ఎలా టర్న్‌ అవుతుందో చెప్పలేం

ABN , First Publish Date - 2021-04-17T07:18:29+05:30 IST

కరోనా మారిందా? మనం మారామా? ఏదీ మారలేదా?? వైరస్‌లో మార్పులు నిజమా...

ఎలా టర్న్‌ అవుతుందో చెప్పలేం

సెకండ్‌ వేవ్‌పై చెస్ట్‌ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌

వైరస్‌ తీవ్రత పెరిగింది 

కొత్త లక్షణాలు కనబడుతున్నాయి  

టీకాతో తప్పే ముప్పు

సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ విధించుకోండి


కరోనా మారిందా? మనం మారామా? ఏదీ మారలేదా?? వైరస్‌లో మార్పులు నిజమా... అయితే మనం ఏం చేయాలి... అన్నీ ప్రశ్నలే! రాష్ట్రంలో కరోనా అన్న పదం వినబడి సంవత్సరం గడిచిపోయిన తర్వాత కూడా.. కొంచెం తెలిసి, ఎంతో తెలియకుండా మిగిలిపోయిన సమస్య కొవిడ్‌. కొంచెం అర్థమై ఇంకా ఎంతో అర్థం కాకుండా మిగిలిన సవాల్‌ కొవిడ్‌. ఇన్ని ప్రశ్నలు, సందేహాలు, భయాల నడుమ వైరస్‌ ్ఠ మనిషి యుద్ధం కొనసాగుతోంది. వైరస్‌తో పోరులో ఏడాదిగా ముందు భాగాన నిలిచిన వైద్య రంగ ప్రముఖులు ఈ పరిస్థితిని ఎలా చూస్తున్నారు, వాళ్ల అనుభవాలేంటి, సూచనలేంటి? నేటి నుంచి ప్రత్యేక కథనాలు.. 


‘‘కరోనా సెకండ్‌ వేవ్‌ తీవ్రత పెద్దగా ఉండదని మొదట్లో భావించారు. కానీ, ఇప్పుడు సీరియస్‌ కేసులు పెరుగుతున్నాయి. రెండు వారాలుగా ఆస్పత్రిలో అడ్మిట్‌ అయ్యే వారి సంఖ్య పెరుగుతోంది. వైరస్‌ ఏ రకంగా దాడి చేస్తోందో అంతుపట్టడం లేదు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా ముప్పు తప్పదు. కరోనాని అదుపు చేయగల శక్తి కొంత వరకు మన చేతుల్లో ఉంది. ఎవరికి వారు సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ పెట్టుకోవాలి.’’

- డాక్టర్‌ మహబూబ్‌ఖాన్‌, సూపరింటెండెంట్‌, చెస్ట్‌ ఆస్పత్రి



హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 16 (ఆంధ్రజ్యోతి) : కరోనా ప్రస్తుత పరిస్థితులు, పొంచి ఉన్న ప్రమాదాలపై మహబూబ్‌ఖాన్‌తో ఆంధ్రజ్యోతి ప్రత్యేక ఇంటర్వ్యూలో వెల్లడించిన విశేషాలు..


వందల సంఖ్యలో మ్యుటేషన్‌

ఒకటి, పది కాదు.. వందల సంఖ్యలో కరోనా వైరస్‌ మ్యుటేషన్‌ ఉంటోంది. అందువల్లే కేసులు బాగా పెరుగుతున్నాయి. వైర్‌సలో డబుల్‌ మ్యుటేషన్‌ కూడా జరుగుతోంది. సాధారణంగా వైరస్‌ కొద్ది రోజులకు శక్తిని కోల్పోవాలి. మందులు వినియోగించడం, జనం రోగ నిరోధక శక్తి పెంచుకోవడం ద్వారా వైరస్‌ శక్తి హీనం కావాలి. కానీ, వైరస్‌ మెడికేషన్‌ను కూడా ఎదుర్కొని తిరిగి దాడి చేయడం మొదలవుతోంది. రెండో సారి ప్రజలపై దండెత్తుతోంది. కొన్ని సార్లు వైరస్‌ ఎలా దాడి చేస్తుందో అంతుపట్టడం లేదు. 


మొదట్లో కనిపించ లేదు

సెకండ్‌ వేవ్‌ ప్రారంభంలో తీవ్రత పెద్దగా కనిపించలేదు. చాలా మంది సాధారణ చికిత్సలతో బాగయ్యారు. ఇప్పుడు సీరియస్‌ పరిస్థితుల్లో ఆస్పత్రికి వస్తున్నారు. రెండు వారాలుగా తీవ్రత బాగా కనిపిస్తోంది. గతంలో వైరస్‌ ఒకరికి సోకితే పది నుంచి 20 మంది వరకు విస్తరించేది. ఇప్పుడు ఎంత మందికి సోకుతుందో తెలియని పరిస్థితి.  గతంలో ఊపిరితిత్తుల సమస్య, ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ ఇబ్బందులు వృద్ధుల్లోనే కనిపించేవి. ఇప్పుడు 40 వయస్సు వారిలోనూ కనిపిస్తున్నాయి. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వారికి కూడా వైరస్‌ సోకుతోంది. 


సీజన్‌కి ఓ రకంగా..

వైరస్‌ తీవ్రత బాగా పెరిగింది. సీరియస్‌ కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. ఒక సీజన్‌లో ఒకలా, ఇంకో సీజన్‌లో మరోలా వైరస్‌ తీవ్రత ఉంటోంది. వైరస్‌ ఎలా టర్న్‌ అవుతుందో చెప్పలేకపోతున్నాం. ఒక సీజన్‌లో పెరుగుతోంది. మరో సారి తగ్గుతోంది. 


సామర్థ్యం పెరిగింది..

ఆస్పత్రులలో పడకలు పెరిగాయి. వెంటిలేటర్‌, ఆక్సిజన్‌ సామర్థ్యం స్థాయి పెరిగింది. ఏ పరిస్థితిలో రోగి వచ్చినా ఎదుర్కోవడానికి వైద్యులు సిద్ధంగా ఉంటున్నారు. అప్పుడు 14 రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంచుకునే వాళ్లం. ఇప్పుడు అయిదు నుంచి వారం రోజులలోపే రోగులు కోలుకుంటున్నారు. ఏ మందులు ముందుగా ఇస్తే రోగి త్వరగా కోలుకుంటారో తెలిసింది. స్థానిక క్లినిక్‌లలో కూడా సాధారణ లక్షణాలున్న  వారికి చికిత్సలు అందిస్తున్నారు. 


నిర్లక్ష్యంతోనే ముప్పు 

కరోనా తగ్గిపోయిందని చాలా మంది  నిబంధనలు పాటించడం మరిచిపోయారు. ఫంక్షన్లు చేసుకుంటున్నారు. పబ్బులు,  సినిమా హాళ్లు తెరుచుకున్నాయి. మార్కెట్లు, మాల్స్‌లలో రద్దీ పెరిగింది. సభలు, సమావేశాలు జరుగుతున్నాయి. శానిటైజ్‌, భౌతిక దూరం మరిచిపోయారు. అందువల్లే వైరస్‌ వేగంగా వ్యాపిస్తోంది.  


తీవ్ర లక్షణాలతోనే

జ్వరం, దగ్గు, జలుబు, ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌ వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కొందరిలో విరోచనాలు, శరీరపు నొప్పులు బాగా ఉంటున్నాయి. కొద్ది రోజులుగా ఈ సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయి. సాధారణ, మోస్తరు లక్షణాలున్న వారు త్వరగా రికవరీ అవుతున్నారు. తీవ్రమైన లక్షణాలు ఉంటే రికవరీ కష్టంగా మారుతోంది.


మార్పు వచ్చింది

అప్పటికీ, ఇప్పటికీ సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లలో మార్పులు వచ్చాయి. వైరస్‌పై ప్రజలకు అవగాహన వచ్చింది. సరైన జాగ్రత్తలు తీసుకుంటే చెక్‌ పెట్టవచ్చునని తెలిసింది. 


అనుభవాలతో చికిత్సలు

కొత్తలో ఎవరికి ఎలా చికిత్స చేయాలో తెలిసేది కాదు. ఏ మెడిసిన్‌ ఇస్తే ఎలాంటి ఇబ్బందులు వస్తాయోననే ఆందోళన. ఇలా దాదాపు కొన్ని నెలల పాటు ఇబ్బందులు పడ్డాం. కాలక్రమేణా చికిత్స పద్ధతులను తెలుసుకున్నాం. వివిధ దేశాల్లో ఇచ్చే వైద్య విధానాలపై అవగాహన పెంచుకున్నాం. ఇప్పుడు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. మెరుగైన చికిత్స అందించి త్వరగా నయం చేస్తున్నాం.


స్వీయ నియంత్రణే శరణ్యం

గతంలో మాదిరిగానే వైర్‌సను సీరియస్‌గా తీసుకోవాలి. ఎవరికి వారే నియమాలు పెట్టుకోవాలి. ప్రభుత్వం, వైద్యులు సూచించే నిబంధనలను పాటించాలి. ప్రభుత్వమే లాక్‌డౌన్‌ విధించాలని ఆలోచించవద్దు. ఎవరికి వారే సెల్ఫ్‌ లాక్‌డౌన్‌ విధించుకోవాలి. అనవసరంగా బయటకు రావద్దు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించడం, శానిటైజ్‌, సబ్బుతో చేతులు శుభ్రం చేసుకోవడం పాటిస్తే కరోనా వైర్‌సకు చెక్‌ పెట్టొచ్చు. 

Updated Date - 2021-04-17T07:18:29+05:30 IST