పది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంతూరికి వెళ్లిన వ్యక్తికి కరోనా..

ABN , First Publish Date - 2020-07-09T22:21:06+05:30 IST

ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం రికార్డు స్థాయిలో 29 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు.

పది రోజుల క్రితం హైదరాబాద్ నుంచి సొంతూరికి వెళ్లిన వ్యక్తికి కరోనా..

విజృంభణ.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆగని కరోనా వ్యాప్తి

ఒక్క రోజే 28 పాజిటివ్‌ కేసులు, ముగ్గురు మృతి


మహబూబ్‌నగర్‌ (ఆంధ్రజ్యోతి) : ఉమ్మడి పాలమూరు జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. బుధవారం రికార్డు స్థాయిలో 29 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మృతి చెందారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం ఒక్కరోజే 12 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వారిలో ముగ్గురు మృతి చెందారు. జిల్లాకేంద్రంలోని ఏనుగొండ రెవెన్యూ వార్డుకు చెందిన ఓ కిరాణం నిర్వాహకుడికి వైరస్‌ సోకింది. ఈయనకు కొద్ది రోజులుగా జ్వరం, దగ్గు, జలుబు లక్షణాలు ఉండడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ల్యాబులో పరీక్ష చేయించుకోగా పాజిటివ్‌గా తేలింది. రాంనగర్‌ కాలనీకి చెందిన ఓ వైద్య ఉద్యోగికి, అతడి భార్యకు కొన్ని రోజుల క్రితం పాజిటివ్‌ వచ్చింది. తాజాగా వారి 12 ఏళ్ల కూతురికి వైరస్‌ నిర్ధారణ అయ్యింది. పద్మావతి కాలనీలోని కృష్ణ టెంపుల్‌ వద్ద ఉన్న ఓ వ్యక్తికి కరోనా వైరస్‌ సోకింది. అతన్ని హోం ఐసోలేషన్‌లో ఉంచారు. ఽఇతను హెటిరో ఫార్మా కంపెనీలో ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ధనలక్ష్మి కాలనీలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తికి వైరస్‌ సోకింది. ఆయన జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి ఎస్‌బీఐలో పనిచేస్తున్నాడు. హౌసింగ్‌ బోర్డు కాలనీకి చెందిన ఓ రిటైర్డ్‌ పోస్టల్‌ ఉద్యోగికి వైరస్‌ సోకింది. ఎస్వీఎస్‌ ఆసుపత్రిలోని ఓ పీజీ వైద్యురాలికి, మధురానగర్‌కు చెందిన ఓ యువకుడికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయ్యింది.  బూత్పూర్‌ మండలం గుబ్బ తండాకు చెందిన ఓ వ్యక్తి ఇటీవల కరోనాతో మృతి చెందాడు. తాజాగా ఆయన భార్యకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. జడ్చర్ల మండలం చర్లపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళకు వైరస్‌ నిర్ధారణ అయ్యింది. 


ముగ్గురి మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లాకేంద్రంలోని రాంనగర్‌ ప్రాంతానికి చెందిన ఓ 67 ఏళ్ల వృద్దుడికి కరోనా పాజిటివ్‌ రావడంతో గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ మంగళవారం మరణించాడు. అదేవిధంగా కోయిలకొండ మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి పట్టణంలోని గోల్‌ మజీద్‌ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి కరోనా పాజిటివ్‌ రావడంతో ఉస్మానియాలో చేర్పించారు. చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. జడ్చర్లకు చెందిన ఓ మహిళ గత ఐదు రోజుల క్రితం మృతి చెందింది. ఆమె బతికుండగానే నమూనాలు సేకరించి పరీక్షకు పంపించారు. ఆమెకు కరోనా పాజిటివ్‌ అని బుధవారం నిర్ధారించారు. 


వనపర్తి జిల్లాలో ఏకంగా 11 మందికి కరోనా సోకింది. ఖిల్లాఘణపురం ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఏడు కేసులు నమోదు కాగా, వీరందరూ గతంలో పాజిటివ్‌ వచ్చిన ఏఎన్‌ఎంకు ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులుగా ఉన్నారు. బుధవారం నమోదైన కేసుల్లో ఏఎన్‌ఎం, స్టాఫ్‌ నర్సు, ఆశా కార్యకర్త, ల్యాబ్‌ టెక్నిషియన్‌, కాంటింజెన్సీ వర్కర్‌, డాటా ఎంట్రీ ఆపరేటర్‌, అటెండర్‌ ఉన్నారు. వనపర్తి పట్టణంలో మరో నాలుగు కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకు వనపర్తి జిల్లాలో 686 శాంపిళ్లను సేకరించగా, 52 మందికి పాజిటివ్‌గా తేలింది. వారి ప్రైమరీ కాంటాక్టులుగా 488 మంది, సెకండరీ కాంటాక్టులుగా 313 మందిని హోం క్వారంటైన్‌ చేశారు. ఇప్పటి వరకు ముగ్గురు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం 47 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 


- నాగర్‌కర్నూల్‌ జిల్లా లింగాల మండలంలోని మగ్ధుంపూర్‌లో కరోనా పాజిటివ్‌ కేసు నమోదు అయినట్లు జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్‌ తెలిపారు. అతను 10 రోజుల క్రితం హైదరాబాద్‌ నుంచి గ్రామానికి వచ్చాడు. స్థానిక వైద్యాధికారి సురేష్‌బాబు, వైద్య సిబ్బంది, పోలీసులు గ్రామంలో పర్యటించారు. అతడితో కాంటాక్ట్‌ అయిన 10 మందిని గుర్తించారు. వారిని గురువారం జిల్లా ఆసుపత్రికి పంపించనున్నారు. 


- అచ్చంపేట పట్టణంలోని వినాయకనగర్‌ కాలనీలో ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. అతను వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌కు వెళ్లగా వైరస్‌ సోకింది. టీచర్స్‌ కాలనీలో మరొకరికి కరోనా సోకింది. ఇతను హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం అక్కడే చికిత్స పొందుతున్నాడు. ఇద్దరికి సంబంధించి 23 మంది ప్రైమరీ కాంటాక్స్ట్‌ను గుర్తించినట్లు డిప్యూటీ డీఎం అండ్‌ హెచ్‌ఓ శ్రీధర్‌, ఉప మలేరియా అధికారి ఆశోక్‌ ప్రసాద్‌ తెలిపారు. 


- జోగుళాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం శాంతినగర్‌ ఎస్‌బీఐలో ఫీల్డ్‌ ఆఫీసర్‌కు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇతను కర్నూల్‌  జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, శాంతినగర్‌లోనే నివాసం ఉంటూ అప్పుడప్పుడు కర్నూల్‌కు వెళ్లి వస్తుండేవారు. ఇతను కర్నూల్‌లో టెస్ట్‌లు చయించుకోగా పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. గద్వాల మండలానికి చెందిన మరో వ్యక్తి కరోనా లక్షణాలతో బాధపడుతూ ప్రభుత్వ ఆసుపత్రిలోని ఐసోలేషన్‌ వార్డుకు రాగా, చికిత్స అందిస్తుండగా మృత్యువాత పడ్డారు. రాజోలిలో కరోనా బాధితుడి కుటుంబసభ్యులను హోంక్వారంటైన్‌ చేశారు. 


నారాయణపేట జిల్లా కేంద్రంలోని గణేష్‌మందిర్‌ వీధికి చెందిన 48 ఏళ్ల వ్యక్తికి కరోనా సోకింది. ఆయన అనారోగ్య సమస్యలతో ఇటీవల హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలో పరీక్షలు నిర్వహించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అతడి కుటుంబసభ్యులతో పాటు, కాంటాక్టు అయిన 34 మందిని హోంక్వారంటైన్‌ చేశారు. మండలంలోని అమ్మిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన 27 సంవత్సరాల వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆయన గత నెల 29న హైదరాబాద్‌ నుంచి స్వగ్రామానికి వచ్చాడు. 

Updated Date - 2020-07-09T22:21:06+05:30 IST