కరోనా: ఒక్కసారిగా ఉలిక్కిపడిన విజయవాడ..!

ABN , First Publish Date - 2020-04-09T18:44:32+05:30 IST

రెండు రోజులు కాస్త శాంతించిన కరోనా మహమ్మారి బుధవారం మళ్లీ చెలరేగింది. ఈ ఒక్కరోజే నగరంలో 6 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్కటి మినహా మిగిలిన కేసులన్నీ ఢిల్లీ మర్కజ్‌ సమావేశాలకు వెళ్లొచ్చినవారి ద్వారా వ్యాపించినవే

కరోనా: ఒక్కసారిగా ఉలిక్కిపడిన విజయవాడ..!

కమ్ముకొస్తున్న కాలనాగు

బుధవారం ఒక్కరోజే ఆరు పాజిటివ్‌ కేసులు

ఒకటి మినహా అన్ని కేసులూ ఢిల్లీ మర్కజ్‌తో ముడిపడినవే..


విజయవాడ (ఆంధ్రజ్యోతి): రెండు రోజులు కాస్త శాంతించిన కరోనా మహమ్మారి బుధవారం మళ్లీ చెలరేగింది. ఈ ఒక్కరోజే నగరంలో 6 పాజిటివ్‌ కేసులు నమోదు కావడంతో జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్కటి మినహా మిగిలిన కేసులన్నీ ఢిల్లీ మర్కజ్‌ సమావేశాలకు వెళ్లొచ్చినవారి ద్వారా వ్యాపించినవే. విద్యాధరపురంలోని కుమ్మరిపాలెం, భవానీపురం అల్లుడుపేట, కొత్తపేట, కేదారేశ్వరపేటలోని ఖుద్దూస్‌నగర్‌ తదితర ప్రాంతాల్లో ఆరుగురికి కరోనా పాజిటివ్‌ రాగా, వారిలో నలుగురు మహిళలు. 


విద్యాధరపురానికి చెందిన వ్యక్తి ఇటీవల ఢిల్లీలో మత ప్రార్థనలకు హాజరై వచ్చిన తర్వాత అతని తల్లి గతనెల 29న ఇంటి దగ్గర, తండ్రి 30న కొవిడ్‌ ఆసుపత్రిలో చనిపోయిన సంగతి తెలిసిందే. ఈ దంపతుల్లో భర్త శాంపిల్స్‌ను వైద్యులు సేకరించి వైద్యపరీక్షలు నిర్వహించగా, కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతని భార్యకు వైద్య పరీక్షలు నిర్వహించకపోవడంతో ఆమెదీ సాధారణ మరణంగానే భావిస్తున్నారు. అయితే, ఆమె చనిపోయినప్పుడు వెళ్లిన బంధువుల్లో కుమ్మరిపాలేనికి చెందిన ఓ మహిళ,  భవానీపురం అల్లుడుపేటకు చెందిన మరో మహిళకు బుధవారం కరోనా పాజిటివ్‌ వచ్చింది. అప్పటి నుంచి క్వారంటైన్‌లోనే ఉన్న వీరిద్దరినీ అధికారులు కొవిడ్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. 


పాత రాజరాజేశ్వరిపేటలోని ఖుద్దూస్‌నగర్‌కు చెందిన వ్యక్తి ఢిల్లీలో మత ప్రార్థనల్లో పాల్గొని వచ్చాడు. గాంధీనగర్‌లోని ఒక బిర్యానీ పాయింట్‌లో పనిచేసే అతను ఢిల్లీ నుంచి వచ్చి యథావిధిగా బిర్యానీ పాయింట్‌లో విధులకు హాజరైనట్లు చెబుతున్నారు. ఆ తర్వాత అతనికి కరోనా లక్షణాలు కనిపించడం, వైద్యపరీక్షలు నిర్వహిస్తే పాజిటివ్‌గా తేలింది. అతనిని ఆసుపత్రిలో చేర్పించిన అధికారులు కుటుంబ సభ్యులను క్వారంటైన్‌కు తరలించారు. అప్పటి నుంచి క్వారంటైన్‌లో ఉన్న అతని 60ఏళ్ల తల్లికి బుధవారం కరోనా పరీక్షల్లో పాజిటివ్‌ వచ్చింది. 


కొత్తపేట శ్రీనివాసమహల్‌ ప్రాంతానికి చెందిన మహిళ ఆయాసంతో బాధపడుతుండగా, విజయవాడ ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో సాధారణ వైద్యసేవలను నిలిపివేయడంతో గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లింది. నాలుగైదు రోజులుగా అక్కడే చికిత్స పొందుతున్న ఆమెకు వైద్యపరీక్షల్లో కరోనా పాజిటివ్‌ అని తేలింది. ఈ మహిళకు ఢిల్లీకి వెళ్లొచ్చిన వారితో ఎలాంటి సంబంధం లేదు. ఈమెకు కరోనా వైరస్‌ ఎలా సోకిందనేది ప్రశ్నార్థకంగా మారింది. నగరంలోనే వేర్వేరు ప్రాంతాలకు చెందిన మరో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.


185 మంది రిపోర్టుల కోసం వెయిటింగ్‌ 

ఢిల్లీ మర్కజ్‌ సమావేశాలకు హాజరై జిల్లాకు తిరిగి వచ్చినవారు, వారి ద్వారా కుటుంబ సభ్యులు, వారితో కాంటాక్ట్‌ అయినవారిలో ఇప్పటి వరకు మొత్తం 586 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, 366 మందికి నెగెటివ్‌ వచ్చింది. ఇంకా 185 మంది కరోనా అనుమానితుల రిపోర్టులు రావాల్సి ఉంది. అలాగే, విదేశాల నుంచి జిల్లాకు తిరిగొచ్చిన 2,443 మందిని గుర్తించి గృహ నిర్బంధంలో ఉంచారు. వీరిలో నలుగురికి కరోనా పాజిటివ్‌ రాగా, వారిని కొవిడ్‌ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ నలుగురిలో వన్‌టౌన్‌ యువకుడు, గాయత్రీనగర్‌కు చెందిన మరో యువకుడు కోలుకోవడంతో వారిని ఇటీవలే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి చేశారు. గృహ నిర్బంధంలో ఉన్నవారిలో 1,197 మందికి 28 రోజుల హోం క్వారంటైన్‌ పూర్తికాగా, మిగిలిన 1,246 మంది ఇంకా హోం క్వారంటైన్‌లో ఉన్నారు. మచిలీపట్నానికి చెందిన ఒక వ్యక్తి, విద్యాధరపురానికి చెందిన మరొక వ్యక్తి కొవిడ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇటీవల మరణించారు. వీరిద్దరి మరణాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2020-04-09T18:44:32+05:30 IST