రాములోరి కల్యాణానికి కరోనా ఎఫెక్ట్‌

ABN , First Publish Date - 2020-04-03T11:50:22+05:30 IST

భక్తజన సందోహం మధ్య కమనీయంగా... కడు రమణీయంగా జరగాల్సిన సీతారాముల కల్యాణం నిరాడంబరంగా జరిగింది.

రాములోరి కల్యాణానికి కరోనా ఎఫెక్ట్‌

నిరాడంబరంగా నవమి వేడుక



కామవరపుకోట/ భీమవరం టౌన్‌/ పెంటపాడు / చాగల్లు / ద్వారకాతిరుమల/ పాలకొల్లు / నరసాపురం / కొవ్వూరు/ ఆకివీడు, ఏప్రిల్‌ 2 : భక్తజన సందోహం మధ్య కమనీయంగా... కడు రమణీయంగా జరగాల్సిన సీతారాముల కల్యాణం  నిరాడంబరంగా జరిగింది.ప్రతీ ఏడాది చలువ పందిళ్లు, మేళతాళాలు, భక్త సందోహం నడుమ ఎంతో వైభవంగా జరుగుతుంది. కానీ ఈసారి మాత్రం కరోనా పుణ్యమా అని పోలీస్‌ పహరా మధ్య సాగింది.ఎన్నడూ ఎవరూ ఊహించిన విధంగా పోలీసుల నోటీసుల నేపథ్యంలో ఆ కల్యాణరాముడి కల్యాణం సాదాసీదాగా సాగిపోయింది. మేళతాళాలు లేవు.. కల్యాణాన్ని తిలకించి.. తరించే భక్తజనమూ లేరు..ఏడాదికోమారు ఆనందంగా సేవించే బెల్లం పానకమూ లేదు.. ఆలయాలన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి.. అయ్యో రామా... అనుకుంటూ అర్చకులే ఏదో తూతూమంత్రంగా గురువారం కల్యాణ వేడుక జరిపించారు. నరసాపురం వైఎన్‌  కళాశాల సమీపంలో ఉన్న ఆర్యవైశ్య రామాలయంలో పూసరపు గాంధీ దంపతులు స్వామివార్లకు పట్టు వస్ర్తాలు సమర్పించారు.


ఆకివీడులోని ఒక రామాలయంలో కనీసం కల్యాణం జరిపించకుండా వదిలేశారు. ఏలూరు శనివారపుపేట శ్రీరామ్‌ నగర్‌లోని ప్రసన్నాంజ నేయస్వామి కోవెల, సుంకరివారి తోట రామాలయంలో జిల్లాలోని కామవరపుకోట మండలం తూర్పుయడవల్లి, భీమవరం సోమేశ్వరస్వామి ఉపాలయం ఆంజనేయస్వామి ఆలయం, పెంటపాడు మండలం బైరాగిమఠం, చాగల్లు కోదండ రామాలయం, ద్వారకాతిరుమల, దేవరపల్లి, నరసాపురం, పాలకొల్లు,  పెదవేగి, ఉంగుటూరు, భీమడోలు, గణపవరం తదితర మండలాల్లో శ్రీరామ నవమి వేడుకలు చేశారు.  

Updated Date - 2020-04-03T11:50:22+05:30 IST