Abn logo
Sep 29 2020 @ 15:57PM

కరోనాతో 'కోలు' బొమ్మలు వెలవెల!

కోయంబత్తూర్: నవరాత్రి వచ్చిందంటే ఆ ప్రాంతం మొత్తం రంగురంగుల బొమ్మలతో నిండిపోతుంది. వచ్చేపోయే కస్టమర్లతో స్టాళ్లన్నీ కిక్కిరిసిపోతాయి. నిలబడటానికి కూడా సరిగా చోటుండదు. ఇంతలా బిజీ అయిపోయే ఆ ప్రాంతమే తమిళనాడులోని పూంపుహార్. తమిళనాడు హాండిక్రాఫ్ట్ డెవలప్‌మెంట్ లిమిటెడ్‌కు చెందిన కోయంబత్తూర్ బ్రాంచినే ఇలా పిలుస్తారు.

నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ పూంపుహార్‌లో ఏటా కోలు బొమ్మల ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు. ప్రఖ్యాత కట్టడాలు, దేవాలయాలు, దేవతల బొమ్మలూ అన్నింటినీ ఇక్కడ అమ్మకానికి పెడతారు. ఇక్కడ కొనుగోలు చేసే కస్టమర్లకు ఓ 10శాతం డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఏటా జరిగే ఈ ఎగ్జిబిషన్‌కు తమిళనాట విపరీతమైన క్రేజ్ ఉంది. రాష్ట్రం నలుమూలల నుంచి ఇక్కడ బొమ్మలు కొనేందుకు ప్రజలు వస్తారంటే అతిశయోక్తికాదు.

Kaakateeya

దేవీనవరాత్రులను పురస్కరించుకొని నిర్వహించే ఈ కోలు బొమ్మల ఎగ్జిబిషన్‌.. చేతివృత్తులు చేసే కళాకారులకు ఎంతో లబ్దిచేకూరుస్తుందని సమాచారం. ఇక్కడ ప్రముఖ దేవాలయాలు, గోపురాలు, దేవతల విగ్రహాల బొమ్మలూ అన్నీ దొరుకుతాయి. ఈ ఏడాది అయోధ్య రామాలయం బొమ్మలు ఎగ్జిబిషన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని నిర్వాహకులు చెప్తున్నారు.

ఏటా కస్టమర్లతో కిటకిటలాడే పూంపుహార్.. ఈ ఏడాది మాత్రం వెలవెలబోతోంది. కొనుగోలు దారులు అంతంతమాత్రంగానే ఎగ్జిబిషన్‌లో కనబడుతున్నారు. దీనంతటికీ కారణం కరోనా మహమ్మారే అని వ్యాపారులు అంటున్నారు. కరోనా భయంతో ప్రజలు ఎగ్జిబిషన్‌కు రావడం లేదని, దీనివల్ల వ్యాపారంపై తీవ్రమైన ప్రభావం పడిందని వాళ్లు చెప్తున్నారు. గతేడాది ఇదే సమయంలో వ్యాపారం భారీగా జరిగిందని, అయితే ఈసారి మాత్రం బిజినెస్ చాలా తక్కువగా ఉందని తెలియజేశారు.

కరోనా మహమ్మారి కారణంగా వెలవెలబోతున్న ఈ ఎగ్జిబిషన్‌ను ఆదుకునేందుకు నిర్వాహకులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. మాస్కులు ధరించడం తప్పనిసరి చేశారు. అలాగే ఎగ్జిబిషన్‌కు వచ్చే ప్రతిఒక్కరికీ శానిటైజర్లు అందుబాటులో ఉంచారు. అయినా సరే పరిస్థితిలో పెద్దగా మార్పులేదు. దీంతో వినూత్నంగా ఆలోచించిన నిర్వాహకులు.. ఈ కోలు బొమ్మలను ఆన్‌లైన్‌లో కూడా విక్రయించాలని నిర్ణయించారు. ఆర్డర్ ఇస్తే బొమ్మలను ఇంటికే డెలివరీ చేస్తామని ప్రకటించారు. ఈ విధానం కొంత సత్ఫలితాలనే ఇస్తోందని తెలుస్తోంది.

గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది కోలు బొమ్మల ఎగ్జిబిషన్‌లో జోరు తగ్గిందని పూంపుహార్ సిబ్బంది చెప్తున్నారు. ఈ ఏడాది కనీసం 50లక్షల రూపాయల అమ్మకాలు లక్ష్యంగా పెట్టుకున్నామని, కానీ పరిస్థితులు చూస్తుంటే ఈ లక్ష్యాన్ని చేరుకోవడం కష్టంగా కనబడుతోందని అంటున్నారు. ఆన్‌లైన్‌ అమ్మకాలు ప్రారంభించాక పరిస్థితి కొంత మెరుగైనప్పటికీ.. కేవలం ఆన్‌లైన్‌ అమ్మకాలతో గోల్ రీచ్ అవడం కష్టమని భావిస్తున్నారు. 

చాలామంది కళాకారులు కూడా ఎగ్జిబిషన్‌లో బొమ్మలు అమ్మడానికి రాలేదని తెలుస్తోంది. ఏటా కనీసం 20మంది కళాకారులు తమ పనితనాన్ని ప్రదర్శించేవారు. కానీ ఈ సారి 15మంది కూడా ఎగ్జిబిషన్‌కు తమ బొమ్మలు తీసుకురాలేదని సమాచారం. కరోనా కారణంగా ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న సదరు కళాకారులు.. బొమ్మల తయారీకి అవసరమైన ముడిసరుకు కూడా కొనుగోలు చేయలేకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ఏదిఏమైనా కరోనా మహమ్మారి కళాకారుల జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేయడం, ఈ కారణంగా ఏటా సందడిగా జరిగే కోలు బొమ్మల ప్రదర్శన వెలవెలబోవడం మాత్రం నిజం.

Advertisement
Advertisement
Advertisement