బతకలేక బడి పంతుళ్లు!

ABN , First Publish Date - 2020-06-07T06:32:11+05:30 IST

నెల్లూరు వేదాయపాళెంకు చెందిన వెంకటసుబ్బయ్య ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, ఏంఏ తెలుగు, బీఈడీ పూర్తి చేసి పలు ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుడిగా పని చేశారు. లాక్‌డౌన్‌లో కూడా ఆన్‌లైన్‌ తరగతులకు

బతకలేక బడి పంతుళ్లు!

  • ప్రైవేటు టీచర్లపై కరోనా ఎఫెక్ట్‌
  • స్కూళ్ల మూతతో ఉపాధికి దూరం
  • నిబంధనలతో జీతాలకు కొర్రీ
  • అంత చేసినా ఉద్యోగం అనుమానమే!
  • వీధి వ్యాపారం, కారు డ్రైవింగ్‌తో జీవనం
  • ఆదుకోవాలని వేడుకోలు


నెల్లూరు వేదాయపాళెంకు చెందిన వెంకటసుబ్బయ్య ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌, ఏంఏ తెలుగు, బీఈడీ పూర్తి చేసి పలు ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఉపాధ్యాయుడిగా పని చేశారు. లాక్‌డౌన్‌లో కూడా ఆన్‌లైన్‌ తరగతులకు సేవలందించారు. అయినా యాజమాన్యాలు జీతాలు ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కోసం పండ్ల వ్యాపారం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. 


ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలల్లో బోధన చేసే నరేష్‌ ప్రస్తుతం యాక్టింగ్‌ కారు డ్రైవర్‌గా మారాడు. ఏంఏ బీఈడీ పూర్తి చేసిన ఆయనకు తాను పని చేసిన యాజమాన్యాలు జీతాలు ఇవ్వకపోవడంతోనే ఈ పరిస్థితి ఏర్పడింది. తిరిగి పాఠశాలలు ఎప్పుడు తెరుస్తారో, తనకు జీతాలు ఇస్తారో లేదో కూడా తెలియని పరిస్థితుల్లో బతుకుతున్నట్లు ఆవేదన చెందారు. 


మూడు నెలల క్రితం వరకు దర్జాగా.. మర్యాద పూర్వకంగా జీవనం సాగించిన ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల ఉపాధ్యాయులు కరోనా పుణ్యమా అని వీధినపడ్డారు. విద్యాసంస్థలకు అండగా ఉంటూ యాజమాన్యాల  ఉన్నతికి పాటుపడిన సిబ్బందికి నేడు జీతాల్లేక జీవనం కష్టంగా మారింది. ప్రభుత్వాలు జీతాలివ్వమని చెబుతున్నా లెక్కచేయడం లేదు. దీంతో వాటిల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు తప్పనిసరి పరిస్థితుల్లో రోడ్డుపై పండ్ల వ్యాపారాలు, కరెంటు, పెయింట్‌ పనులు, కారు డ్రైవింగ్‌లు చేస్తుండగా ఇంకొందరు తమకు తోచిన పనులకు వెళుతున్నారు.


నెల్లూరు (విద్య) జూన్‌ 6 : జిల్లాలోని ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు లాక్‌డౌన్‌ కారణంగా మార్చి 22వ తేదీ నుంచి మూతపడ్డాయి. వీటిల్లో పనిచేసే వేలాదిమంది బోధన, బోధనేతల సిబ్బందికి కొన్ని పాఠశాలలు మార్చి నెల జీతాలు ఇవ్వగా, మరికొన్ని మార్చి 21వ తేదీ వరకు జీతాలు చెల్లించాయి. ఏప్రిల్‌ నెల నుంచి వీరు పని చేయకపోవడంతో జీతాలు ఇవ్వలేమని, తాము ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని యాజమాన్యాలు చెప్పడంతో సిబ్బంది మనోవేదనకు గురవుతున్నారు. పైగా విద్యార్థుల నుంచి పెండింగ్‌ ఫీజులన్నీ వసూలు చేస్తే జీతాలిస్తామని చెప్పడంతో ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఫీజుల కోసం వెళితే తల్లిదండ్రులు నుంచి వ్యతిరేకత వస్తోందని వాపోతున్నారు. 


అడ్మిషన్ల టార్గెట్‌..

అసలే కష్టాల్లో ఉన్న ప్రైవేటు ఉపాధ్యాయులకు అడ్మిషన్ల కష్టాలు కూడా తోడయ్యాయి. ప్రతి ఉపాధ్యాయుడు ఫీజులు వసూలు చేయడంతోపాటు ఖచ్చితంగా విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించాలి. లేని పక్షంలో ఉద్యోగం ఉండదంటూ తేల్చి చెబుతున్నారు. అసలే మూడు నెలలుగా జీతాల్లేక అవస్థలు పడుతుంటే కొత్తగా ఈ అడ్మిషన్ల లింకులు పెడుతున్నారని ఆవేదన చెందుతున్నారు. ఒకవేళ పాఠశాల తెరిచే వరకు కష్టపడి ఎలాగోలా అప్పులు చేసైనా కుటుంబాన్ని పోషిస్తే పాఠశాల తెరిచాక ఉద్యోగం ఉంటుందో, ఊడుతుందో కూడా తెలియని దుస్థితి. 


పలు రకాల పనులతో జీవనం..

ప్రైవేట్‌ యాజమన్యాలు జీతాలు ఇవ్వకపోవడంతో ఉపాధ్యాయులు కొందరు కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్నారు. మరికొంతమంది పెయింటింగ్‌ పనులు, వైరింగ్‌ పనులు, ఉపాధి పనులకు కూడా వెళుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. యాజమాన్యాలు జీతాలు ఇవ్వకపోగా కనీసం కుటుంబం గడిచేందుకు నిత్యావసరాలు కూడా అందించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉపాధ్యాయులకు సంబంధించి ప్రైవేట్‌ టీచర్స్‌ అసోసియేషన్‌గా ఏర్పడి తమ సమస్యలను విద్యాశాఖ దృష్టికి కూడా తీసుకెళ్లారు. దీనిపై డీఈవో సైతం యాజమాన్యాలతో చర్చించారు. అయితే యాజమాన్యాలు మాత్రం తమకు ఫీజులు దండుకునేందుకు అనుమతులిస్తే వచ్చిన ఫీజులతో జీతాలు చెల్లిస్తామని, లేనిపక్షంలో చెల్లించలేమని తేల్చి చెప్పాయి. దీంతో చేసేదేం లేక ఉపాధ్యాయులంతా తమకు నచ్చిన పనులకు వెళుతూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. 


చాలా ఇబ్బందులు పడుతున్నాం

ప్రైవేట్‌ పాఠశాలల్లో పని చేస్తున్నా నోవర్క్‌, నోపే కింద జీతాలు ఇవ్వడం లేదు. ఫీజులు రాక తాము నష్టాల్లో ఉన్నామని యాజమాన్యాలు  చెబుతున్నాయి. ఇప్పటికే మూడు నెలలు గడిచిపోయాయి. మరో మూడు నెలలు కూడా పాఠశాలలు తెరుచుకోవు. ఈ పరిస్థితుల్లో కుటుంబపోషణ కోసం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. 

కేవీకే.విశ్వమోహన్‌, ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్స్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు


యాజమాన్యాలు పట్టించుకోవడం లేదు

పని చేసినంత కాలం వారికి సేవలందించి వారి ఉన్నతికి కృషి చేశాము. కష్టకాలంలో తమను ఆదుకోవాల్సిన యాజమాన్యాలు పట్టించుకోవడం మానేశాయి. భద్రతలేని ఉద్యోగాలు కావడంతో ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాం. ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించాలి. 

కె.ధనపాల్‌, ప్రైవేట్‌ స్కూల్‌ టీచర్స్‌ సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు

Updated Date - 2020-06-07T06:32:11+05:30 IST