కేసులు తగ్గి.. మరణాలు పెరిగాయి

ABN , First Publish Date - 2020-07-01T07:29:53+05:30 IST

దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసుల సంఖ్య తగ్గింది. సోమవారం 19,459 మందికి కొవిడ్‌ సోకగా, మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 18,522 మందికి పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది...

కేసులు తగ్గి.. మరణాలు పెరిగాయి

  • దేశంలో మరో 18,522 మందికి కరోనా.. 418 మంది మృతి


న్యూఢిల్లీ, జూన్‌ 30 (ఆంధ్రజ్యోతి): దేశంలో వరుసగా రెండో రోజూ కరోనా కేసుల సంఖ్య తగ్గింది. సోమవారం 19,459 మందికి కొవిడ్‌ సోకగా, మంగళవారం ఉదయం 8 గంటలకు గడిచిన 24 గంటల్లో 18,522 మందికి పాజిటివ్‌గా తేలిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ప్రకటించింది. దీనిప్రకారం.. క్రితం రోజుతో పోలిస్తే బాధితుల సంఖ్య 937 తగ్గింది. మంగళవారం 418 మంది మృతి చెందారు. మరణాలు సోమవారం కంటే 38 ఎక్కువగా నమోదయ్యాయి. వైర్‌సతో దక్షిణాది రాష్ట్రాలు తమిళనాడు, కర్ణాటక అల్లాడుతున్నాయి. ఒక్క రోజే 3,943 (చెన్నైలో 2,393) వరకు కేసుల నమోదుతో మొత్తం కేసుల్లో తమిళనాడు.. దేశ రాజధాని ఢిల్లీని దాటేసి రెండో స్థానానికి వచ్చింది. అత్యధికంగా 947 మందికి పాజిటివ్‌ అని తేలడంతో కర్ణాటక.. హరియాణ, ఏపీలను దాటేసింది. దేశంలో కరోనా హాట్‌స్పాట్‌ మహారాష్ట్రలో మరోసారి 5 వేలపైగా కేసులు వచ్చాయి. వైరస్‌ తీవ్రత రీత్యా మహారాష్ట్రలోని థానెలో జూలై 2 నుంచి పది రోజుల సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయాలని నిర్ణయించారు. బాలీవుడ్‌ హీరో ఆమిర్‌ ఖాన్‌ కార్యాలయ సిబ్బందిలో కొందరికి పాజిటివ్‌ వచ్చింది. రాజధాని ఢిల్లీలో బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇక్కడ కొత్తగా 2,084 మంది వైరస్‌ బారినపడ్డారు. కాగా, దేశంలో వరుసగా ఏడో రోజూ 15 వేలపైగా కేసులు వచ్చాయి. దేశంలో నమోదైన మొత్తం కేసుల్లో.. ఒక్క జూన్‌ నెల వాటా 66ు అని వివరించింది.


కొవిడ్‌ బారిన బీఎస్‌ఎఫ్‌ జవాన్లు

మావోయుస్టు ప్రభావిత ప్రాంతమైన ఒడిసాలోని మల్కన్‌గిరి జిల్లాలో విధులు నిర్వహిస్తున్న 29 మంది సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) జవాన్లు కరోనా బారినపడ్డారు. వీరిని కలుపుకొని.. దేశవ్యాప్తంగా 53 మంది బీఎస్‌ఎఫ్‌ జవాన్ల మంగళ వారం పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కాగా.. కరోనా కారణంగా సంభవించే రోజువారీ మరణాల్లో స్థిరమైన తగ్గుదల నమోదైనప్పుడు మాత్రమే దేశంలో కోవిడ్‌-19 వ్యాప్తి గరిష్ఠ స్థాయికి చేరిందని చెప్పగలమని పబ్లిక్‌ హెల్త్‌ ఫౌండేషన్‌ ఆఫ్‌ ఇండియా అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కె. శ్రీనాథ్‌ రెడ్డి పేర్కొన్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు పశ్చిమ బెంగాల్‌లో కోలుకున్న రోగులతో ‘కొవిడ్‌ వారియర్‌ క్లబ్‌’ ఏర్పాటైంది.


పతాక స్థాయికి చేరలేదు: డబ్ల్యూహెచ్‌వో 

కోరలు చాస్తున్నట్లుగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్‌ ధాటికి బెంబేలెత్తిపోతున్న ప్రజలకు ఇది చేదు వార్తే. కొవిడ్‌-19 ఇంకా పతాక స్థాయికి చేరాల్సి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. కొవిడ్‌-19పై ప్రభుత్వాలు తగిన విధానాలను అవలంబించకపోతే వైరస్‌ ఎంతోమందికి సోకే ప్రమాదం ఉందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రస్‌ అదనోమ్‌ జిబ్రియేసెస్‌ హెచ్చరించారు.


Updated Date - 2020-07-01T07:29:53+05:30 IST