Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 21 Apr 2020 10:55:38 IST

నేరం వారిది కాదు...వైరస్‌ది!

twitter-iconwatsapp-iconfb-icon
నేరం వారిది కాదు...వైరస్‌ది!

ఆంధ్రజ్యోతి(21-04-2020)

జబ్బు చేస్తే ‘‘అయ్యో.. పాపం!’’ అనే రోజులు పోయాయా?

కరోనా సోకినా, చికిత్సతో కోలుకొని బయటపడినా... 

‘‘అయ్య బాబోయ్‌!’’ అంటూ భయంతో బాధితులకు దూరంగా పారిపోయే రోజులు వచ్చాయా?

సోకిన వ్యాధి కంటే, సమాజపు చీదరింపులు కరోనా బాధితులను రెట్టింపు వేదనకు గురి చేస్తున్నాయి!

అంటరానితనాన్ని పోలిన ఇలాంటి పరిస్థితి 

బాధితులకే కాదు, వైద్యులకూ తప్పడం లేదు!


ప్రతి కరోనా బాధితుడికీ ఆ వ్యాధి మీద విజయం సాధించడం ఓ పరీక్ష అయితే, కోలుకున్న తర్వాత సమాజాన్ని ఎదుర్కోవడానికి అవసరమైన మానసిక స్థైర్యాన్ని కూడదీసుకోవడం మరో పరీక్షగా మారుతోంది. ‘‘అంత పెద్ద ఇన్‌ఫెక్షన్‌ నుంచి బయటపడగలిగానా?’’ అని లోలోపల వేదనకు లోనవడం కంటే, ‘‘కోలుకున్న తర్వాత సమాజం తమను అంగీకరిస్తుందా.. లేదా?’’ అని మథనపడడం... ఇలా రెండు రకాల సమస్యలను కరోనా బాధితులు ఎదుర్కోవలసివస్తోంది.


ఇలా మానసికంగా, సామాజికంగా రెండు ఇబ్బందులు వీరికి తప్పడం లేదు. విషపు పాము కనిపించగానే మరో ఆలోచన లేకుండా చంపేస్తాం! కానీ నిజానికి ఆ పాము విషం నుంచే విరుగుడు మందు తయారవుతుందని మీకు తెలుసా? సరిగ్గా ఇదే సూత్రం కరోనా బాధితులకూ వర్తిస్తుంది. చికిత్స ఫలితంగా వీరి ఒంట్లో తయారయ్యే యాంటీబాడీలు, ఇదే ఇన్‌ఫెక్షన్‌ బారిన పడిన బాధితుల్లోని వైర్‌సను సంహరించే చికిత్సకు అక్కరకొస్తాయి. కరోనా బాధితుల బ్లడ్‌ ప్లాస్మా ఇందుకు ఎంతో ఉపకరిస్తుంది. ఈ విషయం తెలుసుకోవాలి. 


అయితే ఉపయోగం ఉంది కాబట్టి, కరోనా బాధితుల్ని చేరదీయాలనే నైజమూ సరి కాదు. అన్నిటికంటే ముందు అసలు వారిని అంతలా దూరం పెట్టవలసిన అవసరం ఉందా అని ఎవరికి వారు ఆలోచించుకోవాలి. ఆ ఇన్‌ఫెక్షన్‌కు లోనైన వారి స్థానాల్లో ఉండి ఆలోచించాలి. 


మీకూ వస్తే?

కరోనా సోకని వారు కచ్చితంగా అదృష్టవంతులే! అయితే అంతమాత్రాన ఎప్పటికీ సోకదనే నమ్మకం ఉందా? ఒకవేళ సోకితే? మిమ్మల్ని కూడా ఇతరులు దూరంగా పెడితే మీరు తట్టుకోగలరా?... ఇలా ఎవరికి వారు ఆలోచించుకోవాలి. కరోనా నుంచి కోలుకున్న వారిని దూరంగా పెడుతున్నారంటే... వారికి ఆ వైరస్‌ పట్ల పూర్తి అవగాహన లేదనేది స్పష్టం. మిగతా వ్యాధులు, ఇన్‌ఫెక్షన్లలో లేని అరుదైన సౌలభ్యం కరోనా ఇన్‌ఫెక్షన్‌కు ఉంది. కోలుకున్న వ్యక్తి, మరో పది లేదా ఇరవై మందికి ప్రాణదాతగా మారే అవకాశం ఉంది. అంతటి ఉపయోగం ఉన్న వ్యక్తులను అంటరానివాళ్లుగా దూరం పెట్టడం ఎంతవరకూ సమంజసం? ఒకవేళ ఇలాంటి ప్రవర్తనలతో విసిగిపోయి, మున్ముందు ఎవరికీ సహాయపడకూడదని కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు నిశ్చయించుకుంటే మన పరిస్థితి ఏంటి? కాబట్టి హేళనకు స్వస్తి చెప్పి, ప్రమాదకర రుగ్మత నుంచి విజయవంతంగా కోలుకుని వచ్చినందుకు బాధితులను అభినందించాలి. 


మీరు బలవంతులు! 

కరోనా ఇన్‌ఫెక్షన్‌ బారిన పడినందుకు మిమ్మల్ని మీరు బలహీనులు అనుకోవడం సరి కాదు. ఆ ఇన్‌ఫెక్షన్‌ మీద విజయం సాధించారు కాబట్టి బలవంతులుగా భావించాలి. ప్రాణాంతకమైన వ్యాధిని ఛేదించి, దిగ్విజయంగా బయటపడ్డారు. ఈ పరిస్థితి మీ మానసిక స్థైర్యానికి ఓ పరీక్ష. ఈ పరీక్షలో మీరు నెగ్గారు. ‘‘ఒకసారి ఈ జబ్బు బారిన పడ్డాను కాబట్టి, భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి జబ్బే సోకుతుందేమో? అనే అభద్రతతో నేను కొనసాగాలా? జాగ్రత్తలు పాటించకపోవడం మూలంగా ఈ ఇన్‌ఫెక్షన్‌ బారిన పడ్డాను కాబట్టి, ఇకముందు నుంచి విపరీత జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలా? ఎంత మందికి నేను ఈ ఇన్‌ఫెక్షన్‌ను అంటించానో?’’ ఇలా కరోనా నుంచి కోలుకున్న బాధితులు అపరాధ భావం, భయం, ఆందోళనలనే పలు రకాల మానసిక స్థితులకు లోనవుతూ ఉంటారు. కానీ ఇది కోరుకుని తెచ్చుకున్నదీ, కోరుకుని అంటించినదీ కాదు! కాబట్టి అర్థం లేని భయాలను, అనుమానాలను మనసు నుంచి తీసేయాలి. అంతటి భయానక రుగ్మత నుంచి బయటపడ్డాను కాబట్టి, భవిష్యత్తులో ఎలాంటి సమస్యనైనా ఇట్టే ఛేదించగలను అనే ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకోవాలి.


నైతిక అండ ముఖ్యం!

‘‘చేదు అనుభవాలు, జ్ఞాపకాలు పదే పదే కుంగదీయడం సహజం. అయితే గతంలోనే కూరుకుపోయి, మానసిక కుంగుబాటుకు లోనవడమా? లేక గతాన్ని మరిచి ఆశావహ దృక్పథంతో ముందుకు సాగడమా? అనేది ఎవరికి వారు ఆలోచించుకోవాలి. అలాగే ‘కొవిడ్‌ - 19’ను అర్థం చేసుకుని, అవగాహన కలిగి ఉన్న వ్యక్తులకు దగ్గరగా, ఆ కోవకు చెందని వ్యక్తులకు దూరంగా మెలగడం వల్ల ఉపయోగం ఉంటుంది. బాధితులు కూడా మనలాంటి మనుషులే అని గుర్తించి, వారికి నైతికంగా అండగా నిలవాలి. మనకు మనం జాగ్రత్త తీసుకుంటూనే, మానసిక శారీరక దృఢత్వాలు పెంచుకోవడం కోసం పోషకాహారం తీసుకోవడంతో పాటు యోగా, ధ్యానం లాంటివి సాధన చేయాలి.’’


- డాక్టర్‌ కల్యాణ్‌ చక్రవర్తి మానసిక వైద్యులు,

హైదరాబాద్‌.


సమాజం బాధ్యతా ఉంది!

‘‘ప్రాణదాతలైన వైద్యులను అంటరానివారిగా చూసే పరిస్థితి రావడం బాధాకరం. ‘కొవిడ్‌ - 19’ వెలుగులోకి వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి తలెత్తుతుందని మేము ముందుగానే ఊహించాం! రోగులకు దగ్గరగా మసులుతూ చికిత్స చేసే వైద్యులు, నర్సులు ఇతరత్రా వైద్య సిబ్బంది పట్ల సమాజం అనుమానాస్పదంగా చూసే ప్రమాదం ఉందని ప్రారంభంలో మేము ఊహించినదే నిజమైనా, ప్రస్తుతం పరిస్థితిలో కొద్దిగా మార్పు వచ్చింది. వ్యాధి నుంచి రోగులు పూర్తిగా కోలుకున్న తర్వాత వారి కుటుంబసభ్యులతో పాటు, ప్రజలందరూ వైద్యులను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. అయితే అక్కడక్కడా పరిస్థితి వైద్యులకు ప్రతికూలంగా ఉందన్న మాట వాస్తవం. వైద్యుల మీద దాడులూ జరుగుతున్నాయి. ఇది బాధాకరం. ప్రజలు వ్యాధి పట్ల అవగాహన ఏర్పరుచుకుంటే, ఇలాంటి సంఘటనలకు ఆస్కారం ఉండదు. ఈ సమస్య మనందరిదీ! ఇన్‌ఫెక్షన్‌ సోకిన వారికి మేము ఎంత బాధ్యతాయుతంగా వైద్యం అందిస్తామో, సమాజం కూడా అంతే బాధ్యతగా వారికి చేయూతను అందించాలి. వ్యాధి నయమైన వారిని అభినందించి, ప్రోత్సహించి, వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేలా ప్రవర్తించాలి. అందరం కలిసికట్టుగా పోరాడితే కరోనా రహిత సమాజం నిర్మించడం అసాధ్యమేమీ కాదు.’’


- డాక్టర్‌ మహమూద్‌ ఖాన్‌ఛాతీ వైద్య నిపుణులు,

గవర్నమెంట్‌ ఛెస్ట్‌ హాస్పిటల్‌,హైదరాబాద్‌

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.