భయం గుప్పిట్లో కూకట్‌పల్లి.. విపరీతంగా కరోనా కేసులు..!

ABN , First Publish Date - 2020-07-03T14:45:07+05:30 IST

కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్ల పరిధుల్లో 300లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 9 మంది మృతిచెందగా.. 170 మంది బాధితులు ఆస్పత్రులు, హోం క్వారంటైన్‌లో ఉన్నారు.

భయం గుప్పిట్లో కూకట్‌పల్లి.. విపరీతంగా కరోనా కేసులు..!

కరోనా ధాటికి భయపడుతున్న వారియర్స్‌  

రోజురోజుకూ పెరుగుతున్న కేసులు 


కూకట్‌పల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లి, మూసాపేట జంట సర్కిళ్ల పరిధుల్లో 300లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 9 మంది మృతిచెందగా.. 170 మంది బాధితులు ఆస్పత్రులు, హోం  క్వారంటైన్‌లో ఉన్నారు. మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో కేసుల నమోదు చాలా తక్కువగా ఉన్నప్పటికీ... ఇటీవల కాలంలో పెరిగాయి. జూన్‌లో వందకు పైగా నమోదయ్యాయి. జూలైలో ప్రతిరోజూ 25కి పైగా కేసులు నమోదవుతున్నాయి. మొదట్లో ఒక్క కేసు కూడా నమోదు కాని కాలనీలకు కరోనా పాకింది. నాలుగు నెలల్లో కూకట్‌పల్లి వివేకానందనగర్‌ కాలనీలో ఒక్క కేసు మాత్రమే నమోదు కాగా.. ప్రస్తుతం కేసుల సంఖ్య పెరుగుతోంది. బస్తీల నుంచి గేటెడ్‌ కమ్యూనిటీల వరకు వైరస్‌ పాకింది. గేటెడ్‌ కమ్యూనిటీల కంటే బస్తీల్లోనే మహమ్మారి వేగంగా వ్యాపిస్తోంది.  


పీహెచ్‌సీలో విధుల్లో 13 మందే 

వారియర్స్‌గా పనిచేస్తున్న ఆరోగ్యశాఖ, జీహెచ్‌ఎంసీ సిబ్బంది, పోలీసులు కరోనాతో భయపడుతున్నారు. కూకట్‌పల్లి పోలీ్‌సస్టేషన్‌ పరిధిలో ఓ ఎస్‌ఐకి కరోనా లక్షణాలు కనిపించడంతో పోలీసు సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు భయపడుతున్నారు. రెండురోజులుగా పోలీస్ స్టేషన్‌లో సిబ్బందిని తగ్గించడంతో ఖాళీగా కనిపిస్తోంది. జీహెచ్‌ఎంసీ అధికారులకు కరోనా కేసుల విషయంలో సరైన సమాచారం రావడంలేదని వాపోతున్నారు. కట్టడి ప్రాంతాలు, ప్రజల్లో అవగాహన కల్పించే విషయంలో జీహెచ్‌ఎంసీకి ప్రభుత్వం నుంచి సరైన సహకారం లభించడంలేదని సమాచారం. జీహెచ్‌ఎంసీ సిబ్బందికి కూడా కరోనా సోకడంతో అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణ విషయంలో భయాందోళనకు గురవుతున్నారు. ఆరోగ్య శాఖ అధికారులు, సిబ్బంది పరిస్థితి దారుణంగా ఉంది. సిబ్బంది కొరత, కరోనా పరీక్షల విషయంలో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ కాకపోవడంతో తలలు పట్టుకొంటున్నారు. కూకట్‌పల్లి ప్రాంతంలో 2 వేల మందికి ఓ ఏఎన్‌ఎం ఉండాల్సి ఉండగా.. 60 వేల మందికి ముగ్గురు మాత్రమే ఉన్నారు. కూకట్‌పల్లి పీహెచ్‌సీలో కనీసం 30మంది అధికారులు, సిబ్బంది ఉండాల్సి ఉండగా... 13 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు.


గేటెడ్‌ కమ్యూనిటీలు సేఫ్‌

మొదట్లో ధనికులు ఉండే కాలనీల్లో కేసుల నమోదు ప్రారంభమైంది. ఇతర దేశాల నుంచి రావడంతో ఆయా ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయని అధికారులు గుర్తించి ఆయా కాలనీలవాసులు నివారణ చర్యలు చేపట్టారు.  ముఖ్యంగా గేటెడ్‌ కమ్యూనిటీల్లో మొదటిసారి కేసు నమోదు కాగానే కాలనీలోకి రాకపోకలను కఠినతరం చేశారు. కాలనీవాసులందరూ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంపొందించుకొని అప్రమత్తమయ్యారు. గేటెడ్‌ కమ్యూనిటీల్లో కేసుల నమోదు తక్కువగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. 


బస్తీల్లో కట్టడి ప్రాంతాల ఎత్తివేత

బస్తీల్లో కేసులు పెరుగుతున్నాయి. పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, కరోనా రక్షణ చర్యలు పాటించడంపై దృష్టి సారించకపోవడంతో కేసులు విపరీతంగా పెరుగుతున్నట్లు తేలింది. కట్టడి ప్రాంతాలను ఎత్తివేయడంతో బస్తీల్లో కేసుల నమోదు విపరీతంగా పెరుగుతోంది.  


కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌లో..

కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పరిధిలో శనివారం నాటికి మొత్తం 90 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. గాజులరామారం సర్కిల్‌ పరిధిలో 58 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో ఇద్దరు మృతి చెందారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 256 మంది వైరస్‌ బారినపడ్డారు. వీరిలో 10 మంది మృతి చెందగా, 108 మంది రికవరీ అయ్యారు. 100 మందికి పాజిటివ్‌ వచ్చినప్పటికీ లక్షణాలు లేకపోవడంతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ప్రస్తుతం 38 మంది పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.  


గాజులరామారం సర్కిల్‌ పరిధి చంద్రానగర్‌కు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలోని మర్కజ్‌కు వెళ్లి రావడంతో మొదటి కేసు నమోదైంది. అతడి ద్వారా కుత్బుల్లాపూర్‌ నుంచి మర్కజ్‌కు వెళ్లి వచ్చిన పలువురికి కరోనా సోకింది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో కేసుల సంఖ్య పెరుగుతోంది. చింతల్‌ పరిసర ప్రాంతాలకు చెందిన వారితోపాటు గాజులరామారంలో కరోనా పాజిటివ్‌ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ప్రభుత్వం ఉచితంగా నిర్వహిస్తున్న పరీక్షలను తాత్కాలికంగా నిలిపివేసింది. 


ఈ ప్రాంతాల్లో అధికం

మూసాపేట సర్కిల్‌లోని కేపీహెచ్‌బీ, అల్లాపూర్‌, మూసాపేట డివిజన్ల పరిధుల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. బాలాజీనగర్‌, ఫతేనగర్‌ ప్రాంతాల్లో ఇప్పుడే కేసుల నమోదు ప్రారంభమైంది. కేపీహెచ్‌బీకాలనీ డివిజన్‌లో మొట్ట మొదటి కేసు మార్చిలోనే నమోదైనప్పటికీ.. రానురానూ ఇతర డివిజన్లకు వైరస్‌ వేగంగా పాకింది. ప్రస్తుతం కేపీహెచ్‌బీకాలనీని మించి ఇతర డివిజన్లలో కేసులు నమోదవుతున్నాయి. కూకట్‌పల్లి సర్కిల్‌లోని ఆల్విన్‌కాలనీ, పాతబోయిన్‌పల్లి, వివేకానందనగర్‌కాలనీ, బాలానగర్‌ డివిజన్ల పరిధుల్లో కేసుల తీవ్రత ఎక్కువగా ఉంది. హైదర్‌నగర్‌, కూకట్‌పల్లి డివిజన్లలో ఐదు కేసులు నమోదుకాగా మిగతా డివిజన్లలో పదుల సంఖ్యలో ఉన్నాయి. 

Updated Date - 2020-07-03T14:45:07+05:30 IST