వణుకుతూనే బడికి!

ABN , First Publish Date - 2022-01-25T04:44:54+05:30 IST

వణుకుతూనే బడికి!

వణుకుతూనే బడికి!

- పాఠశాలల్లో విజృంభిస్తున్న కరోనా 

- విద్యాశాఖలో ఉన్నతాధికారితో సహా 80 మంది ఉపాధ్యాయులకు పాజిటివ్‌

- విద్యావ్యవస్థకు థర్డ్‌ వేవ్‌ దెబ్బ

- ఆందోళన చెందుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

కరోనా వైరస్‌.. విద్యావ్యవస్థపైనా ప్రభావం చూపుతోంది. పాఠశాలల్లో  పాజిటివ్‌ కేసులు క్రమేపీ పెరుగుతుండడంతో విద్యార్థుల చదువు అగమ్యగోచరంగా మారింది. విద్యాశాఖలో ఉన్నతాధికారితో సహా 80 మంది ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 8 మందికి, ప్రైవేటు పాఠశాలల్లో మరో ఇద్దరు విద్యార్థులకు కూడా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు అధికారుల నివేదికలు చెబుతున్నాయి. వీరితో పాటు చాలామంది విద్యార్థులు జలుబు, దగ్గు, జ్వరంతో బాధ పడుతున్నారు. కరోనా కేసులు పెరుగుతుండడంతో విద్యార్థులను పాఠశాలలకు పంపేందుకు తల్లిదండ్రులు వెనుకంజ వేస్తున్నారు. మరికొందరు పరీక్షలు దగ్గర పడుతున్న నేపథ్యంలో భయాందోళన చెందుతూనే పాఠశాలలకు పంపిస్తున్నారు. సంక్రాంతి సెలవుల అనంతరం ఈ నెల 17 నుంచి పాఠశాలలు తెరచుకున్నాయి. కానీ కరోనా వ్యాప్తి నేపథ్యంలో చాలామంది విద్యార్థులు పాఠశాలలకు హాజరు కావడం లేదు. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో 1 నుంచి పదో తరగతి విద్యార్థులు సుమారు 3.70 లక్షల మంది ఉన్నారు. పది రోజులుగా సుమారు లక్ష నుంచి 1.20 లక్షల మంది విద్యార్థులు మాత్రమే హాజరవుతున్నారు. కొవిడ్‌ కేసుల ఉధృతి ఎక్కువగా ఉన్నందున పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్‌ చేస్తున్నా, ప్రభుత్వం వెనక్కి తగ్గడం లేదు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతులు నిర్వహించాల్సిందేనని జిల్లా విద్యాశాఖ అధికారులకు స్పష్టం చేసింది. 


కానరాని నిబంధనలు

పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నా.. జిల్లాలో అధిక శాతం ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో కరోనా నిబంధనలు కానరావడం లేదు. కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచడం లేదు. విద్యార్థులు మాస్క్‌లు ధరించకపోయినా, భౌతికదూరం పాటించకపోయినా పట్టించుకోవడం లేదు. పాఠశాలల్లో చాలామంది విద్యార్థులు జ్వరం, జలుబు, దగ్గుతో బాధ పడుతున్నారు. వారందరికీ కరోనా పరీక్షలు సక్రమంగా చేయడం లేదు. కొందరు ఉపాధ్యాయులు  కరోనాతో బాధపడుతూనే విధులకు హాజరవుతున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కరోనా వైరస్‌ తగ్గుముఖం పట్టేవరకు తమ పిల్లలను పాఠశాలలకు పంపేది లేదని యాజమాన్యాలకు చెబుతున్నారు. 


ఫీజుల వసూళ్లపై ‘ప్రైవేటు’ దృష్టి

కరోనా కారణంగా ఈ ఏడాది కూడా విద్యావ్యవస్థ గాడి తప్పుతోంది. పరీక్షలకు సమయం దగ్గర పడుతున్నా.. పదో తరగతి విద్యార్థులకు సిలబస్‌ పూర్తికాలేదు. దీంతో విద్యార్థులు పరీక్షలకు ఎలా సన్నద్ధమవ్వాలో తెలియని దుస్థితి నెలకొంది. మరోవైపు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఫీజుల వసూళ్లపై దృష్టి పెట్టాయి. ఫీజులు చెల్లిస్తేనే సెమిస్టర్‌ పరీక్షల్లో కూర్చొబెడతామని విద్యార్థుల తల్లిదండ్రులకు స్పష్టం చేస్తున్నాయి. దీంతో బోధన సక్రమంగా సాగకపోయినా.. ఫీజుల మోత తప్పడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ఎంపీడీవో కార్యాలయ సిబ్బందికి కొవిడ్‌

ఇచ్ఛాపురం రూరల్‌ : స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో పలువురు ఉద్యోగులు కొవిడ్‌ బారినపడ్డారు. దీంతో సోమవారం కార్యాలయం బోసిపోయింది. కార్యాలయంలో మొత్తం ముగ్గురు అధికారులు కరోనా బారిన పడడంతో సోమవారం జరగాల్సిన బడ్జెట్‌ సమావేశాన్ని వాయిదా వేశారు. అలాగే సోమవారం ‘స్పందన’లో వివిధ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు ఎంపీడీవో కార్యాలయానికి కొంతమంది వచ్చారు. కార్యాలయంలో అధికారులు లేకపోవడంతో వారంతా వెనుదిరిగారు. 


జూనియర్‌ కళాశాలలో నలుగురికి 

పొందూరు : పొందూరు  ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో నలుగురి సిబ్బంది కరోనా పాజిటివ్‌ బారినపడ్డారని తాడివలస పీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్‌ సాగరిక తెలిపారు. ప్రిన్సిపాల్‌తో పాటు మరో ముగ్గురు అధ్యాపకులకు పాజిటివ్‌ గా గుర్తించినట్లు చెప్పారు.  

Updated Date - 2022-01-25T04:44:54+05:30 IST