2.76 లక్షలు దాటిన కేసులు

ABN , First Publish Date - 2020-06-11T07:21:24+05:30 IST

దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజూ కేసు ల సంఖ్య 9500 దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9985 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,76,583కు చేరింది. ఒక్క రోజులో 279 మంది ప్రాణా లు కోల్పోగా...

2.76 లక్షలు దాటిన కేసులు

  • దేశంలో కొత్తగా 9,985 పాజిటివ్‌లు
  • 24 గంటల్లో 279 మంది మృతి
  • లక్ష కేసులకు చేరువలో మహారాష్ట్ర
  • మళ్లీ జామియా మసీదు మూసివేత

న్యూఢిల్లీ, జూన్‌ 10 (ఆంధ్రజ్యోతి): దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజూ కేసు ల సంఖ్య 9500 దాటింది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 9985 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2,76,583కు చేరింది. ఒక్క రోజులో 279 మంది ప్రాణా లు కోల్పోగా.. దేశంలో మొత్తం కరోనా మృతుల సంఖ్య 7,745కి చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా పాజిటివ్‌ కేసుల్లో ప్రపంచంలోనే ఐదో స్థానం లో ఉన్న మన దేశంలో వైరస్‌ ఉధృతి రోజురోజుకు పెరిగిపోతోందనడానికి గత వారం రోజుల్లో నమోదైన పాజిటివ్‌ కేసులే ఉదాహరణ. ఈ నెల 3 నుంచి బుధవారం ఉదయం వరకు 69,068 మందికి కరోనా సోకిం ది. 1930 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక మహారాష్ట్రలో మహమ్మారి అంతకంతకూ విజృంభిస్తోంది. బుధవారం ఉదయానికి మొత్తం 90,787 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 3,289 మంది మరణించగా, 44,860 మంది చికిత్స పొందుతున్నారు. 42,638 మంది కోలుకున్నారు. మహారాష్ట్రలో అతి త్వరలో కేసుల సంఖ్య లక్షకు చేరనుంది.


ఔరంగాబాద్‌ జిల్లాలోని హర్సుల్‌ జైలులో 14 మంది సిబ్బందికి వైరస్‌ సోకింది. ఇక తమిళనాడులో మొత్తం 34,914 కేసులు నమోదయ్యాయి. 307మంది ప్రాణాలు కోల్పోయారు. తృతీయ స్థానంలో ఉన్న ఢిల్లీలో మొత్తం 31,309 కేసు లు నమోదవగా, 18,583 మంది చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలో శాంతిభద్రతల విధుల్లో ఉన్న ఓ బీఎ్‌సఎఫ్‌ జవాను కరోనాతో మృతి చెందారు. దీంతో కేంద్ర సాయుధ బలగాల్లో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య 14కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 50,61,332 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారత వైద్య పరిశోధనా మండలి(ఐసీఎంఆర్‌) ప్ర కటించింది. రోజూ 1.45 లక్షల నమూనాలను సేకరిస్తున్నట్లు తెలిపింది. మొత్తం 823 ల్యాబ్‌ల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీటిలో 590 ప్రభుత్వ రంగంలోనివి కాగా, 233 ప్రైవేటు ల్యాబ్‌లు. ప్రపంచంలో అత్యధికంగా కరోనా నిర్ధారణ పరీక్షలను అమెరికా చేస్తోంది. అమెరికాలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పరీక్షలు చేసినట్లు అధ్యక్షుడు ట్రంప్‌ వెల్లడించారు. 


సరిహద్దులు మూసేసిన రాజస్థాన్‌ 

కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో రాజస్థాన్‌ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్ర సరిహద్దులను మూసేస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) లేదా పాస్‌ లేకుండా ఏ ఒక్కరినీ రాష్ట్రంలోకి అనుమతించే ప్రసక్తే లేదని డీజీపీ వెల్లడించారు. రాజస్థాన్‌లో కరోనా మరణాల సంఖ్య 256కి చేరగా.. మొత్తం కేసుల సంఖ్య 11368కి చేరింది. కాగా, ఢిల్లీలోని జామియా మసీదును మళ్లీ మూసివేస్తున్నట్లు ఇమామ్‌ సయ్యద్‌ అహ్మద్‌ బుకారీ ప్రకటించారు. వైరస్‌ సోకిన ఇమామ్‌ కార్యదర్శి అమానుల్లా చికిత్స పొందుతూ మరణించారు. ఈ నెల 3న ఆయన సఫ్దర్‌జంగ్‌ ఆస్పత్రిలో చేరారని, చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మరణించారని బుకారీ తెలిపారు. ఢిల్లీలో కేసులు విపరీతంగా పెరిగిపోతుండడంతో మసీదును మళ్లీ మూసివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. ఉత్తరాఖండ్‌లోని పవిత్ర పుణ్య క్షేత్రాలైన గంగోత్రి, యమునోత్రి ఆలయాలను తెరవాలన్న నిర్ణయాన్ని పూజారులు వ్యతిరేకించారు. స్థానికులకు పరిమిత సంఖ్యలో దర్శనాలు కల్పించాలన్న ఆలయ బోర్డు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నామని, ఉత్తరాఖండ్‌లో వైరస్‌ పూర్తిగా తగ్గే వరకు ఏ ఒక్కరినీ దర్శనాలకు అనుమతించబోమని తెలిపారు. కాగా, ఢిల్లీలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఢిల్లీ వాసులకు మాత్రమే చికిత్స అందించాలన్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఆస్పత్రుల్లో అందరికీ చికిత్స అందించాలన్న కేంద్రం, లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజాల్‌ ఆదేశాలను అమలు చేస్తామని తెలిపారు.




కరోనాతో డీఎంకే ఎమ్మెల్యే మృతి

కరోనా బారిన పడి దేశంలో తొలిసారి ఓ ఎమ్మెల్యే ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఎమ్మెల్యే జె.అన్బళగన్‌(62) బుధవారం మృతి చెందారు. వారం కిందటే ఆయనలో కొవిడ్‌ లక్షణాలు కనిపించడంతో ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించి కన్నుమూశారు. బుధవారం ఆయన పుట్టిన రోజు కావడం గమనార్హం. ఆప్తమిత్రుడిని కోల్పోయానంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ సంతాపం ప్రకటించారు. ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అన్బళగన్‌ మృతికి సంతాపం వ్యక్తం చేశారు.


చికిత్సకు నిరాకరిస్తే చర్యలు 

కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్‌) కింద నమోదై కరోనా వైరస్‌ సోకిన రోగులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్న వారికి చికిత్స అందించడానికి నిరాకరించిన అన్ని ఆస్పత్రులపై చర్యలు తీసుకోనున్నట్టు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ పథ కం పరిధిలో ఉన్న ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ కేంద్రాల్లో చికిత్సలు పొందడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్టు సీజీహెచ్‌ఎస్‌ లబ్ధిదారులు చేసిన అభ్యర్థలను సమీక్షించిన మంత్రిత్వశాఖ తాజా హెచ్చరిక జారీ చేసింది. 


Updated Date - 2020-06-11T07:21:24+05:30 IST