ప్లేగు నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి..

ABN , First Publish Date - 2020-04-03T07:53:48+05:30 IST

నిజం... నాటి ప్లేగు రోజులు గుర్తుకువస్తున్నాయి. కొవిడ్‌ వీరవిహారంతో ప్రపంచవ్యాప్తంగా వేలమంది మరణిస్తున్న నేపథ్యంలో అప్పటి విషయాలు గుర్తుకు రావడం...

ప్లేగు నాటి రోజులు గుర్తుకొస్తున్నాయి..

ముంబై, ఏప్రిల్‌ 2: నిజం... నాటి ప్లేగు రోజులు గుర్తుకువస్తున్నాయి. కొవిడ్‌ వీరవిహారంతో ప్రపంచవ్యాప్తంగా వేలమంది మరణిస్తున్న నేపథ్యంలో అప్పటి విషయాలు గుర్తుకు రావడం సహజం. 1893లో మహమ్మారి ప్లేగు మానవాళిని చుట్టుముట్టినప్పుడు బాక్టీరియాలజిస్టు వాల్దమర్‌ హాఫ్‌కిన్‌ వ్యాక్సిన్‌ కనుగొనేందుకు పెద్దఎత్తున కృషి చేశారు. రష్యాకు చెందిన ఆయన ఇరవై రెండు సంవత్సరాలు ఇండియాలోనే ఉన్నారు. ముంబైలోని ప్రభుత్వ వైద్య కళాశాల,  సర్‌ జెజె ఆసుపత్రి భవనంలోనే ఒక గదిలో ఆయన తన పరిశోధనలను అప్పట్లో కొనసాగించారు. ఆయన కనుగొన్న వ్యాక్సిన్‌ యావత్తు మానవాళిని కాపాడింది. కలరాకు వ్యతిరేకంగా వ్యాక్సిన్‌ను కనుగొన్న ఘనత కూడా ఆయనదే. కరోనా వైరస్‌ నేపథ్యంలో మళ్ళీ మరోసారి ఆయన సాగించిన పరిశోధనలు జ్ఞప్తికి వస్తున్నాయి.


నూట పాతిక సంవత్సరాల క్రితం రష్యానుంచి వచ్చిన హాఫ్‌కిన్‌, చరిత్రలో నిలిచే పరిశోధనలు కొనసాగించారని, ఆయన శాస్త్రీయ ధోరణి శ్లాఘనీయమని జెజె హాస్పిటల్‌ రెసిడెంట్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ రేవత్‌ కనింన్డే ప్రశంసించారు. శిలాఫకాలు, స్మారక చిహ్నాల ఏర్పాటుకు చేసే వ్యయాన్ని వైద్య విద్య, పరిశోధనకు వినియోగించాలని కూడా ఆయన సూచించారు. హాఫ్‌కిన్‌ పరిశోధనలు కొనసాగించిన గదిలోనే ఇప్పుడు మెడిసిన్‌ రెండో ఏడాది కోర్సు చదువుతున్న విద్యార్థులకు ఫార్మకాలజీ లెక్చర్‌ హాలుగా ఉపయోగపడుతోంది. తనను, తన సహ విద్యార్థులను  ఈ గదే  ఎంతో ఉత్సాహపరిచేదని కనింన్డే పేర్కొన్నారు.  గ్రాంట్‌ మెడికల్‌ కాలేజ్‌ అలాగే జెజె హాస్పిటల్‌ బిల్డింగ్‌లో హాఫ్‌కిన్‌ గౌరవార్థం ఏర్పాటు చేసిన  ఫలకాన్ని అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి 1971 ఆగస్టు 27న ఆవిష్కరించారు. ఈ మే నెలలో గ్రాంట్‌ మెడికల్‌ కాలేజీ 175వ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకోనుంది. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ను ఉత్సవాలకు ఆహ్వానించాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు  కరోనా వైర్‌సను నిరోధించేందుకు అక్కడి సిబ్బంది అహర్నిశలు కృషి చేస్తున్నారు.  

Updated Date - 2020-04-03T07:53:48+05:30 IST