విశాఖ జిల్లాలో.. 50వేలకు చేరిన కేసులు

ABN , First Publish Date - 2020-09-29T15:57:23+05:30 IST

కరోనా మహమ్మారి జిల్లాలో అడుగుపెట్టి ఆరు నెలలు దాటింది. కేసుల సంఖ్య..

విశాఖ జిల్లాలో.. 50వేలకు చేరిన కేసులు

ఒక్క విశాఖ నగరంలోనే... 41,092 మంది బాధితులు

200 కేసులు దాటిన మండలాలు 13

అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం, పాయకరావుపేటల్లో భారీగా నమోదు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): కరోనా మహమ్మారి జిల్లాలో అడుగుపెట్టి ఆరు నెలలు దాటింది. కేసుల సంఖ్య 50 వేల (50,014) మార్కును దాటింది. మరణాలు 398 నమో దయ్యాయి. జిల్లాలో మార్చి 19న మొదటి కేసు నమోదు కాగా, ఆ నెలాఖరు నాటికి 10, ఏప్రిల్‌లో 13, మేలో 90, జూన్‌లో 787 కేసులు నమోదయ్యాయి. జూలై నెల నుంచి కేసుల సంఖ్య భారీగా పెరుగుతూ వచ్చింది. ఒక్క ఆ నెలలోనే 10,277 కేసులు నమోదయ్యాయి. ఆ రికార్డును బ్రేక్‌ చేస్తూ ఆగస్టులో వైరస్‌ విజృంభించింది. 31 రోజుల్లో 25,929 మందికి వైరస్‌ సోకగా, 172 మంది మృత్యువాత చెందారు. ఆగస్టులో నమోదైన కేసులను చూసి సెప్టెంబరులో కూడా వైరస్‌ విజృంభణ కొనసాగుతుందని అంతా ఆందోళనకు గురయ్యారు. అయితే అందరి అంచనాలను తలకిందులు చేస్తూ కేసులు సగానికి తగ్గాయి. ఒకటో తేదీ (1,049 కేసులు) మినహా...ప్రతిరోజూ 500లోపు కేసులు నమోదయ్యాయి. ఇక సుమారు రెండు నెలల తరువాత సోమవారం కనిష్ఠ స్థాయిలో... 145 కేసులు మాత్రమే వచ్చాయి. వీటితో కలుపుకుని ఈ నెలలో ఇప్పటివరకు 12,908 కేసులు నమోదు కాగా, జిల్లాలో మొత్తం సంఖ్య 50,014కు చేరింది. 


జిల్లాలో ఒక్క విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ) పరిధిలోనే 41,092 కేసులు నమోదయ్యాయి. మిగిలిన గ్రామీణ జిల్లాలో తొమ్మిది వేల కేసులు వచ్చాయి. అంటే జనాభా సాంద్రత ఎక్కడ ఎక్కువగా వుంటే అక్కడ కరోనా వ్యాప్తి చెందుతున్నట్టుగా అర్థమవుతోంది.


జిల్లాలో ప్రధాన పట్టణాలైన అనకాపల్లి, చోడవరం, నర్సీపట్నం, పాయకరావుపేట, పాడేరుల్లో ఇతర ప్రాంతాల కంటే ఎక్కువ కేసులు వచ్చాయి. అనకాపల్లిలో 1,552, నర్సీపట్నం (అర్బన్‌)లో 898, పాయకరావుపేటలో 566, చోడవరంలో 432, పాడేరులో 427 కేసులు నమోదయ్యాయి.


ఆ మూడు మండలాల్లో 100 లోపు..

ఏజెన్సీలోని ముంచంగిపుట్టు మండలంలో 35, జి.మాడుగులలో 73, డుంబ్రిగుడలో 87 కేసులు వచ్చాయి. జీకే వీధి, కొయ్యూరు, పెదబయలు మండలాల్లో వంద దాటాయి.


ప్రజలకు కావలసింది

ఇప్పుడు ప్రజలు కరోనా పరీక్ష సులువుగా చేయించుకోగలుగుతున్నారు. స్థానిక పీహెచ్‌సీలు, ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాల్లో 24 గంటల ముందు పేరు నమోదు చేసుకుంటే పరీక్ష చేస్తున్నారు. అయితే ఫలితం వచ్చిన తరువాత ఆస్పత్రిలో చేరతారా? ఇంట్లో వుండి చికిత్స తీసుకుంటారా? అని అడుగుతున్నారు. జిల్లా కొవిడ్‌ ఆస్పత్రులు తప్పితే ఇతర ఆస్పత్రులు, కొవిడ్‌ కేర్‌ సెంటర్లలో ట్రీట్‌మెంట్‌ సరిగ్గా లేకపోవడంతో 80 శాతం మంది ఇంటి దగ్గరే ఉంటామంటున్నారు.


అలా చెప్పిన వారికి ఎటువంటి వైద్య సాయం ఇవ్వడం లేదు. బాధ్యత లేనట్టుగా సిబ్బంది వ్యవహరిస్తున్నారు. కనీసం ఫలానా మందులు వాడాలని కూడా చెప్పడం లేదు. ఈ విధానం మారాలి. మందులు ఉచితంగా ఇవ్వలేని స్థితిలో జిల్లా యంత్రాంగం వుంటే...ఫలానా మందులు వాడాలని చెప్పాలి. కనీసం ఆ సాయం చేసినా...తాము ఏ మందులు వాడాలో అనే అవగాహన ప్రజలకు కలుగుతుంది. లేదంటే..మెడికల్‌ షాపుల్లో ఏమి ఇస్తే అదే వేసుకుంటున్నారు. లేదంటే వాట్సాప్‌ గ్రూపుల్లో చూసిన మందులు వాడుతున్నారు. కరోనా పరీక్ష చేసుకున్న కేంద్రంలో వైద్యులు ఉంటారు కాబట్టి..అక్కడే ప్రిస్కిప్షన్‌ ఇచ్చి, వీలైతే అందుబాటులో వున్న మందులు ఇవ్వడానికి యత్నించాలి. అప్పుడు కరోనా మరింత త్వరగా అదుపులోకి వస్తుంది.


అప్రమత్తంగా ఉండాల్సిందే: కేజీహెచ్‌ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌, ఏఎంసీ ప్రిన్సిపాల్‌ పీవీ సుధాకర్‌

వైరస్‌ తీవ్రతలో కొంత తగ్గుదల కనిపిస్తున్నప్పటికీ ప్రజలు మరికొద్ది రోజులపాటు అప్రమత్తంగా ఉండాలి. వ్యాక్సిన్‌, మందు వచ్చేంతవరకు జాగ్రత్తలు పాటించాలి. ప్రస్తుతం చాలామంది గుంపులుగా తిరగడం, మాస్కులు ధరించకపోవడం వంటివి చేస్తున్నారు. ఇది మంచిది కాదు. కొద్ది రోజులుగా కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. ఒక్క కేసు కూడా నమోదు కాని స్థితి చేరుకునేంతవరకు జాగ్రత్తలు పాటించాలి.



Updated Date - 2020-09-29T15:57:23+05:30 IST