కరోనా ఉధృతి నేపథ్యంలో జనవరి 26న దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్ డే పరేడ్‌కు 5వేల నుంచి 8వేల మందినే అనుమతించనున్నారు. గతేడాది 25వేల మందిని అనుమతించగా, ఈ దఫా ఆ సంఖ్యను 75 శాతం మేర తగ్గించారు. కరోనా మహమ్మారి దృష్ట్యా ఏటా వేడుకలకు హాజరయ్యే వారి సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నారు. ఇక వరుసగా రెండో ఏడాది కూడా గణతంత్ర దినోత్సవాలకు విదేశీ ప్రముఖులెవరూ హాజరుకావడం లేదు. పొగమంచు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున పరేడ్‌ను అరగంట ఆలస్యంగా ఉదయం 10.30 గంటలకు ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి మోదీ ఢిల్లీలోని జాతీయ యుద్ధ స్మారక చిహ్నం వద్ద సైనికులకు నివాళులర్పించిన సమయంలోనే.. దేశవ్యాప్తంగా ఎన్సీసీ సభ్యులు కృతజ్ఞతా వందనం సమర్పిస్తారు.
రిపబ్లిక్ డే భద్రతా ఏర్పాట్లలో భాగంగా జనవరి 20 నుంచి ఫిబ్రవరి 15 వరకు ఢిల్లీ గగనతలంలోకి డ్రోన్లు, పారాగ్లైడర్లు, హాట్ ఎయిర్ బెలూన్ల ప్రయోగంపై ఢిల్లీ పోలీసు విభాగం నిషేధం విధించింది. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా జనవరి 29న ‘బీటింగ్ ది రిట్రీట్’ వేడుక జరగనుంది. ఇందులో భాగంగా దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఐఐటీ ఢిల్లీకి చెందిన ఒక స్టార్టప్ దేశీయంగా అభివృద్ధిచేసిన 1000 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన ఇవ్వనుంది.