విలయ తాండవం

ABN , First Publish Date - 2021-04-17T07:19:59+05:30 IST

దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గంటగంటకూ పరిస్థితి మారిపోతున్నది. ఆక్సిజన్‌ సిలిండర్ల నుంచి అంబులెన్స్‌ల వరకు.. ఆస్పత్రుల్లో పడకల నుంచి రెమ్‌డెసివిర్‌ ఔషధం వరకు..

విలయ తాండవం

దేశంలో గంటగంటకూ విషమంగా పరిస్థితి

ఆక్సిజన్‌ నుంచి అంబులెన్స్‌ల వరకు అన్నిటికీ డిమాండ్‌

తీవ్ర ఒత్తిడిలో వైద్య వ్యవస్థ.. కుప్పకూలే ప్రమాదం!

నేడు రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో హర్షవర్ధన్‌ భేటీ

కర్ణాటక సీఎం యడియూరప్పకు రెండోసారి కరోనా

కేంద్ర మంత్రి జావడేకర్‌, కాంగ్రెస్‌ నేత డిగ్గీకి కొవిడ్‌

దేశంలో రెండో రోజూ 2 లక్షలకు పైగా కేసుల నమోదు

కరోనాతో సీబీఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా మృతి


న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. గంటగంటకూ పరిస్థితి మారిపోతున్నది. ఆక్సిజన్‌ సిలిండర్ల నుంచి అంబులెన్స్‌ల వరకు.. ఆస్పత్రుల్లో పడకల నుంచి రెమ్‌డెసివిర్‌ ఔషధం వరకు.. ఆరోగ్యం విషమంగా ఉన్న రోగులకు ప్లాస్మా దానం నుంచి శ్మశానాల్లో అంత్యక్రియలకు స్థలం వరకు అన్నిటికి డిమాండ్‌ పెరుగుతోంది. ఈ ఒత్తిడిని తట్టుకునే పరిస్థితిలో లేక వైద్య వ్యవస్థ కుప్పకూలే ప్రమాదం కనిపిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిలయంగా ఉన్న ఢిల్లీలో అసాధారణ రీతిలో కరోనా విజృంభణతో పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ముంబై కంటే ఇక్కడ వైరస్‌ ఉధృతి దాదాపు రెట్టింపుగా ఉంది. ఆధునిక వైద్య సదుపాయాలు, ఎయిమ్స్‌, సఫ్దర్‌జంగ్‌, రాంమనోహర్‌ లోహియా వంటి ప్రభు త్వ ఆస్పత్రులు ఉన్న ఢిల్లీ ఇలాంటి స్థితిని ఎదుర్కొంటుండడంతో ప్రధాని కార్యాలయం సైతం తీవ్ర ఆందోళనకు గురైనట్లు తెలిసింది. తాము సర్వసన్నద్ధంగా ఉన్నామని.. అయితే కేసుల ఉధృతిని తట్టుకోవడం ఎలాగన్నదే సవాలుగా మారిందని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్ధన్‌ అన్నారు. ‘‘వైరస్‌ బాధితులను చూసి నా హృదయం ఆవేదనకు గురవుతోంది’’ అని ఢిల్లీ ఎయిమ్స్‌ ట్రామా సెంటర్‌లో రోగులను పరామర్శించిన తర్వాత వ్యాఖ్యానించారు.


రెమ్‌డెసివిర్‌కు రాష్ట్రాల వెదుకులాట

మహారాష్ట్రలో రెండు, మూడు రోజులకు మించి నిల్వలు లేవని మంత్రి ప్రకటించారు. యూపీ ప్రభుత్వం అధికారులను ప్రత్యేక విమానంలో గుజరాత్‌కు పంపించి 25 వేల డోసులు తెప్పించుకుంది. పదివేల రెమ్‌డెసివిర్‌ ఇంజక్షన్లు కావాలని కేంద్రాన్ని ఉత్తరాఖండ్‌ ప్రధాన కార్యదర్శి ఓం ప్రకాష్‌ కోరారు. దేశంలో పరిస్థితి తీవ్రం అవుతుండడంతో  కేంద్ర ఆరోగ్య మంత్రి డా.హర్షవర్ధన్‌ శనివారం వివిధ రాష్ట్రాల ఆరోగ్య మంత్రులతో సమావేశం కానున్నారు. సోమవారం దేశంలోని ఎయిమ్స్‌ అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు రెమ్‌డెసివిర్‌ను నల్లబజారుకు తరలిస్తే  కఠిన చర్య తీసుకుంటామని హెచ్చరించారు. ఎయిమ్స్‌ ట్రామాకేర్‌ సెంటర్‌లో ప్రస్తుతం 266 పడకలు ఉండగా.. 253 నిండిపోయాయని, మరో 70 పడకలను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఎయిమ్స్‌ ఝాజ్జర్‌ క్యాంప్‌సలో అదనంగా 100 పడకలను ఏర్పాటు చేస్తామన్నారు.  


దేశంలో మళ్లీ 2 లక్షలపైగా కేసులు

దేశంలో వరుసగా రెండో రోజు 2 లక్షల పైగా కేసులు నమోదయ్యాయి. గురువారం అత్యధికంగా 2,17,353 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. 1,185 మంది చనిపోయారు. సెకండ్‌ వేవ్‌లో ఇవే అత్యధికం. అంతేకాక, గత సెప్టెంబరు 19 తర్వాత ఈ స్థాయిలో మరణాలు మొదటిసారి. మరో 1.18 లక్షల మంది డిశ్చార్జి అయ్యారు. తాజా కేసుల్లో 80 శాతం మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, ఢిల్లీ, ఛత్తీ్‌సగఢ్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌లోనే నమోదైనట్లు కేంద్రం పేర్కొంది. క్రితం రోజు వరకు ఈ జాబితాలో రాజస్థాన్‌ ఉండగా.. కొత్తగా పశ్చిమబెంగాల్‌ చేరింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా 16 రాష్ట్రాల్లో ఉధృతి ఉందని కేంద్రం తెలిపింది. కాగా, యాక్టివ్‌ కేసులు 15.69 లక్షలకు చేరాయి. దేశంలోటీకా పంపిణీ ప్రారంభమై మూడు నెలలైంది. ఈ వ్యవధిలో 11.72 కోట్ల మందికి టీకా వేశారు. గురువారం 27.30 లక్షల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. శుక్రవారంతో అత్యధిక కేసులు నమోదైన ఐదు రాష్ట్రాల జాబితాలోకి ఏపీ చేరింది. మహారాష్ట్రలో 3,578,160, కేరళలో 1,189,175, కర్ణాటకలో 1,094,912, తమిళనాడులో 9,54,948, ఆంధ్రప్రదేశ్‌లో 9,37,049 మంది కరోనాకు గురయ్యారు.

  • ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వచ్చే నెల 15వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో ఆదివారాలు లాక్‌డౌన్‌ ప్రకటించింది. మాస్క్‌ లేకుండా మొదటిసారి పట్టుబడినవారికి రూ.వెయ్యి, రెండోసారి దొరికితే రూ.10 వేలు జరిమానా విధించనున్నారు. రాష్ట్రంలో గురువారం 22,500 కేసులు వచ్చాయి. 104 మంది చనిపోయారు. శుక్రవారం ఏకంగా 27,500 మందికి వైరస్‌ నిర్ధారణ అయింది. కాగా, లఖ్‌నవూలో కొత్తగా వెయ్యి పడకలతో ఆస్పత్రిని ఏర్పాటు చేయనున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. శుక్రవారం రాత్రి నుంచి ఢిల్లీలో కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. 
  • ఉత్తరప్రదేశ్‌, ఛత్తీ్‌సగఢ్‌లో కేసులు పెరుగుదలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా, ఆరోగ్య మంత్రిత్వ కార్యదర్శి రాజేశ్‌ భూషణ్‌ వేర్వేరు సమావేశాల్లో పరిస్థితిని సమీక్షించారు. గత రెండువారాల్లో ఛత్తీ్‌సగఢ్‌లో కేసులు 131% పెరిగాయి. కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌కు కొవిడ్‌ నిర్ధారణ అయింది. కర్ణాటక సీఎం యడియూరప్పకు రెండోసారి కరోనా సోకింది. కేంద్ర మాజీ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌, కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్‌ సింగ్‌, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి రణదీప్‌ సూర్జేవాలాకు వైరస్‌ సోకింది. సీబీఐ మాజీ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా(68) కరోనాతో మృతిచెందారు.


ప్లాస్మా దాతలు కావాలంటూ వేడుకోలు

కరోనా బాధితులకు ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకురావాలంటూ సోషల్‌ మీడియాలో లక్షల్లో వినతులు వస్తున్నాయి. మరోవైపు కరోనా సెకండ్‌ వేవ్‌లో భారీగా మరణాలతో శ్మశానాల్లో అంత్యక్రియలకు స్థలం, సమయం దొరకడం కష్టమైపోతున్నది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఓ వర్గం వా రు.. తమ ఆచారానికి భిన్నంగా, మృతదేహాలను దహనం చేయాలని.. అనంతరం బూడిదను సమాధుల్లో భద్రపరుస్తామని కోరారు.  మధ్యప్రదేశ్‌లోని శివపురిలో ఒక రోగికి అమర్చిన ఆక్సిజన్‌ సిలిండర్‌ ను తీసి మరొకరికి అమర్చిన ఉదంతం వెలుగుచూసింది. దీంతో ఆక్సిజన్‌ తొలగించిన రోగి మరణించాడు. ఆస్పత్రుల్లో రెమ్‌డెసివిర్‌ కొరత ఏర్పడింది. 


రాష్ట్రం కేసులు మరణాలు

    (గురువారం గణాంకాలు) 

మహారాష్ట్ర 61,695 349

ఉత్తరప్రదేశ్‌ 22,439 104

ఢిల్లీ 16,699 112

ఛత్తీ్‌సగఢ్‌ 15,256 135

కేరళ 8,126 20

మధ్యప్రదేశ్‌ 10,166 53

పశ్చిమ బెంగాల్‌ 6,769 22

కర్ణాటక 14,738 66

తమిళనాడు 7,987 29

గుజరాత్‌ 8,152 81

Updated Date - 2021-04-17T07:19:59+05:30 IST