Abn logo
Mar 4 2021 @ 00:44AM

కరోనా మిగిల్చిన కన్నీళ్లు

కకావికలమైన కొన్ని కుటుంబాలు

జీవనాధారం లేక నేటికీ అవస్థలు

కుటుంబపెద్దను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో..

ప్రభుత్వ సహాయం కోసం ఎదురుచూపులు


సిటీ న్యూస్‌ నెట్‌వర్క్‌, మార్చి 3 (ఆంధ్రజ్యోతి)

కరోనా ఎన్నో కుటుంబాలను కుదిపేసింది. కొందరిని మృత్యువు ముఖంలోకి నెట్టేసింది. ఆనందంగా సాగిపోతున్న జీవితాలను అల్లకల్లోలం చేసింది. ఇంటి పెద్ద మరణంతో కొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. భర్త చనిపోవడంతో తెలిసిన వారి వద్ద చేబదులు తెచ్చి కుటుంబాన్ని పోషించుకుంటోంది ఓ ఇల్లాలు. తండ్రి మృతితో ఇంటింటికీ పాల ప్యాకెట్లు వేస్తూ కుటుంబ భారాన్ని నెత్తిన వేసుకుంది ఓ బిడ్డ. కరోనా మహమ్మారి  ఇంటి పెద్దను బలి తీసుకోవడంతో కుటుంబ పోషణ కోసం టైలరింగ్‌ వృత్తిని చేపట్టింది మరో గృహణి. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. ఎవరిని కదిపినా కన్నీళ్లే. కరోనా మిగిల్చిన కష్టాల సుడులే. 

కరోనా తొలి కేసు నమోదై ఏడాది పూర్తయిన సందర్భంగా ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం..


‘అల్లంపల్లి’ కుటుంబం అల్లకల్లోలం

అల్లంపల్లి మధుకు భార్య మాధవి, ఇద్దరు పిల్లలు. పెద్ద కుమార్తె ఇంటర్‌ చదువుతోంది. రెండో ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది. వారితో మధు తండ్రి ఈశ్వరయ్య కూడా ఉంటున్నారు. కుటుంబం వనస్థలిపురం కాంప్లెక్స్‌లో నివసిస్తోంది. మధు ఓ సెంటర్‌లో కిరాణ షాపును  నడిపేవాడు. ఆదాయం సరిపోకపోవడంతో పాలు, కూరగాయల వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. అలా సాగిపోతున్న కుటుంబంలో గతేడాది ఏప్రిల్‌ 29 (కరోనా నిర్ధారణ), మే 1 (మృతి) చీకటి రోజులు మిగిల్చాయి. కరోనాతో ఈశ్వరయ్య, మధు, మాధవి గాంధీ ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో తండ్రీకొడుకు మృతి చెందారు. భర్త చివరి చూపునకు కూడా భార్య నోచుకోలేదు. ఆమె ఆస్పత్రిలో ఉండగానే అంత్యక్రియలు నిర్వహించారు. అటు మామ, ఇటు భర్త లేకపోవడంతో కుటుంబ రోడ్డు పాలైంది. కొవిడ్‌ కారణంగా బ్లీచింగ్‌ పౌడర్‌, ఇతర రసాయనాల పిచికారీతో కిరాణా సామాగ్రిని బయట పడేశారు. దుకాణం మూత పడింది. తిరిగి తెరిపిద్దామనుకుంటే చేతిలో చిల్లిగవ్వ లేదు. బంధువులు ముఖం చాటేశారు. ఇంటిపై తెచ్చిన రుణం ఇంకా తీరలేదు. ఇద్దరు పిల్లలతో కుటుంబ పోషణ మాధవికి భారంగా మారింది. ఇప్పుడు విద్యాసంస్థలు తెరుచుకుంటున్నాయి. పిల్లలకు ఫీజు ఎలా కట్టాలి, వారిని ఎలా చదివించాలి అన్న ప్రశ్నలు ఆమెను తొలిచివేస్తున్నాయి. ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం అందిస్తే కిరాణ దుకాణం తెరిచి వ్యాపారం మళ్లీ ప్రారంభిస్తానని ఆమె వేడుకుంటోంది. 


వసంత ఆవేదన తీరేదెలా..?

2020 మే 31న కరోనాతో భర్త మృతి చెందాడు. అంతకు ముందే ఇంటి నిర్మాణానికి తెలంగాణ కో ఆపరేటివ్‌ బ్యాంకు నుంచి రూ.18 లక్షలు అప్పు చేశారు. ప్రతి నెలా బ్యాంకులో రూ 25 వేలు చెల్లించాలి. ఇంతలో భర్త మృతితో అటు అప్పు చెల్లించలేక, ఇటు కుటుంబ అవసరాలు తీర్చలేక ఇబ్బంది పడుతున్నామని రాంనగర్‌  జెమిని కాలనీకి చెందిన వసంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంకటేశ్వరరావు(56), వసంత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. వెంకటేశ్వర్‌రావు వస్త్ర వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఆయన బతికి ఉన్నప్పుడు బ్యాంకు రుణంతో ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేశారు. ఈ క్రమంలోనే వెంకటేశ్వరరావు కరోనాతో మృతి చెందారు. ఆయన చ నిపోయిన కొద్దిరోజులకే బంధువుల సహకారంతో పెద్ద కూతురు మాధుర్య వివాహం జరిపించారు వసంత. చిన్న కూతురు ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతోంది. ఆమె కాలేజీ ఫీజులు చెల్లించలేక, బ్యాంకు అప్పు కట్టలేక, కుటుంబపోషణ భారమై వసంత తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. టైలరింగ్‌ ద్వారా వచ్చే ఆదాయం సరిపోక ప్రభుత్వ సహాయాన్ని కోరుతున్నారు. 


తండ్రి మృతితో బిడ్డ కుటుంబ పోషణ

బేగంపేటలోని బ్రాహ్మణవాడి ప్రాంతానికి చెందిన వీరేష్‌ (52) ఇంటింటికీ పాలు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. వీరేష్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలున్నారు. పెద్ద బిడ్డకు వివాహమైంది. గతేడాది అక్టోబర్‌లో కరోనా బారిన పడి పరిస్థితి విషమించడంతో వీరేష్‌ చనిపోయారు. ఇంటర్‌ చదువుతున్న రెండో బిడ్డ కుటుంబ పోషణ కోసం ఇంటింటికీ పాల ప్యాకెట్లు సరఫరా చేస్తోంది. రోజూ ఉదయమే నాలుగు గంటలకు లేచి సైకిల్‌పై పాలు సరఫరా చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. 


లోలోపలే కుమిలిపోతూ...

ఆయన కేంద్ర ప్రభుత్వ సంస్థలో పని చేసేవారు. నెలకు రూ.48 వేల జీతం. భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హాయిగా సాగిపోతున్న కుటుంబం. గుండె సమస్యతో బాధపడే ఆయన చికిత్స కోసం ఆస్పత్రుల చుట్టూ తిరిగే వారు. ఈ క్రమంలో అతనిని కరోనా పొట్టనపెట్టుకుంది. ఎనిమిది నెలల క్రితం మరణించారు. ఆ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. భర్త   ఫించను డబ్బే ఆ కుటుంబానికి ఆధారం. కుటుంబ పోషణకు ఇబ్బంది లేకపోయినా, ఇంటి పెద్దలేని లోటుతో కుటుంబసభ్యులు లోలోపలే కుమిలిపోతున్నారు. 


ఉన్న గేదెలను అమ్మి కొంత కాలం...

పాతబస్తీ గౌలిపురా నివాసి బి.క్రిష్ణాయాదవ్‌ (60) పాల వ్యాపారి. అతనికి భార్య, ఇద్దరు కొడుకులున్నారు. గతేడాది జూలైలో కరోనా మహమ్మారి అతడిని బలి తీసుకుంది. అంత వరకు తండ్రి చాటున పెరిగిన పిల్లలకు ఏం చేయాలో తెలియని పరిస్థితి. పాలు పితకడం తెలియదు. నాడు లాక్‌డౌన్‌తో ఏ పనీ దొరకలేదు. ఉన్న గేదెలను అమ్మి కొంత కాలం బతికారు. ఇప్పుడు జీవనాధారం భారంగా మారింది. పిల్లల భవిష్యత్తుపై ఆ తల్లికి బెంగ పట్టుకుంది.


సోక్రాబేగాన్ని వీడని శోకం

మహారాష్ట్రకు చెందిన సుల్తాన్‌(57) కుటుంబం రియాసత్‌నగర్‌లో  స్థిరపడింది. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులున్నారు. కుమారులు వేరే కాపురం పెట్టారు. పెద్ద కూతురుకు భర్త విడాకులు ఇవ్వడంతో తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. కరోనాతో 2020 జూన్‌లో సుల్తాన్‌ మరణించాడు. ఆ కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయి. కుమారులు వేరుగా ఉండడం, కుమార్తె బాధ్యత తనపైనే ఉండడంతో సుల్తాన్‌ భార్య సోక్రాబేగం శోకంలో మునిగిపోయింది. మహారాష్ట్రలో భూములున్నా ఆ వివరాలు భర్తకే తెలుసు. ఇప్పుడు ఆయన లేడు. ఎటూపాలుపోక సోక్రాబేగం నేటికీ కన్నీరుమున్నీరవుతోంది.


సోదరుల సహాయంతో...

జల్‌పల్లి మున్సిపాల్టీ వాదియే ముస్తాఫాకు చెందిన ఎం.డి.సాదక్‌(37) కొవిడ్‌తో గతేడాది జూలైలో మృతి చెందాడు. సాదక్‌కు ఇద్దరు కుమారులు, కూతురు ఉంది. తండ్రి మరణంతో ఆ పిల్లలు దిక్కులేని వారయ్యారు. ఆయన భార్య ఫాతిమాబేగానికి కష్టాలు తప్పలేదు. ఆమె సోదరులే నెల నెలా సరుకులు పంపిస్తున్నారు. వాటితోనే పిల్లలకు కొంత పెట్టి తానూ తింటోంది. పిల్లల భవిష్యత్‌ కోసం తల్లడిల్లిపోతోంది.                


ఇంటి పెద్ద దిక్కు లేక.....

జియాగూడ డివిజన్‌ డోర్‌బస్తీకి చెందిన ముకుంద్‌రావు(55)కు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ముకుంద్‌రావు ఓ రాజకీయ పార్టీ కార్యకర్తగా, సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. లాక్‌డౌన్‌లో ప్రభుత్వ అధికారులతో కలిసి బస్తీల్లో ప్రజలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న సమయంలో ముకుంద్‌రావును కరోనా బలితీసుకుంది. దీంతో ఆ కుటుంబం రోడ్డు పాలైంది. ఒక కూతురు ఇంటర్‌, మరొకామె డిగ్రీ చదువుతోంది. వచ్చే కొద్దిపాటి అద్దెలతో కుటుంబం పోషణ ముందుకెళ్తున్నా, తాను చేసే సామాజిక సేవే కుటుంబ పెద్దను బలి తీసుకోవడం వారిని కలిచివేస్తోంది. 


Advertisement
Advertisement