విద్యుత్‌ వినియోగంపై కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2020-03-31T10:16:59+05:30 IST

కరోనా రక్కసి కారణంగా పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. తొమ్మిదిరోజులుగా

విద్యుత్‌ వినియోగంపై  కరోనా ఎఫెక్ట్‌

కడప (సిటి), మార్చి 30: కరోనా రక్కసి కారణంగా పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూతపడ్డాయి. తొమ్మిదిరోజులుగా తెరుచుకోకపోవడం, వ్యవసాయంకు సంబంధించిన పనులు కూడా పెద్దగా లేకపోవడంతో విద్యుత్‌ వినియోగం బాగా తగ్గింది. జిల్లాలో కేటాయించిన కోటాలో 21.28 శాతం తక్కువ వినియోగమైందంటే కరోనా ఎఫెక్ట్‌ ఏ స్థాయిలో ఉందో ఇట్టే అర్ధమవుతుంది.


అయితే అధిక శాతం ప్రజలు ఇంటికే పరిమితం అవుతుండడంతో గృహావసరాల వినియోగం రోజుకు 2 మిలియన్‌ యూనిట్లు (ఎంయు) పెరగడం గమనార్హం. జిల్లాలో అన్ని విభాగాలకు సంబంధించి 10.98 లక్షల పైచిలుకు విద్యుత్‌ కనెక్షన్లున్నాయి. వీటన్నింటికీ కలిపి రోజువారి వినియోగంపై కోటా కేటాయిస్తారు. ప్రస్తుతం జిల్లాకు 14.04 మిలియన్‌ యూనిట్లు (కోటి 40 లక్షల నాలుగువేల యూనిట్లు) కోటా కేటాయించారు. అయితే కరోనా ఎఫెక్ట్‌తో భారీ వినియోగం తగ్గిపోయింది. రోజుకు 11.05 మిలియన్‌ యూనిట్లు (కోటి 10 లక్షల5వేల యూనిట్లు) వినియోగం అయింది.


అంటే 21.28 శాతం తగ్గుదల నమోదు అయింది. దీంతో 2.99 మిలియన్‌ యూనిట్లు (రెండు కోట్ల 99వేల యూనిట్లు) తక్కువ వినియోగించినట్లయింది. కాగా విద్యుత్‌ వినియోగం తగ్గినా గృహావసరాలకు మాత్రం పెరగడం గమనార్హం. సాధారణంగా గృహావసరాలకు కోటాలో 40 శాతం వినియోగం అవుతూ ఉండేది. కరోనా ఎఫెక్ట్‌తో వ్యవసాయ పనులకు 25 శాతం మించడంలేదు. పరిశ్రమలు, వాణిజ్య వ్యాపారాలకు దాదాపు లేనట్లే చెప్పవచ్చు. సాధారణ రోజుల్లో గృహావసరాలకు 5.5ఎంయు వినియోగమవుతుండగా ప్రస్తుతం 7.05 ఎంయు వినియోగమవుతోంది. వేసవి, దాదాపు జనం ఇంటికే పరిమితం కావడంతో గృహ వినియోగం పెరిగిందని చెప్పవచ్చు.

Updated Date - 2020-03-31T10:16:59+05:30 IST