కరోనా ఎఫెక్ట్‌...జీతాలు ఫట్‌

ABN , First Publish Date - 2020-08-09T11:16:48+05:30 IST

కరోనా మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజ మాన్యాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై ఇది తీవ్ర ప్రభావం ..

కరోనా ఎఫెక్ట్‌...జీతాలు ఫట్‌

సాంఘిక సంక్షేమ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది జీతాలు పెండింగ్‌ 

పాత వారికి మూడు నెలలు.. కొత్త వారికి 6 నెలల వేతనాల నిలిపివేత 

అసలు ఇస్తారో.. ఇవ్వరో స్పష్టత ఇవ్వని అధికారులు 

కాలేజీ వసతి గృహాల్లో కొత్తగా చేరిన వారిని తొలగిస్తారని ప్రచారం 

మార్చి నుంచి ఇంటికే పరిమితమైన తాత్కాలిక ఉద్యోగులు 


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి అన్ని రంగాలను అతలాకుతలం చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్‌ యాజ మాన్యాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై ఇది తీవ్ర ప్రభావం చూపింది. ఈ క్రిమి అన్నింటిపై దాడి చేసి వ్యవస్థను చీకటిమయం చేసింది. ప్రభుత్వ ఉద్యోగులకు రెండు నెలల వేతనంలో కనిష్టంగా కొంత జీతం తగ్గించి చెల్లించినప్పటికీ, తరువాత నెలల్లో ప్రభుత్వం లోటు భర్తీ చేసి రెగ్యులర్‌ ఉద్యోగులకు ప్రభుత్వం పూర్తి వేతనాలను చెల్లించింది. కానీ ఆయా ప్రభుత్వ శాఖల్లో ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్న తాత్కాలిక ఉద్యోగులపై మాత్రం శీతకన్ను వేసింది.  ముఖ్యంగా జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలోని వసతి గృహాల్లో పనిచేస్తున్న సుమారు 160 మంది ఉద్యోగులకు 3, 6 నెలల నుంచి ప్రభుత్వం జీతాలు మంజూరు చేయకుండా నిలిపివేసింది. దీనిపై ఈ శాఖ అధికారులు ఉద్యోగుల పట్ల మానవత్వంతో వ్యవహరించి వారికి జీతాలు వచ్చేలా ప్రయత్నించకపోగా కరోనా వల్ల వసతి గృహాలు మూసేస్తే, ప్రభుత్వం ఎందుకు జీతాలిస్తుందని చెబుతుండడం విశేషం. సాంఘిక సంక్షేమ శాఖలో 65 ప్రీ మెట్రిక్‌ వసతి, 28 పోస్టు మెట్రిక్‌ వసతి గృహాల్లో సుమారు 240 మంది సిబ్బంది వికాసా ఏజన్సీ ద్వారా ఔట్‌ సోర్సింగ్‌లో పనిచేస్తున్నారు.


ఇందులో 120 మంది 15 ఏళ్ల నుంచి ఈ శాఖను నమ్ముకుని, సీనియార్టీ ప్రకారం ఎప్పటికైనా రెగ్యులర్‌ అవుతామని కష్టపడి విధులు నిర్వహిస్తున్నారు. ఈ 120 మందిలో 33 మంది గత రెండేళ్ల కిందట ప్రభుత్వం భర్తీ చేసిన బ్యాక్‌లాగ్‌ పోస్టుల్లో అర్హత సాధించారు. కోర్టుల్లో కేసులు ఉండడం వల్ల వీరికి రెగ్యలర్‌ పోస్టింగ్‌ ఇవ్వడానికి జిల్లా యంత్రాంగం అప్పట్లో వెనకడుగు వేసింది. కేసు క్లియర్‌ అయ్యాక వీరికి పోస్టింగ్‌ ఇవ్వాల్సిన అధికారులు సంబంధిత ఫైల్‌ను పక్కన పడేశారు. దీంతో ఎప్పటికైనా రెగ్యులర్‌ అవు తామని వీరు ఎదురు చూస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ 120 మందికి కరోనా సాకుగా చూపి వసతి గృహాలు మూసేసినందున మే నెల నుంచి ఇప్పటివరకు జీతాలివ్వలేదు. వీరికి ప్రతీ నెలా రూ.12,500 వేతనం ఏప్రిల్‌ వరకు చెల్లించారు. తర్వాత నుంచి ఆపేశారు.    


ఒక్క నెల జీతం కూడా ఇవ్వలేదు

జిల్లాలో 28 పోస్టు మెట్రిక్‌ వసతిగృహాల్లో ఈ ఏడాది జనవరి నెలలో విద్యార్థుల సౌకర్యార్థం కొత్తగా ఒక్కో వసతి గృహంలో ముగ్గురు, నలుగురు చొప్పున సుమారు 120 మందిని వికాసా ద్వారా ఏడాది ఔట్‌ సోర్సింగ్‌లో భర్తీ చేశారు. 6 నెలలు ముగిసినా వీరికి ఒక్క నెల వేతనం రూ. 10,500 చెల్లించలేదు. పైగా కేడర్‌ స్ర్టెంగ్త్‌ ఇతర జిల్లాలకంటే ఈ జిల్లాలో ఎక్కువగా ఉందని, ఏ జీవో ప్రకారం కొత్త వారిని నియమించారని, వీరిని తొలగించాలని ఈ శాఖ అధికారులు భావిస్తు న్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఉద్యోగం వచ్చిందని సంబరపడాలో, జీతం లేకుండా ఇంత కాలం పనిచేసి, కరోనా వల్ల ఇంటికి పరిమితమైన తమను ఇప్పుడు తొలగిస్తారని అంటుండడంతో ఏం చేయాలో అంతుబట్టడం లేదని వారు గగ్గోలు పెడుతున్నారు. తమను కొనసాగించి పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని ప్రాధేయపడుతున్నారు. ఈ విషయంలో తమ శాఖ జేడీ చొరవ చూపి తమ కుటుంబాలకు పట్టెడన్నం పెట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 


బీసీ సంక్షేమ శాఖలో చెల్లించిన జీతాలు 

సాంఘిక సంక్షేమ శాఖ తరహాలోనే జిల్లా బీసీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందికి మే, జూన్‌ నెల జీతాలు మూడు రోజుల కిందట చెల్లించారు. లాక్‌డౌన్‌ సమ యంలో ఈ శాఖ వసతి గృహాలు కూడా మూత పడ్డాయి. సిబ్బంది ఇంటికే పరిమితమయ్యారు. అయినప్పటికీ ఈ శాఖ అధికారులు తమ సిబ్బంది ఆర్థిక ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సఫలీకృతమయ్యారు. దీంతో ఈ శాఖ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-08-09T11:16:48+05:30 IST