పాఠశాలలపై కరోనా పంజా

ABN , First Publish Date - 2022-01-22T06:34:05+05:30 IST

ప్రభుత్వ పాఠశాలలపై కరోనా పంజా విసురుతోంది. ఈనెల 17వ తేదీ నుంచి ఐదు రోజుల్లో 230మందికి పాజిటివ్‌ నమోదైంది.

పాఠశాలలపై  కరోనా పంజా

 ఐదురోజుల్లో 230మందికి పాజిటివ్‌ 

చిత్తూరు(సెంట్రల్‌), జనవరి 21: ప్రభుత్వ పాఠశాలలపై కరోనా పంజా విసురుతోంది. ఈనెల 17వ తేదీ నుంచి ఐదు రోజుల్లో 230మందికి పాజిటివ్‌ నమోదైంది. ఇందులో 219మంది ఉపాధ్యాయులు ఉండగా 11 మంది విద్యార్థులకూ వైరస్‌ సోకింది. పాజిటివ్‌ వచ్చిన ఉపాధ్యాయులకు వారం నుంచి 15 రోజుల పాటు సెలవులు ఇస్తుండగా, విద్యార్థులను ఇంటికి పంపేసి తాత్కాలికంగా వారి తరగతి గదిని ఖాళీ చేయుస్తున్నారు. ఆ మరుసటి రోజున తరగతి గదిని శానిటైజ్‌ చేయకుండానే విద్యార్థులకు పాఠాలు చెబుతున్నారు.కొవిడ్‌ నివారణకు ప్రభుత్వం నుంచి జిల్లా విద్యాశాఖ అధికారులకు ఇప్పటి వరకు ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో అధికారులు తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నారు.చాలామంది విద్యార్థులు జ్వరాలతో పాటు తీవ్రమైన తల, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. ఇక ప్రైవేటు పాఠశాలల్లో కూడా రోజుకు ఒకరిద్దరు కొవిడ్‌ భారిన పడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో పెరుగుతున్న కొవిడ్‌ కేసులపై జిల్లా ఉన్నతాధికారులు సైతం నోరు మెదపకపోవడం, ప్రైవేటు యాజమాన్యాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలపై విద్యాశాఖ అధికారులు దృష్టి సారించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే విద్యాశాఖలో మరో వారం రోజుల్లో పాజిటివ్‌ కేసులు భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదు. 


మహిళా వర్సిటీ వీసీకి పాజిటివ్‌

మహిళా యూనివర్సిటీ వీసీ జమునకు కరోనా సోకినట్టు సమాచారం.అలాగే యూనివర్సిటీలోని పలు విభాగాల్లో కూడా కరోనా కేసుల ఉధృతి ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది.

పాఠశాలల్లో నమోదైన కొవిడ్‌ కేసుల వివరాలు... 

తేదీ          టీచర్లు    విద్యార్థులు  మొత్తం 


17.01.22 52 01 53 

18.01.22 33 02 35 

19.01.22 47 01 48 

20.01.22 30 07 37 

21.01.22 57 00 57

====================================

219 11 230


తాజా కేసులు 1,585 

తిరుమల, జనవరి 21(ఆంధ్రజ్యోతి): కొవిడ్‌ కేసుల నమోదులో జిల్లా రెండవస్థానంలో కొనసాగుతోంది. గురువారం ఉదయం నుంచి శుక్రవారం ఉదయం వరకు 24 గంటల వ్యవధిలో విశాఖలో 2,244 కేసులు నమోదవగా ఆ తర్వాత అధికంగా మన జిల్లాలోనే 1,585 కేసులు వెలుగుచూశాయి. అదే వ్యవధిలో కరోనాతో ఒకరు మృతిచెందారు.యాక్టివ్‌ కేసులు 10,446కు పెరిగాయి. కొత్తగా గుర్తించిన కేసులు మండలాల వారీగా.. తిరుపతి అర్బన్‌ పరిధిలో 339, చిత్తూరులో 175, మదనపల్లెలో 118, తిరుపతి రూరల్‌లో 77, శ్రీకాళహస్తిలో 39, పుత్తూరులో 37, పలమనేరులో 23, పుంగనూరులో 22, నగరిలో 14, కుప్పంలో 81, చంద్రగిరిలో 61, పూతలపట్టులో 41, పీలేరులో 34, పాకాలలో 31, శాంతిపురంలో 27, బంగారుపాళ్యంలో 25, గంగాధరనెల్లూరులో 22, వాల్మీకిపురంలో 21, బి.కొత్తకోటలో 20, చౌడేపల్లెలో 17, రామకుప్పంలో 16, కేవీపల్లె, ములకలచెరువు మండలాల్లో 15 చొప్పున, కలికిరి, నాగలాపురం, రామసముద్రం, సోమల మండలాల్లో  14చొప్పున, రేణిగుంట, రొంపిచర్ల మండలాల్లో  13చొప్పున, రామచంద్రాపురం, తంబళ్లపల్లె మండలాల్లో   12చొప్పున, గుడిపాల, గుర్రంకొండ, పెద్దతిప్పసముద్రం, వి.కోట మండలాల్లో    11చొప్పున, గంగవరం, కార్వేటినగరం, పులిచర్ల, సదుం మండలాల్లో   10చొప్పున, బైరెడ్డిపల్లె, చిన్నగొట్టిగల్లు, పెద్దపంజాణి మండలాల్లో 9 కేసుల చొప్పున , నారాయణవనం, నిండ్ర, పెద్దమండ్యం, తవణంపల్లె  మండలాల్లో 8చొప్పున, కలకడలో 7, కురబలకోట, శ్రీరంగరాజపురం, ఏర్పేడు మండలాల్లో 6చొప్పున, గుడుపల్లె, విజయపురం మండలాల్లో  5చొప్పున, ఐరాల, నిమ్మనపల్లె, పెనుమూరు, వడమాలపేట మండలాల్లో  4చొప్పున, పిచ్చాటూరు, తొట్టంబేడు మండలాల్లో   3చొప్పున, బుచ్చినాయుడుకండ్రిగ, వరదయ్యపాళ్యం, వెదురుకుప్పం మండలాల్లో రెండేసి, కేవీబీ పురం, సత్యవేడు, ఎర్రవారిపాలెం మండలాల్లో  ఒక్కొక్కటి చొప్పున కేసులు నమోదయ్యాయి. 


కొవిడ్‌ బాధితులకు 

ఎన్‌ఆర్‌ఐ వైద్యుల సూచనలు

చిత్తూరు సిటీ, జనవరి 21: జూమ్‌ లింక్‌ ద్వారా కరోనా నివారణకు ప్రముఖ వైద్యుల సూచనలు తీసుకోవచ్చని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి సురేంద్రకుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వినూత్న ఆలోచనతో ఈ కార్యక్రమం ప్రారంభించారని చెప్పారు. ఎన్టీయార్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జూమ్‌ కాల్‌ ద్వారా అమెరికా వైద్యనిపుణులతో టెలిమెడిసిన్‌ సేవలు ప్రారంభించారని పేర్కొన్నారు. రోజూ ఉదయం 7 గంటలపైన జూమ్‌ లింక్‌ ద్వారా జాయిన్‌ అయి ఈ సేవలను ఉపయోగించుకోవచ్చన్నారు. జూమ్‌ లింక్‌ వాట్సాప్‌ గ్రూపుల్లో వుంటుందని ఆ ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2022-01-22T06:34:05+05:30 IST