పేదోళ్లనే చిదిమేస్తోంది!

ABN , First Publish Date - 2020-07-07T10:31:46+05:30 IST

జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన 1008 కేసుల్లో 95 శాతంపైగా పేద, మధ్యతరగతి వారు కావడంతో ఈ వర్గాలే ఎందుకు ఎక్కువగా

పేదోళ్లనే చిదిమేస్తోంది!

పేద, మధ్యతరగతిపైనే కరోనా పంజా

బాధితుల్లో 95 శాతం వారే!

కూలీలు, చిరువ్యాపారులే అధికం

వైద్య వర్గాల అధ్యయనంలో వెలుగులోకి..


జిల్లాలో పేద, మధ్య తరగతి కుటుంబాలే ఎక్కువగా కరోనా బారిన పడుతున్నాయి. కుటుంబ పోషణ కోసం గడపదాటుతున్న వారిని మహమ్మారి కబళించి ఆ కుటుంబాలను ఆర్థికంగా మరింత దెబ్బ తీస్తోంది. జిల్లాలో ఇప్పటిదాకా 1008 కరోనా కేసులు నమోదవగా, ఈ బాధితుల్లో 90 శాతానికిపైగా పేద, మధ్యతరగతి కుటుంబీకులే.


నెల్లూరు (ఆంధ్రజ్యోతి), జూలై 6 : జిల్లాలో ఇప్పటి వరకు నమోదైన 1008 కేసుల్లో 95 శాతంపైగా పేద, మధ్యతరగతి వారు కావడంతో ఈ వర్గాలే ఎందుకు ఎక్కువగా వ్యాధి బారిన పడుతున్నాయని వైద్య వర్గాలు అధ్యయనం చేశాయి. నిలకడగా ఒక చోట ఉండకుండా పలు ప్రదేశాలకు తిరిగే వారికే ఎక్కువగా కరోనా సోకుతోందనే విషయం స్పష్టమైంది. ప్రస్తుతం వ్యాధి బారిన పడిన కుటుంబాలన్నీ పొట్ట కూటి కోసం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ప్రయాణించినవే. కూరగాయల మార్కెట్లలో మూటలు మోసే వారు, ఊరూరా తిరిగి నిత్యాసవర సరుకులు, గృహోపకరణాలు విక్రయించుకునే చిరు వ్యాపారులే అధికంగా ఉన్నారు.


ఇలా తిరగడం వల్ల వీరికి వైరస్‌ సోకడం, వీరి ద్వారా కుటుంబ సభ్యులకు, బంధువులకు వైరస్‌ వ్యాపించడంతో కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మరో విశేషం ఏమంటే ఇప్పటివరకు నమోదైన కేసుల పరిశీలనలో వ్యవసాయ, భవన నిర్మాణ కార్మిక వర్గాలకు ఈ వైరస్‌ పెద్దగా సోకలేదు. దీనికి కారణం వీరు నిలకడగా ఒక చోట ఉండటమే. రైతులు, రైతు కూలీలు ఉన్న ఊరి నుంచి బయటకు వెళ్లే అవసరం లేదు. పైగా ఇప్పడు వ్యవసాయ పనుల సీజన్‌ కూడా పెద్దగా లేదు. ఈ క్రమంలో వీరు నిలకడగా ఇంటి పట్టునో, ఊరిపట్టునో ఉంటున్నారు. భవన నిర్మాణ కార్మికుల పరిస్థితీ ఇంతే. లాక్‌డౌన్‌ ఎత్తి వేసినా ఇసుక సంక్షోభం కారణంగా నిర్మాణాలు ఆగిపోయాయి. పనులు లేని కారణంగా వీరు కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. అక్కడక్కడ పనులు జరుగుతున్నా ఈ కూలీలు మరో ప్రాంతాలకు వెళ్లడం, ఇతర సమూహాలతో కలిసి పనిచేసే అవసరం లేకపోవడంతో ప్రస్తుతం పనుల్లో ఉన్న కార్మికులు సైతం సురక్షితంగా ఉంటున్నారు.


జన సమూహాల మధ్య పని చేయడం ప్రమాదమని తెలిసినా కుటుంబ పోషణ కోసం తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వస్తున్న పేద, మద్య తరగతి కుటుంబీకులు తాము వైరస్‌ బారిన పడటంతోపాటు తమ ద్వారా కుటుంబ సభ్యులను వ్యాధిగ్రస్తులను చేస్తున్నారు. చికిత్స పేరుతో నెల రోజులపాటు ఇంటిల్లిపాది ఉపాధిని కోల్పోయి ఆర్థికంగా మరింత చితికిపోతున్నారు. 


ఊరూరా తిరిగేవారే ఎక్కువ

సూళ్లూరుపేటలో 145 మంది కరోనా బాధితులైతే వీరిలో 50 శాతం మధ్య తరగతికి చెందిన వారే. మిగిలిన 40 శాతం మంది పేదలు ఉన్నారు. తడలో 41 కేసులు, సంగంలో 30 కేసులు నమోదవగా అందరూ పేద, మధ్య తరగతి వర్గాలకు చెందినవారు. పొట్ట కూటి కోసం కూరగాయల మార్కెట్లలో మూటలు మోసే కూలీలు, ఊరూరా తిరిగి వ్యాపారాలు చేసుకునే చిరు వ్యాపారులు ఉన్నారు. నాయుడుపేటలో 21 కేసులు నమోదవగా ఒక్కరు కూడా ధనికులు లేరు.  ముత్తుకూరు మండలంలో ఆరు కేసులు నమోదు అయితే ఐదుఉరు పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెందినవారే. మనుబోలులో రెండు కేసులు ఉంటే ఆ రెండు పైవర్గాలకు చెందినవారే. కావలి పట్టణంలో 35 కేసులు నమోదవగా 25 మంది పేద, మధ్య తరగతికి   చెందిన వారు కాగా మిగిలిన 10 మంది వ్యాపారులు.


సైదాపురంలో ఐదు కేసులు నమోదైతే అందరూ మధ్యతరగతివారే. ఏఎ్‌సపేటలో 11 కేసులు ఉంటే అందరూ పై వర్గాలకు చెందిన వారే. గూడూరులో 17 కేసుల్లో నలుగురు మధ్యతరగతికి చెందిన వారు కాగా మిగిలిన 13 మంది పేదలు. చేజర్ల, కలిగిరి, ఉదయగిరి, చిట్టమూరు, ఆత్మకూరు, కావలి రూరల్‌, ఎస్‌.ఆర్‌పురం కోట, బాలాయపల్లి, దొరవారిసత్రం, చిట్టమూరు, జలదంకి మండలాల్లో కరోనా బాఽధితులంతా పేద, మధ్య తరగతికి చెందిన వారే కావడం గమనార్హం.

Updated Date - 2020-07-07T10:31:46+05:30 IST