పాజిటివ్‌, నెగెటివ్ ప‌క్క ప‌క్క‌నే...

ABN , First Publish Date - 2021-04-10T07:00:04+05:30 IST

కరోనా పరీక్షా కేంద్రాల

పాజిటివ్‌, నెగెటివ్ ప‌క్క ప‌క్క‌నే...
స‌రూర్ న‌గ‌ర్ పరీక్ష కేంద్రాల వద్ద భౌతిక దూరం నిబంధనలు పాటించకుండా గుంపులుగా చేరిన ప్రజలు

పరీక్షా కేంద్రాల వద్ద భయానక పరిస్థితి

కాన రాని భౌతిక దూరం

వ్యాక్సిన్‌కు వెళ్లాలన్నా జంకుతున్న ప్రజలు


హైదరాబాద్‌ సిటీ/బంజారాహిల్స్‌/ఉప్పల్‌/ఎల్‌బీనగర్‌/రంగారెడ్డి ఏప్రిల్‌ 9 (ఆంధ్రజ్యోతి) : కరోనా పరీక్షా కేంద్రాల వద్ద మునుపెన్నడూ లేనంత జనం తాకిడి పెరిగింది. అక్కడ కనీస జాగ్రత్తలు తీసుకోకపోవడం భయాందోళన కలిగిస్తోంది. ప్రతీ కేంద్రానికి నిత్యం సుమారు వంద మందికి పైగా యాంటీజెన్‌ పరీక్ష చేయించుకునేందుకు వస్తున్నారు. వారిలో పాజిటివ్‌ వచ్చిన బంధువులు, స్నేహితులు కూడా ఉంటున్నారు. పరీక్ష ఫలితాలు చెప్పడానికి కనీసం అరగంట సమయం పడుతోంది. దీంతో అందరూ అక్కడే టచ్చాడుతున్నారు. వారిలో పాజిటివ్‌ వచ్చిన వాళ్లూ ఉంటున్నారు. సందేహాల నిమిత్తం వైద్య సిబ్బందితో మాట్లాడడానికి ప్రయత్నించడం, అందరితో పాటే కలిసి ఉండడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సిబ్బంది కూడా ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా అర్బన్‌ హెల్త్‌ కేంద్రాల వద్ద ఈ పరిస్థితి అధికంగా ఉంది. భౌతిక దూరం పాటించకపోవడం పెద్ద సమస్యగా మారింది. లైన్లలో నిలబడ్డ వారు తాను ముందు వచ్చానంటే తానంటూ తోపులాటకు దిగుతున్న ఘటనలూ జరుగుతున్నాయి. 


నిజంగా పరీక్షే

కరోనా లక్షణాలతో పరీక్షలు చేయించుకునేందుకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వద్దకు వస్తున్న వృద్ధులు ఎక్కువ సేపు లైన్‌లో నిల్చోలేక ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ మంది వస్తుండడంతో కొంత మందికే పరీక్షలు నిర్వహించి మిగతా వారిని మరుసటిరోజు రమ్మని పంపుతున్నారు. కొంత మంది సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పరీక్షలకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఉప్పల్‌, మల్కాజిగిరి, సరూర్‌నగర్‌, మన్సూరాబాద్‌, కూకట్‌పల్లి, లింగంపల్లి, వనస్థలిపురం, బాలాపూర్‌, సనత్‌నగర్‌లలో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాల వద్ద ప్రజలు బారులు తీరుతున్నారు. అనుమానితుల తాకిడి అధికంగా ఉంటోంది. 


వ్యాక్సిన్‌కు వచ్చే వారు జంకుతున్నారు

ఆరోగ్య కేంద్రాల్లో కరోనా పరీక్షలు ఓ వైపు, వ్యాక్సిన్‌ మరో వైపు నిర్వహిస్తున్నారు. కొన్ని చోట్ల పాజిటివ్‌ వచ్చిన వారు వ్యాక్సిన్‌ వేసే వైపు వచ్చి హడావిడి చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం బంజారాహిల్స్‌ ఆరోగ్య కేంద్రంలో ఓ వ్యక్తి తన భార్యకు పాజిటివ్‌ వచ్చిందని ఆందోళనతో హడావిడి చేశాడు. ఆయన చేష్టలకు వ్యాక్సిన్‌ కోసం వచ్చిన వృద్ధులు హడలిపోయారు. భౌతికదూరం ఊసేలేకపోవడం పెద్ద ప్రమాదంగా మారుతోంది. 


పెరుగుతున్న కేసులు:

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఇన్‌పేషెంట్లుగా సుమారు 2500 మంది వరకు చికిత్స పొందుతున్నారు. పాజిటివ్‌ బారిన పడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతూ పోతోంది. 


ప్రైవేటులోనూ బారులు

ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నిస్టిక్‌ సెంటర్ల వద్ద కూడా ఆర్‌టీపీసీఆర్‌ పరీక్షలు చేయించుకోవడానికి జనాలు బారులు తీరుతున్నారు. ఒక్కో డయాగ్నస్టిక్‌ సెంటర్‌లో రోజూ 300కు తగ్గకుండా పరీక్షలు జరుగుతున్నాయి. పేరు మోసిన సెంటర్‌లో 500 నుంచి 600ల మందికి పరీక్షలు చేస్తున్నారు. పరిసర ప్రాంతాల్లోని నివాసితులు ఇళ్లలో నుంచి బయటకు రావడానికి భయపడుతున్నారు. 


ఇలాంటి జాగ్రత్త తీసుకుంటే మేలు

- ఆరోగ్య కేంద్రాల వద్ద పరీక్షల కోసం వచ్చే వారికి టోకెన్‌ విధానం పెట్టడం మంచిది.  

- పాజిటివ్‌ వచ్చిన వారికి మందులు అందించేందుకు మరో కౌంటర్‌ ఏర్పాటు. 

- వ్యాక్సిన్‌ కేంద్రంలోకి సహాయకులు మినహా మిగతా వారు రాకుండా కట్టడి చేయాలి.

Updated Date - 2021-04-10T07:00:04+05:30 IST