పట్నం నుంచి పల్లెకు..

ABN , First Publish Date - 2020-06-05T10:26:38+05:30 IST

కరోనా మహమ్మారి పల్లె ప్రజలను సైతం కలవరపెడుతోంది. పట్టణాలకే పరిమితమైన కరోనా పాజిటివ్‌ కేసులు ఇప్పుడు ..

పట్నం నుంచి పల్లెకు..

విస్తరిస్తున్న మహమ్మారి కరోనా

ఇప్పటికే 32 మండలాలకు విస్తరణ

గ్రామానికి కొత్తవారు వస్తే హడల్‌

మే నెలలోనే 163 కేసులు

సెంచరీ చేరువలో సూళ్లూరుపేట


నెల్లూరు  (వైద్యం) జూన్‌ 4 : కరోనా మహమ్మారి పల్లె ప్రజలను సైతం కలవరపెడుతోంది. పట్టణాలకే పరిమితమైన కరోనా పాజిటివ్‌ కేసులు ఇప్పుడు పల్లెల్లోనూ పెరుగుతున్నాయి. వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు నివారణ చర్యలు చేపడుతున్నా  భయాందోళన మాత్రం వీడటం లేదు. గ్రామాలకు కొత్తవారు ఎవరైనా వస్తే వారి ఆరోగ్యస్థితి తెలుసుకోనిదే ఊరిలోకి రానీయడం లేదు. కాగా లాక్‌డౌన్‌ సడలించడం, వలస కూలీలు పల్లెబాట పట్టడంతో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. జిల్లావ్యాప్తంగా 46 మండలాలు ఉండగా ఇందులో 32 మండలాలపై కరోనా వైరస్‌ ప్రభావం ఉంది. మర్రిపాడు మండలం కేతిగుంట గ్రామంలో ఐదుగురికి కరోనా సోకగా వీరిలో నలుగురు వలస కూలీలే. అలాగే చేజర్ల మండలం రెడ్డివారి కండ్రిగ, గొల్లపల్లి, ఆత్మకూరు మండలం వెన్నవాగ, రాపూరు మండలం నాయనపల్లి, కలువాయి మండలం పర్లకొండ, డీవీ సత్రం మండలం కల్లూరు తదితర గ్రామాలు వైరస్‌ ప్రభావానికి గువుతున్నాయి. 


ఇదిలాఉంటే ఏప్రిల్‌ నెలాఖరు వరకు జిల్లాలో కేవలం 88 పాజిటివ్‌ కేసులు ఉండగా, మే నెలలో ఒక్కసారిగా 163  కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ఢిల్లీ మర్కజ్‌, కోయంబేడు మార్కెట్‌కు సంబందించినవేనని అధికారులు భావిస్తున్నారు. కోయంబేడు మార్కెట్‌ ప్రభావం సూళ్లూరుపేటపై తీవ్రంగా ఉంది. ప్రస్తుతం 98 పాజిటివ్‌ కేసులు నమోదై సెంచురీకి చేరువలో ఉంది.


తాజాగా మరో ఏడు కేసులు 

జిల్లాలో గురువారం మరో 5 కేసులు రికార్డుకెక్కాయి. మర్రిపాడు మండలం నెర్ధనంపాడులో ముగ్గురు, నెల్లూరులో 1, వెంకటగిరిలో 1, దగదర్తి మండలం చెన్నూరులో ఒకటి, ఓజిలి మండలం మన్నాలిలో ఒక పాజిటివ్‌ కేసు నమోదయ్యింది. దీంతో జిల్లాలో కేసుల సంఖ్య 286కి చేరుకుంది. అలాగే నారాయణ ఆసుపత్రి నుంచి సూళ్లూరుపేటకు చెందిన కరోనా బాధితుడు డిశ్చార్జ్‌ అయ్యారు.


వెంకటగిరిలో గర్భిణికి..

వెంకటగిరి : పట్టణంలోని కుమ్మరిమిట్ట ప్రాంతానికి చెందిన ఓ గర్భిణికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత నెల 27న చెన్నై నుంచి ఆమె వెంకటగిరిలోని తన పుట్టినింటికి చేరుకుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిని విధిగా క్వారంటైన్‌లో ఉంచాల్సి వున్నా అధికారులు  నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  కుమ్మరిమిట్ట ప్రాంతంలో ఓ గర్భిణికి పాజిటివ్‌ రావడంతో ఆ ప్రాంతంలో ఇప్పటివరకు 100 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. మరో 35 మందికి నిర్వహించాల్సి వుందని స్థానిక వైద్యులు తెలిపారు. శుక్రవారం నుంచి ఇంటింటా పరీక్షలు చేస్తామని తెలిపారు. ఆ ప్రాంతానికి 200 మీటర్ల పరిధిలో కంటైన్మెంటు జోన్‌గా ప్రకటించారు.


ముసునూరులో అనుమానితుడు

కావలి : పట్టణంలోని ముసునూరులో గురువారం ట్రూనాట్‌ పరీక్షలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. దీంతో మున్సిపల్‌ కమిషనర్‌ శివారెడ్డి తమ సిబ్బందితో ఆ ప్రాంతానికి వెళ్లి పారిశుధ్య చర్యలు చేపట్టారు. స్థానికులను అప్రమత్తం చేసి ఎవరూ అనవసరంగా ఇళ్లలో నుంచి బయటకు రావద్దని చెప్పారు. 

 

జిల్లాలో పాజిటివ్‌ కేసులు 

ప్రాంతం మొత్తం      

నెల్లూరు నగరం 83      

నెల్లూరు రూరల్‌ 1           

ఇందుకూరుపేట 2           

కోవూరు 3           

టీపీగూడూరు        2           

బుచ్చిరెడ్డిపాళెం       1            

ముత్తుకూరు        1           

నాయుడుపేట       11           

ఓజిలి        3           

తడ        20           

బాలాయపల్లి          1          

వాకాడు 12          

గూడూరు           4           

బోగోలు  2           

కావలి         2          

అల్లూరు 2          

దగదర్తి  1           

కొండాపురం         1           

సూళ్లూరుపేట         98           

పెళ్లకూరు         2            

మనుబోలు         1            

వింజమూరు         4            

కోట         1 

కొడవలూరు         1           

కలువాయి         2 

ఆత్మకూరు         4          

సంగం         2           

మర్రిపాడు         7 

డీవీ సత్రం         2

రాపూరు         1

ఉదయగిరి         2         

చేజర్ల         2        

ఇతర ప్రాంతాలు 4         


మొత్తం 284        

Updated Date - 2020-06-05T10:26:38+05:30 IST