ప్రభుత్వ వైఫల్యంతోనే కరోనా ఉధృతి

ABN , First Publish Date - 2022-01-19T04:34:48+05:30 IST

ప్రభుత్వ వైఫల్యమే రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణమని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు విమర్శించారు. ఎన్టీఆర్‌ వర్థంతిని పురస్కరించుకుని కోట జంక్షనలో మంగళవారం ఆయన విగ్రహానికి పూలమాల వేశారు.

ప్రభుత్వ వైఫల్యంతోనే కరోనా ఉధృతి
ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేస్తున్న అశోక్‌

 టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు

ఘనంగా ఎన్టీఆర్‌ వర్ధంతి

విజయనగరం రూరల్‌/ సాలూరు, జనవరి 18: ప్రభుత్వ వైఫల్యమే రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడానికి ప్రధాన కారణమని కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు అశోక్‌గజపతిరాజు విమర్శించారు. ఎన్టీఆర్‌ వర్థంతిని పురస్కరించుకుని కోట జంక్షనలో మంగళవారం ఆయన విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా అశోక్‌ గజపతిరాజు మాట్లాడుతూ, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడంతోనే కరోనా రెండో దశలో ఆంధ్రప్రదేశ భారీ మూల్యం చెల్లించుకుందన్నారు. థర్డ్‌వేవ్‌లో కూడా ప్రభుత్వం అదే దారిలో  వెళుతోందని... ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్ముకుంటే అంతే సంగతులని,  ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని పిలుపునిచ్చారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమం కోసం తపించారని గుర్తు చేశారు. ఆయన ఆశయ సాధన కోసం టీడీపీ శ్రేణులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ సిద్ధాంతాలకు కట్టుబడి నేటికీ టీడీపీ ముందుకు సాగుతోందన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్‌ చైర్మన ప్రసాదుల రామకృష్ణ, టీడీపీ నాయకులు కనకల మురళీమోహన, ఐవీపీ రాజు,  కర్రోతు నర్సింగరావు, ప్రసాదుల ప్రసాద్‌, తెలుగుయువత నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

తెలుగు వారి ఆరాఽధ్య దైవం ఎన్టీఆర్‌

 మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు తెలుగువారి ఆరాధ్య దైవమని తెలుగుదేశం పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యురాలు గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఎన్టీఆర్‌ వర్ధంతి సందర్భంగా మంగళవారం సాలూరు డీలక్స్‌ సెంటర్‌లో ఆయన విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు. చినబజార్‌ సెంటర్‌ వద్ద ఎన్టీఆర్‌ అభిమాని కటారి శంకరరావు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్‌ చిత్రపటానికి కూడా పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీ నడివీధుల్లో తాకట్టు పెడుతున్న సందర్భంలో పార్టీని స్థాపించి తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చిన ఘనత ఎన్టీఆర్‌దేనని అన్నారు. ప్రజలే దేవుళ్లు...సమాజమే దేవాలయం అన్న నినాదంతో పేదవాడికి అత్యంత దగ్గరయ్యారని అన్నారు. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్పీ భంజ్‌దేవ్‌ మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులకు గురి చేయటమే ధ్యేయంగా పెట్టుకుందని విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి పూర్తిగా నెట్టేశారని అన్నారు. కార్యక్రమంలో  పార్టీ నాయకులు నిమ్మాది తిరుపతిరావు, వేణుగోపాల్‌, పప్పల మోహన్‌రావు, కార్యకర్తలు పాల్గొన్నారు. 



Updated Date - 2022-01-19T04:34:48+05:30 IST