ఆగిన మగ్గం.. బతుకు ఛిద్రం

ABN , First Publish Date - 2021-05-18T05:25:46+05:30 IST

జిల్లాలో మాధవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైలవరం, బద్వేలు, రాజంపేట, పుల్లంపేట, మైదుకూరు, సింహాద్రిపురం, వల్లూరు ప్రాంతాల్లో చేనేత రంగంపై ఆధారపడిన నేత కార్మిక కుటుంబాల 15 వేలకు పైగానే ఉన్నాయి.

ఆగిన మగ్గం.. బతుకు ఛిద్రం
మాధవరంలో పని లేక మూలన పడ్డ మగ్గం

కరోనా వల్ల చేనేత కార్మికుల కష్టాలు తీవ్రం

ముడి సరుకు లేక మూలన పడ్డ మగ్గాలు

అర్ధాకలితో అలమటిస్తున్న చేనేతలు

ప్రభుత్వానికి నివేదిక పంపిన చేనేత జౌళి శాఖ అధికారులు


కరోనా కాటుకు చేనేత కార్మికులు విలవిల్లాడుతున్నారు. పోగు పోగు వడికి వసా్త్రలను ఉత్పత్తి చేస్తున్న చేనేతలు కరోనా మహమ్మారి వ్యాప్తితో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన విధించడంతో రవాణా వ్యవస్థ స్తంభించింది. వారంలో రెండు చీరలు నేసే కార్మికులు ప్రస్తుతం పదైదు రోజులకు ఒక చీర నేసేందుకు కూడా ధైర్యం చేయడం లేదు. ఓ పక్క ముడి సరుకు కొరత.. మరోపక్క నేసిన చీరలను కొనేవారు లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. చేనేతలకు అండగా నిలిచే మాస్టర్‌ వీవర్స్‌ బతుకులు కూడా దారుణంగా మారాయి. రూ.కోట్ల విలువైన చీరలు అమ్ముడుపోకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. పోషణ భారమై అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఉపాధి లేదు.. ప్రభుత్వం ఆదుకోదు.. పూట గడిచేది ఎలా..? చేనేత కార్మికుల ప్రశ్నలు ఇవి. కరోనా ఎఫెక్ట్‌ వల్ల చితికిన చేనేత కార్మికుల దీనస్థితిపై ప్రత్యేక కథనం.


(కడప-ఆంధ్రజ్యోతి): జిల్లాలో మాధవరం, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైలవరం, బద్వేలు, రాజంపేట, పుల్లంపేట, మైదుకూరు, సింహాద్రిపురం, వల్లూరు ప్రాంతాల్లో చేనేత రంగంపై ఆధారపడిన నేత కార్మిక కుటుంబాల 15 వేలకు పైగానే ఉన్నాయి. 210 చేనేత సహకార సంఘాలు ఉన్నాయి. సహకార, సహకారేతర రంగంలో 11,947 మంది మగ్గంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నట్లు చేనేత, జౌళి శాఖాధికారులు అంటున్నారు. అయితే.. 15 వేలకు పైగా చేనేతల కుటుంబాలకు చేనేత వస్త్ర ఉత్పత్తే జీవనాధారం. భార్యాభర్తలు ఇద్దరూ రోజంతా కష్టపడినా వచ్చే కూలీ రూ.500-700లకు మించదు. మరమగ్గాల పోటీ, మార్కెట్‌ మాయాజాలంతో చితికిపోతున్నారు. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లు కరోనా మహమ్మారి చేనేత రంగాన్ని కోలుకోని దెబ్బతీసింది. అయితే.. నేతన్నలకు వర్క్‌ లాస్‌ కింద ఆర్థిక సహాయం అందించాలని ప్రభుత్వానికి నివేదిక పంపామని చేనేత జౌళి శాఖ అధికారులు తెలిపారు. 


పూట గడిచేదెలా..?:

జిల్లాలో ముప్పాతిక శాతం మంది చేనేత కార్మికులు మాస్టర్‌ వీవర్స్‌పై ఆధారపడి జరీ అంచు పట్టు చీరలు నేస్తున్నారు. రాష్ట్రంలో కర్ఫూ, తెలంగాణా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో లాక్‌డౌన కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించింది. చీరల ఉత్పత్తికి అవసరమైన నూలు, సిల్క్‌, జరీ ఉత్పత్తి చేసే మిల్లులు మూతపడ్డాయి. ముడిసరుకు రావడం లేదు. అంతేకాదు.. కరోనా వల్ల వివాహాలు వంటి శుభకార్యాలను పలువురు వాయిదా వేసుకున్నారు. తప్పదనుకుంటే సాదాసీదాగా పెళ్లిళ్లు చేస్తున్నారు. దీంతో పట్టుచీరల అమ్మకాలు సగానికి పైగా పడిపోయాయి. మాస్టర్‌ వీవర్స్‌ వద్ద ఉన్న ముడిసరుకుకు వారం రోజులు పని చూపారు. ప్రస్తుతం మగ్గం మూలన పడింది. ఉపాధి లేదు.. అడ్వాన్స కోసం మాస్టర్‌ వీవర్స్‌ వద్దకు వెళితే నేసిన చీరలే అమ్ముడుపోక రూ.లక్షల స్టాక్‌ ఆగిపోయింది.. అడ్వాన్స ఎలా ఇవ్వగలమని అంటున్నారు. ఎలా బతకాలో దిక్కుతోచడం లేదని నేతన్నలు కన్నీరు పెడుతున్నారు. రోజంతా కష్టపడితే రూ.700 కూలీ వస్తుంది. జిల్లాలో 15 వేల చేనేత కుటుంబాలు ఉన్నాయి. చీరల ఉత్పత్తితో కుటుంబ పోషణ, పిల్లల చదువులకు ఫీజులు, ఇంటి అద్దె, కరెంట్‌ బిల్లులు, ఇతర ఖర్చులు చూసుకునేవారు. ఈ నెలంతా పని లేక అర్ధాకలితో అలమటించాల్సి వస్తుందని ఏకరువు పెడుతున్నారు.


ఆర్థిక చేయుత అందివ్వాలి

ఈ విపత్కర పరిస్థితుల్లో ‘వర్క్‌ లాస్‌’ కింద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మగ్గం ఉన్న ఒక్కో కుటుంబానికి రూ.15 వేలు ఇచ్చి ఆదుకోవాలని కోరుతున్నారు. జరీపై 12 శాతం, రంగులపై 18 శాతం, నూలుపై 5 శాతం, సిల్క్‌పై 8 శాతం.. ఇలా ముడిసరుకుపై విధించే జీఎ్‌సటీ పూర్తిగా రద్దు, 5 శాతం సేల్‌ ట్యాక్స్‌ వాయిదా చేసి మాస్టర్స్‌ వీవర్స్‌కు ఆర్థిక చేయూత అందించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అప్పుడే వేల కుటుంబాలకు ఉపాధి చూపే చేనేత రంగం కొంతైనా కోలుకుంటుంది. తద్వారా కార్మికులకు ప్రయోజనం లభిస్తుంది. 


ఈ నెలంతా పని లేదు 

- భీమశెట్టి రాజేంద్ర, చేనేత కార్మికుడు, మాధవరం, సిద్దవటం మండలం

చేనేత మగ్గమే నాకు జీవనాధారం. నేను, నా భార్య, ఇద్దరు పిల్లలు మా కుటుంబం. నేను, నా భార్య ఇద్దరం కష్టపడితే రోజూ రూ.600 వస్తుంది. ఉన్నదాంట్లో సర్దుకుంటూ కాలం వెళ్లదీస్తున్నాం. కరోనా వల్ల ఈ నెలంతా పనులు లేవు. మగ్గం మూలనపడి ఉపాధి కొల్పోయాం. మాస్టర్‌ వీవర్స్‌ దగ్గర ముడిసరుకు ఉన్నన్నాళ్లు కాస్తోకూస్తో పని చూపారు. ముడిసరుకు లేక ఆ పని కూడా ఆగిపోయింది. ఇంటి అద్దె కట్టలేని దైన్యస్థితి మాది. ప్రభుత్వం వర్క్‌లాస్‌ కింద ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలి. 


ప్రభుత్వానికి నివేదిక పంపించాం 

- ఎస్‌.అప్పాజీరావు, చేనేత, జౌళీ శాఖ ఏడీ, కడప

కరోనా వల్ల చేనేత కార్మిక కుటుంబాలు నష్టపోతున్న మాట వాస్తవమే. కరోనా బారిన పడిన చేనేత కార్మికులు ఆక్సిజన అందక ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరి వేలకు వేలు డబ్బు ఖర్చు చేసుకున్నారు. ఆ డబ్బు తిరిగి చెల్లించాలని, వర్క్‌ లాస్‌ కింద రోజుకు రూ.500-600లకు పైగా నష్టపోతున్నారు. వర్క్‌లాస్‌ పరిహారం చెల్లించాలని ప్రభుత్వానికి నివేదికను పంపించాం. మాస్టర్స్‌ వీవర్స్‌ కూడా ఆర్థికంగా నష్టపోతున్నారు. వారికి కూడా ఆర్థిక చేయూత అందించాలని కోరాం. 

Updated Date - 2021-05-18T05:25:46+05:30 IST