు.


వీరందరి నమూనాలను దశలవారీగా సేకరించి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం పంపించగా అందరికీ నెగెటివ్‌ రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. శాతవాహన యూనివర్సిటీ, చల్మెడ ఆనందరావు వైద్యవిజ్ఞాన సంస్థలోని హాస్పిటల్‌ క్వారంటైన్‌లో ఉన్న వారందరినీ డిశ్చార్జి చేసి హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన 18 మందిలో 11 మంది కోలుకోవడం, మిగిలిన వారి ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉండడంతో ఇక కరోనా వైరస్‌ వ్యాప్తి జరిగే అవకాశాలు తక్కువేనన్న అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయినా ఇండోనేషియన్లు పర్యటించిన కశ్మీరుగడ్డ, ముకరంపుర ప్రాంతాన్ని నిర్భంధంలోనే ఉంచడంతోపాటు ఆ ప్రాంతంపై ప్రత్యేక నిఘాను కొనసాగిస్తున్నారు.


రెండురోజులుగా ఈప్రాంతంలోని 3,807 ఇళ్లకు వెళ్లి ఆ కుటుంబసభ్యులకు స్ర్కీనింగ్‌ పరీక్షలను నిర్వహించారు.  హుజురాబాద్‌లోనూ రెండురోజులుగా 21 ప్రత్యేక వైద్య బృందాలు స్ర్కీనింగ్‌ పరీక్షలు నిర్వహించాయి. ఓవైపు దేశంలో, రాష్ట్రంలో రోజురోజుకు కరోనా బారినపడిన వారి సంఖ్య పెరుగుతుండడంగా కరీంనగర్‌లో మాత్రం  నెగెటివ్‌ రిపోర్టులు వచ్చాయి. అయినా ఈనెల 14వ తేదీ వరకు అత్యంత కీలకమైన రోజులుగా సూచిస్తుండడం, అప్పటి వరకు లాక్‌డౌన్‌ కూడా అమలులో ఉండడంతో జిల్లా ప్రజలు అప్రమత్తతంగా ఉండాల్సిన అవసరముంది. కరోనా పాజిటివ్‌ కేసులు వస్తే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసి ఉంది. లాక్‌డౌన్‌ ఎత్తివేసినా ఒకవేళ పొడగించినా ప్రజలు ప్రభుత్వ నిబంధనలను విధిగా పాటించి కరీంనగర్‌ను కరోనా రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజలు కలిసిరావాలని మంత్రి గంగుల కమలాకర్‌, ఎంపీ బండి సంజయ్‌కుమార్‌, జిల్లా కలెక్టర్‌ కె శశాంక, పోలీసు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి, నగర మేయర్‌ సునీల్‌రావు కోరారు. 


స్పూర్తినిచ్చేలా సేవా కార్యక్రమాలు: 

కరోనా కట్టడికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్యక్రమాలకు తమవంతు విరాళాలను అందించి బాసటగా నిలవాలనే సంకల్పంతో జిల్లాకు చెందిన పలు సంస్థల ప్రతినిధులు, వ్యాపారులు, విద్యావేత్తలు, సామాజిక సేవా కార్యకర్తలు స్వచ్చందంగా ముందుకు వస్తున్నారు. ప్రధాన మంత్రి, ముఖ్యమంత్రి సహాయ నిధికి తోచినంత విరాళాలను ప్రకటించి కొంత మంది నేరుగా ముఖ్యమంత్రికి, మరికొంత మంది మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, కలెక్టర్‌కు విరాళాల చెక్కులను అందజేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జిల్లా గ్రానైట్‌ అసోసియేషన్‌, మర్వాడి గ్రానైట్‌ వ్యాపారులు కోటి 75 లక్షలరూపాయల విలువ చేసే నగదు, వైద్య పరికరాలను అందించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు జిల్లాకు చెందిన 38 మంది దాతలు కలెక్టర్‌ ద్వారా సీఎం, పీఎం సహాయ నిధికి 37 లక్షల రూపాయల నగదును చెక్కుల రూపంలో అందించారు. మరోవైపు ఎంపీ బండి సంజయ్‌కుమార్‌తోపాటు ఆ పార్టీ నాయకులు, అభిమానులు కూడా పీఎం సహాయ నిధికి లక్షలాది రూపాయల విరాళాలను అందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బాసటగా నిలుస్తున్నారు. 


అన్నార్థులకు అండగా...

కరోనా నేపథ్యంలో లాక్‌డౌన్‌తో కకలా వికలమై ఆపన్న హస్తం కోసం నిరీక్షిస్తున్న నిరుపేదలు, కూలీలు, కార్మికులు, వలస జీవులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బియ్యం, ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నాయి. దీనికి తోడుగా మేమున్నామంటూ జిల్లాలోని వివిధ స్వచ్చంద, వ్యాపార, యువజన, మిత్ర సంఘాలు, ప్రజాప్రతినిధులు, రాజకీయనాయకులు, సామాజికవేత్తలు, కుల సంఘాలు, వృత్తి సంఘాలు, అసోసియేషన్లు తోచిన రీతిగా సహాయాన్ని అందిస్తున్నాయి.

Updated Date - 2020-04-10T11:04:17+05:30 IST