పాజిటివ్‌ అయినా పట్టించుకోవ్‌..

ABN , First Publish Date - 2020-08-15T21:58:48+05:30 IST

ఇదీ జిల్లాలో అనేక పరిశ్రమలు నడుపుతున్న వారి తంతు. ఆయా సంస్థల్లో పెద్దఎత్తున ఉద్యోగులు, కార్మికులకు వైరస్‌ సోకి పదుల సంఖ్య లో పాజిటివ్‌ కేసులు వస్తున్నా ఖాతరు చేయకుండా యథేచ్ఛగా కార్య కలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి పరీక్షలు చేయించాల్సి

పాజిటివ్‌ అయినా పట్టించుకోవ్‌..

జిల్లాలో అనేక పరిశ్రమల్లో కొవిడ్‌ నిబంధనలకు అడ్డగోలుగా తూట్లు

ఉద్యోగులు, కార్మికులకు వందల్లో పాజిటివ్‌లు.. అయినా యథేచ్ఛగా కార్యకలాపాలు

ధవళేశ్వరంలో ఓ ఫ్యాక్టరీలో ఏకంగా 250 మంది ఉద్యోగులకు కొవిడ్‌

కాకినాడ సమీపంలో ఓ పంచదార పరిశ్రమలోనూ కార్మికులకు పాజిటివ్‌లు 

పెద్దాపురం ఏడీబీ రోడ్డులో ఆక్వా పరిశ్రమ, రైస్‌ మిల్లుల్లోనూ భారీగా కేసులు

వివరాలు గోప్యంగా ఉంచి మిగిలిన వారితో యథావిథిగా పనిచేయించేస్తున్న కంపెనీలు

అటు కనీసం ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ గుర్తింపు శూన్యం.. భయాందోళనలో కార్మికులు

ఫ్యాక్టరీల్లో కేసులొస్తే ఇంటివద్ద వచ్చినట్టు తప్పుడు వివరాలు నమోదు చేయిస్తున్న వైనం

పరిశ్రమల్లో కేసులు వస్తే ఏంచేయాలనేదానిపైనా నిబంధనల్లో స్పష్టత కరువు


(కాకినాడ-ఆంధ్రజ్యోతి): ఇదీ జిల్లాలో అనేక పరిశ్రమలు నడుపుతున్న వారి తంతు. ఆయా సంస్థల్లో పెద్దఎత్తున ఉద్యోగులు, కార్మికులకు వైరస్‌ సోకి పదుల సంఖ్య లో పాజిటివ్‌ కేసులు వస్తున్నా ఖాతరు చేయకుండా యథేచ్ఛగా కార్య కలాపాలు కొనసాగిస్తున్నారు. ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్స్‌ను గుర్తించి పరీక్షలు చేయించాల్సి ఉండగా అవన్నీ తుంగలో తొక్కుతున్నారు. తాత్కా లికంగా యూనిట్లను మూసివేసి శానిటైజ్‌ చేయాల్సి ఉన్నా ఖాతరు చేయడం లేదు. కేసులను తొక్కిపెట్టి మిగిలిన ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. విషయం తెలిసి ఎవరైనా గట్టిగా నిలదీస్తే కొవిడ్‌ ఫ్యాక్టరీలోకాదు వాళ్ల ఇంట్లో వచ్చిదంటూ బుకాయించి మిగిలిన వాళ్లతో పనిచేయిస్తున్నారు. 


కేసులొస్తే ఏంటట...

జిల్లాలో భారీ, మెగా పరిశ్రమలు 65 పనిచేస్తున్నాయి. ఎంఎస్‌ఎంఈ కింద చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 8,200 నడుస్తున్నాయి. వీటిలో కొవిడ్‌ కారణంగా కొన్ని మూతపడగా, 80 శాతం ఉత్పత్తులు కొనసాగి స్తున్నాయి. అయితే వీటిలో పనిచేస్తున్న ఉద్యోగుల ఆరోగ్యం విషయంలో అధిక కంపెనీలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. పదులు, వందల్లో ఉద్యో గులు, కార్మికులకు పాజిటివ్‌లు నిర్ధారణ అవుతున్నా పట్టించుకోకుండా యథావిథిగా నడిచేస్తున్నాయి. కొవిడ్‌ సోకిన వారి వివరాలు దాచేసి ఏం తెలియదన్నట్టు పనిచేసేస్తున్నాయి. ముఖ్యంగా కాకినాడ, రాజమహేంద్ర వరం, మండపేట, రామచంద్రపురం, రాజమహేంద్రవరం రూరల్‌, కడి యం, పెద్దాపురం ఏడీబీ రహదారి వెంబడి ఉన్న అనేక కంపెనీల్లో ఇప్పుడు ఇదే తంతు. ఆక్వా పరిశ్రమలు, బియ్యం ప్యాకింగ్‌ చేసే కంపెనీ లు, టైల్స్‌, పంచదార, ఇతర ఆహార పదార్థాలు తయారుచేసే యూని ట్లు, ఆయిల్‌, కోల్డ్‌ స్టోరేజీలు, ఫార్మా, ఆగ్రో ఆయిల్స్‌ తదితర యూనిట్లలో ఉద్యోగులు, కార్మికులకు, ఇతర సిబ్బందిలో పాజిటివ్‌ కేసులు పెద్దఎత్తున నిర్ధారణ అవుతున్నాయి. జ్వరం, జలుబు, శ్వాస సంబంధిత సమస్యలతో అనేకమంది సతమతమవుతున్నారు. ముఖ్యంగా ధవళేశ్వరం లో ఇటీవల ఓ కంపెనీలో 250 పాజిటివ్‌లు వచ్చాయి. ఆరంభంలోనే జాగ్రత్తలు తీసుకోవాల్సిన సదరు సంస్థ పట్టించుకోలేదు. దీంతో కేసులు వందల్లోకి చేరాయి. అయినా ఉత్పత్తి కొనసాగించారు. చివరకు ఉద్యోగులు గొడవ చేస్తే మూత వేశారు.


పెద్దాపురంలో ఓ రెండు ప్రముఖ బియ్యం బ్రాండ్ల సంస్థల్లో 50 వరకు పాజిటివ్‌లు వచ్చాయి. ఇవన్నీ కప్పిపుచ్చేసి పనిచేయిస్తున్నారు. కాకినాడ ఏడీబీ రోడ్డులో ఓ రెండు కంపెనీల్లోనే ఇదే తంతు. కాకినాడ సమీపంలో ఓ పంచదార పరిశ్రమలోనూ కేసులొచ్చినా యథావిధిగా కార్యకలాపాలు నడిచిపోతున్నాయి. ఇక పెద్దాపురం, రంగం పేట, జగ్గంపేట మండలాల పరిధిలో కొన్ని కోల్డ్‌ స్టోరేజీలు, బియ్యం గోడౌన్లలో జట్టుకూలీలు, ఇతర ఉద్యోగులకు పాజిటివ్‌లుగా తేలాయి. కాకినాడ రూరల్‌, కరప, యు.కొత్తపల్లి, పెద్దాపురం, ప్రత్తిపాడు, జగ్గం పేట తదితర మండలాల పరిధిలోని ఓ మూడు ప్రముఖ సీఫుడ్‌ కంపె నీల్లో చిరు ఉద్యోగులకు, దినసరి కూలీలకు పాజిటివ్‌లు తేలాయి. ఇలా అనేక కంపెనీల్లో నిత్యం ఇదే తంతు. ఈ కేసులను ఈ సంస్థలు బయ టకు రాకుండా చేసి ఉద్యోగుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు.


ప్రాణాలంటే చులకనా...

ఏదైనా పరిశ్రమలో పాజిటివ్‌ నిర్ధారణ కాగానే మిగిలిన ఉద్యోగులు, కార్మికులను అప్రమత్తం చేసి వారికి పరీక్షలు నిర్వహించేలా జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కొత్త కేసులు రాకుండా యూనిట్‌ను కొన్ని రోజులు తాత్కాలికంగా మూసి వేయాలి. మొత్తం పరిసరాలను శానిటైజ్‌ చేయాలి. కానీ జిల్లాలో ఇదెక్కడా జరగడం లేదు. పాజిటివ్‌ వస్తుంటే సంబంధిత కంపెనీలు విషయాన్ని దాచేసి యథావిథిగా కార్యకలాపాలు నడిపిస్తున్నాయి. దీంతో అందులో ఉద్యోగులు ప్రాణభయంతో విలవిల్లా డుతున్నారు. కనీసం స్థానిక మండల రెవెన్యూ అధికారులకు చెప్పినా స్పందించకపోవడంతో యూనిట్‌ను మూసి కాపాడాలంటూ కలెక్టరేట్‌కు అనేక ఫిర్యాదులు తరచుగా వస్తున్నాయి. ఆయా మండలాల్లో రెవెన్యూ అధికారులు కూడా ఈ పరిశ్రమలపై కన్నెత్తి చూడ్డం లేదు. జిల్లా పరి శ్రమలశాఖ తమకు కేసులతో సంబంధం లేదని చెబుతోంది. కార్మికశాఖ అధికారులేమో రెవెన్యూ అధికారులదే బాధ్యత అని వాదిస్తోంది. దీంతో కేసులున్న పరిశ్రమలు, యూనిట్లకు సంబంధించి పట్టించుకునే నాథుడు లేక, అటు యాజమాన్యాలను ప్రశ్నించలేక పాజిటివ్‌లు వచ్చినచోట బిక్కుబిక్కుమని ఉద్యోగులు, కార్మికులు పనిచేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా కేసుల గురించి అడిగితే ఫ్యాక్టరీలో రాలేదని, ఇంట్లో ఉన్నప్పుడు కొవిడ్‌ సోకినట్టు తమకు తెలియడంతో ఉద్యోగానికి రాకుండా ఆపేశామంటూ కొన్ని యూనిట్లు తెలివిగా సమర్థించుకుంటున్నాయి. అటు కొవిడ్‌ కేసులు ఏదైనా యూనిట్‌, పరిశ్రమలో వస్తే ఉత్పత్తి నిలిపివేసి రెడ్‌జోన్‌గా ప్రక టించాలనే ఆదేశాలు స్పష్టంగా లేవని, దీనివల్ల తాము కూడా ఏం చేయ లేకపోతున్నామని రెవెన్యూ అధికారులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2020-08-15T21:58:48+05:30 IST