బంగినపల్లికి కరోనా దెబ్బ

ABN , First Publish Date - 2020-06-05T10:59:22+05:30 IST

బంగినపల్లి మామిడి పండ్లకు దేశమంతా గుర్తింపు ఉంది. బనగానపల్లె పరిసరాల్లో వందలాది ఎకరాల్లో మామిడి ..

బంగినపల్లికి కరోనా దెబ్బ

అదనంగా గాలివాన బీభత్సం

భారీగా తగ్గిన ఎగుమతులు 

9 వేల హెక్టార్లలో సాగు 

బీమా కావాలని రైతుల డిమాండ్‌


కర్నూలు, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): బంగినపల్లి మామిడి పండ్లకు దేశమంతా గుర్తింపు ఉంది. బనగానపల్లె పరిసరాల్లో వందలాది ఎకరాల్లో మామిడి సాగవుతుంది. సీజన్‌ రాగానే అనేక ప్రాంతాలకు ఎగుమతి అవుతాయి. అట్లాంటి బంగినపల్లికి ఏడాది వరుస ఎదురుదెబ్బలు తగిలాయి. కరోనా లాక్‌డౌన్‌ వల్ల మార్కెట్లు మూతపడ్డాయి. రవాణా ఆగిపోయింది. దీంతో బంగినపల్లి మామిడి ఎగుమతులు ఆగిపోయాయి. రైతులు స్థానికంగానే అమ్ముకోవాల్సి వచ్చింది. అయితే వైరస్‌ వల్ల రోడ్డు మీదికి వచ్చి కొనేవారు పెద్దగా లేకపోవడంతో రైతులు నష్టపోయారు. దీనికితోడు గాలి వాన తోడైంది. పంట దెబ్బతింది. ఈ ఏడాది కరోనాకు గాలి వాన బీభత్సం తోడై నష్టపోతున్నామని, ప్రభుత్వమే నేరుగా మామిడి కాయలను కొనాలని, బీమా సౌకర్యం కల్పించాలని రైతులు డిమాండ్‌ చేస్తున్నారు. 


దెబ్బ మీద దెబ్బ

ఈసారి మామిడి తక్కువ కాపు వచ్చింది. వాటినైనా అమ్ముకోడానికి లాక్‌డౌన్‌ అడ్డం వచ్చింది. ఏటా వేల టన్నులను హైదరాబాద్‌ గడ్డి అన్నారం, విజయవాడ, ముంబై, నాగపూర్‌, గుజరాత్‌లోని అహ్మదాబాద్‌, న్యూఢిల్లీ, కలకత్తా, చెన్నై తదితర ప్రాంతాలకు ఎగుమతి అయ్యేవి. ఈ ఏడాది ఎగుమతులకు అవకాశం లేదు. సీజన్‌ ప్రారంభమయ్యే రోజులు మొదలు కాగానే లాక్‌డౌన్‌ విధించారు. అనేక సమస్యలతో హెక్టారుకు 8 టన్నుల మామిడి దిగుబడి ఉండాల్సింది ఏ ఏడాది 6 నుంచి 7 టన్నులే వచ్చింది. దీంతో పెట్టుబడులు పోను చేతికి ఏమీ వచ్చేలా లేదని రైతులు దిగాలుపడ్డారు. జిల్లాలో ఒకప్పుడు పదిహేనువేల హెక్టార్లకు పైగా బంగినపల్లి మామిడి సాగయ్యేది. ఇప్పుడది 8,500 హెక్టార్లకు తగ్గిపోయింది.


సుమారు 120 ఏళ్ల క్రితం బనగానపల్లె నవాబులు 1500 ఎకరాల్లో మామిడి సాగు చేశారు. అనంతరం సాగు విస్తీర్ణం పెరిగింది. ఆ తర్వాత క్రమంగా తగ్గిపోయింది. బనగానపల్లెలోనే 3 వేల ఎకరాల్లో సాగయ్యే మామిడి ఏటా తగ్గి ఇప్పుడు 500 ఎకరాలకు తగ్గిపోయింది. ఇటీవల గాలి వాన బీభత్సానికి మామిడి పండ్లు, చెట్లు నేలపాలయ్యాయి. ఓర్వకల్లు, బేతంచెర్ల మండలాల్లో దాదాపు 3 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. ఓర్వకల్లు మండలంలోని పాలకొలను, కొమరోలు, బ్రాహ్మణపల్లె, కాల్వ, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, బేతంచెర్ల మండంలలోని రుద్రవరం, మండ్లవానిపల్లె గ్రామాల్లో మామిడితోటలు అధికంగా ఉన్నాయి. ఈ గ్రామాల్లో గాలి వానకు చెట్లు కూలిపోయాయి. లాక్‌డౌన్‌ విధించడంతో మార్కెట్‌ లేకపోవడంతో కాయలు చెట్ల మీదనే ఉంచారు. అవి ఎండ తీవ్రతకు నేలపాలవుతున్నాయి.


మామిడి పూత బాగా ఉన్న సమయంలో రైతులు రూ.లక్షలు వెచ్చించి కౌలుకు తీసుకున్నారు. చెట్ల మీదేనే పండ్లు ఉండిపోతే కౌలు అప్పులు ఎలా తీర్చాలని రైతులు ఆందోళనపడ్డారు. ఇప్పుడు దీనికి గాలి వాన తోడైంది. కొన్ని చోట్ల కాయలు రాలిపడ్డాయి. ఏకంగా చెట్లు కూలిపోయాయి. మిగిన పండ్లనైనా ప్రభుత్వమే కొనాలని, లేదా ఎగుమతులకు అనుమతి ఇవ్వాలని మామిడి రైతులు కోరుతున్నారు. మామిడి పంటకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలని కొన్నేళ్లుగా కోరుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహిస్తున్నారు. 


మామిడి రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి - డి.అబ్దుల్‌ హమీద్‌, బనగానపల్లె

రూ.45 లక్షలు వెచ్చించి 40 ఎకరాల మామిడితోటలను కౌలుకు తీసుకున్నాను. కరోనా దెబ్బకు అమ్మకాలు లేక తీవ్రంగా నష్టపోయాం. కనీసం కౌలు సొమ్ము కూడా రాలేదు. కూలీల ఖర్చు, మందుల పిచికారీ ఖర్చు భారీగా పెరిగింది. రూ.7లక్షల వరకు నష్టపోయాం. రవాణా సౌకర్యం లేక ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేయలేకపోయాం. దీంతో తీవ్రంగా నష్టపోయాం. ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి.


కరోనా దెబ్బకు తీవ్రంగా నష్టపోయాం - సయ్యద్‌ హుస్సేన్‌, కౌలు రైతు, బనగానపల్లె

కరోనా దెబ్బకు ఈ ఏడాది తీవ్రంగా నష్టపోయాం. దీనికి గాలివాన బీభత్సం తోడైంది. మామిడి కాయలు రాలి రూ.4 లక్షలు నష్టపోయాం. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ రవాణా లేదు. వ్యాపారం లేదు. లాక్‌డౌన్‌ కారణంగా ప్రజలు బైటికి వచ్చి పండ్లు కొనలేదు. అన్ని రకాలుగా నష్టపోయాం. 


మామిడి రైతులకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలి - రామకృష్ణ, రైతు సంఘం జిల్లా నాయకులు

ప్రతి ఏటా అతివృష్ఠి, అనావృష్ఠితో మామిడి రైతులు, కౌలు రైతులు నష్టాలపాలవుతున్నారు. అయితే ప్రభుత్వం మామిడి పంటకు కూడా ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించాలి. మామిడి రైతులు, కౌలు రైతులను ఆదుకోవాలి. 

Updated Date - 2020-06-05T10:59:22+05:30 IST