మళ్లీ కట్టడి

ABN , First Publish Date - 2021-04-23T07:07:08+05:30 IST

మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణపై

మళ్లీ కట్టడి

63 ప్రాంతాలను ప్రకటించిన జీహెచ్‌ఎంసీ

అపార్ట్‌మెంట్లు, ఇళ్ల వద్ద..

పాజిటివ్‌లు హోం ఐసోలేషన్‌లో ఉండేలా నిఘా

ట్రేస్‌, టెస్టింగ్‌లో భాగంగా సన్నిహితులకు పరీక్షలు

గతానికి భిన్నంగా కట్టడి


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వైరస్‌ వ్యాప్తి నియంత్రణపై జీహెచ్‌ఎంసీ దృష్టి సారించింది. పాజిటివ్‌గా నిర్ధారణ అయిన వ్యక్తులు రోడ్లపైకి వస్తున్నారన్న ఫిర్యాదుల దృష్ట్యా వారిపై ప్రత్యేక నిఘా కొనసాగించాలని నిర్ణయించింది. పాజిటివ్‌ వ్యక్తులు హోం ఐసోలేషన్‌లో ఉండేలా చూడడం లక్ష్యంగా కట్టడి జోన్లను గుర్తిస్తున్నారు. మూడు, అంతకంటే ఎక్కువ కేసులు నమోదైన 63 ఇళ్లు/అపార్ట్‌మెంట్లు/ప్రాంతాలను కట్టడి జోన్లుగా గుర్తించి అధికారులు నివారణ చర్యలు చేపడుతున్నారు. ఈ వివరాలను జీహెచ్‌ఎంసీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆయా ప్రాంతాల్లో క్రమం తప్పకుండా శానిటైజేషన్‌, బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లుతున్నారు. తగిన జాగ్రత్తలతో చెత్త సేకరిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారు నిబంధనలు పాటించేలా పర్యవేక్షణకు స్థానిక పోలీసులకు సమాచారమందిస్తున్నారు. వైరస్‌ నిర్ధారణ అయిన వ్యక్తులతో సన్నిహితంగా మెలిగిన వారికి ట్రేసింగ్‌, టెస్టింగ్‌లో భాగంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. వైరస్‌ సోకినట్టు తేలిన వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి ఆస్పత్రులకు పంపుతున్నారు. ఇబ్బంది లేదనుకున్న వారిని హోం ఐసోలేషన్‌లో ఉంచి కరోనా కిట్‌ అందిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి. 


గతానికి భిన్నంగా

కరోనా మొదటి దశ సమయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ విధించాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇటీవల రాత్రి కర్ఫ్యూ విధిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం లాక్‌డౌన్‌ లేని నేపథ్యంలో ఏరియాల వారీగా కట్టడి కుదరదని, కేవలం ఆ అపార్ట్‌మెంట్‌/పరిమిత సంఖ్యలో ఇళ్ల వరకు మాత్రమే కట్టడి చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. గతంలోలా కట్టడి చేస్తే ఉద్యోగాలు, ఇతర పనుల నిమిత్తం వెళ్లాల్సిన వారికి ఇబ్బంది అవుతుందని పేర్కొన్నారు. 


అపార్ట్‌మెంట్లు.. కట్టడి జోన్లు...

ప్రస్తుతం సర్కిల్‌కు రెండు చొప్పున కట్టడి జోన్లు గుర్తించారు. పలు సర్కిళ్లలో మూడు, నాలుగు ప్రాంతాలున్నాయి. మూసాపేట, కేపీహెచ్‌బీ కాలనీ, చందానగర్‌, మాదాపూర్‌, శేరిలింగంపల్లి, గాజుల రామారం, కుత్బుల్లాపుర్‌, ఓల్డ్‌ అల్వాల్‌, మచ్చబొల్లారం, హిమాయత్‌నగర్‌, న్యూనల్లకుంట, గాంధీనగర్‌, మల్కాజిగిరి  తదితర ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లను కట్టడి జోన్లుగా గుర్తించారు. ఇతర ప్రాంతాలు పరిమిత స్థాయిలో ఇళ్లను (ఒకటి నుంచి ఐదు వరకు) కట్టడి జోన్లుగా పరిగణిస్తున్నారు. కాగా... జీహెచ్‌ఎంసీ లెక్కల ప్రకారం 63 కట్టడి ప్రాంతాలు ఉండగా.. రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వివరాల్లో మాత్రం 70 ఉండడం గమనార్హం.  


కట్టడి ప్రాంతాలివే..

కాప్రా సర్కిల్‌లోని ఎల్లారెడ్డిగూడ, జై జవాన్‌ కాలనీ ఉప్పల్‌ సర్కిల్‌ పరిధిలో వెంకట్‌రెడ్డినగర్‌, చిలుకానగర్‌. హయత్‌నగర్‌ పరిధిలో అంబేడ్కర్‌నగర్‌, ఆనంద్‌నగర్‌. ఎల్‌బీనగర్‌ పరిధిలో వనస్థలిపురం రైతు బజార్‌ దగ్గర, నందనవనం. సరూర్‌నగర్‌ పరిఽధిలో చెరుకుతోట కాలనీ, హరిపురా కాలనీ. మలక్‌పేట పరిధిలో శాలివాహననగర్‌ (ముసారాంబాగ్‌), ఆనంద్‌నగర్‌ (అక్బర్‌బాగ్‌), సంతో్‌షనగర్‌ పరిధిలో దానయ్యనగర్‌ (ఉప్పుగూడ), పటేల్‌నగర్‌ (గౌలిపురా). చాంద్రాయణగుట్ట పరిధిలో శివాజీనగర్‌  (ఉప్పుగూడ), గౌస్‌నగర్‌ (బండ్లగూడ). చార్మినార్‌ పరిధిలో మైసమ్మగల్లీ (మొఘల్‌పురా), మేకల మండి గల్లీ (శాలిబండ), ఫలక్‌నుమా పరిధిలో అలీ నగర్‌, జహనుమా, రాజేంద్రనగర్‌ పరిధిలో ఖాజానగర్‌ (అత్తాపూర్‌), సులేమాన్‌నగర్‌. మెహిదీపట్నం పరిధిలో వీర్‌నగర్‌, ప్రేమ్‌నగర్‌ (రెడ్‌హిల్స్‌), విజయనగర్‌ కాలనీ. కార్వాన్‌ పరిధిలో జాఫర్‌గూడ-1, జాఫర్‌గూడ-2. గోషామహల్‌ పరిధిలో అమన్‌నగర్‌ (మంగళ్‌హట్‌), బొగ్గులకుంట (గన్‌ఫౌండ్రి). ఖైరతాబాద్‌ పరిధిలో బాపునగర్‌ (అంబర్‌పేట), యెల్లారెడ్డిగూడ (సోమాజిగూడ). జూబ్లీహిల్స్‌ పరిధిలో ఎన్‌బీటీ నగర్‌, జహీర్‌నగర్‌. యూసు్‌ఫగూడ పరిధిలో వెంకటగిరి, బోరబండ సైట్‌-3, శ్రీరాంనగర్‌ (రహ్మత్‌నగర్‌). శేరిలింగంపల్లి పరిధిలో సిద్దిఖినగర్‌ (కొండాపూర్‌), పాపిరెడ్డి కాలనీ (శేరిలింగంపల్లి). చందానగర్‌ పరిధిలో ఆదిత్యనగర్‌ (మాదాపూర్‌), హఫీజ్‌పేట, ఫ్రెండ్స్‌ కాలనీ (చందానగర్‌). పటాన్‌చెరు పరిధిలో శ్రీనివాసనగర్‌ కాలనీ (ఆర్‌సీ పురం), జేపీ కాలనీ (పటాన్‌చెరు). మూసాపేట పరిధిలో లహరి అపార్ట్‌మెంట్‌, ఆంజనేయనగర్‌, మలేషియన్‌ టౌన్‌షిప్‌. కూకట్‌పల్లి పరిధిలో ముస్లిం బస్తీ (హస్మత్‌పేట), భవ్యాస్‌ తులసి వనం అపార్ట్‌మెంట్‌. కుత్బుల్లాపుర్‌ పరిధిలో టీఎన్‌ఆర్‌ నార్త్‌ సిటీ రెసిడెన్సీ, మోడి బిల్డర్స్‌ అపార్ట్‌మెంట్‌. గాజుల రామారం పరిధిలో రాంకీ మార్వెల్‌ అపార్ట్‌మెంట్‌, ప్రిస్టన్‌ ప్యాలెస్‌ అపార్ట్‌మెంట్‌. అల్వాల్‌ పరిధిలో అక్షయ్‌ ఫార్చూన్‌ అపార్ట్‌మెంట్‌, సిల్వర్‌ స్ర్పింగ్స్‌ అపార్ట్‌మెంట్‌. అంబర్‌పేట పరిధిలో సాయికృప అపార్ట్‌మెంట్‌ (హిమాయత్‌నగర్‌), నమిత గ్రాండ్‌ అపార్ట్‌మెంట్‌ (న్యూ నల్లకుంట). ముషీరాబాద్‌ పరిధిలో ఆర్‌వీ గజందర్‌నంది అపార్ట్‌మెంట్‌ (గాంధీనగర్‌), ఇంటి నెంబర్‌. 1-5-182/డీ/ఏ, రాజా డీలక్స్‌. మల్కాజ్‌గిరి పరిధిలోని బృందావన్‌ అపార్ట్‌మెంట్‌, (సంతోషిమాత కాలనీ), సికింద్రాబాద్‌ పరిధిలోని హరిహర అపార్ట్‌మెంట్‌ (న్యూబోయిగూడ), ఆలుగడ్డబావి (సికింద్రాబాద్‌). బేగంపేట పరిధిలోని ప్రకా్‌షనగర్‌ (బేగంపేట), చుట్టల్‌ బస్తీ.

Updated Date - 2021-04-23T07:07:08+05:30 IST