అంతం కాదు... ఆరంభం మాత్రమే!

ABN , First Publish Date - 2022-07-26T16:30:33+05:30 IST

మెనోపాజ్‌ అనగానే మహిళలు... ఇక అంతటితో జీవితం చరమాంకానికి వచ్చేసిన భావనకు లోనవుతూ

అంతం కాదు... ఆరంభం మాత్రమే!

మెనోపాజ్‌

మెనోపాజ్‌ అనగానే మహిళలు... ఇక అంతటితో జీవితం చరమాంకానికి వచ్చేసిన భావనకు లోనవుతూ ఉంటారు. మెనోపాజ్‌తో ప్రపంచం అంతమైపోదు, జీవితం ముగిసిపోదు. నిజానికి నచ్చినట్టు జీవించడానికి సరిపడా అర్థ జీవితం అప్పుడే మొదలవుతుంది. కాబట్టి మెనోపాజ్‌ ఇబ్బందులకు చికిత్సలతో అడ్డుకట్ట వేస్తూ, హాయిగా జీవితాన్ని కొనసాగించాలని అంటున్నారు వైద్యులు. 


పుట్టుకతోనే మహిళలు కొన్ని లక్షల అండాలను అండాశయాల్లో వెంట తెచ్చుకుంటారు. వయసుతో పాటు అవన్నీ తరిగిపోతూ, అంతిమంగా అడుగంటిపోతాయి. అప్పటి నుంచి మెనోపాజ్‌ లక్షణాలు బయల్పడడం మొదలుపెడతాయి. కొందరికి ఈ పరిస్థితి 40 ఏళ్ల లోపే తలెత్తవచ్చు. దీన్ని ఎర్లీ మెనోపాజ్‌ అంటారు. ఈ పరిస్థితి వంశపారంపర్యంగా తల్లి నుంచి సంక్రమించవచ్చు. అండాశయాల్లో సమస్యల వల్ల అండాశయాలను తొలగించడం మూలంగా తలెత్తవచ్చు. ఈ పరిస్థితి 40 ఏళ్ల లోపే తలెత్తితే దాన్ని ఎర్లీ మెనోపాజ్‌గానే పరిగణించాలి. కొందరికి క్యాన్సర్‌ చికిత్సలో భాగంగా అందించే రేడియేషన్‌ వల్ల కూడా ఎర్లీ మెనోపాజ్‌ తలెత్తుతుంది. అలాగే కొందరికి హిస్ట్రక్టమీ సర్జరీతో గర్భాశయాన్ని తొలగిస్తూ ఉంటారు. గర్భాశయాన్ని తొలగించినంత మాత్రాన త్వరగా మెనోపాజ్‌కు చేరుకునే పరిస్థితి ఉండదు. దాంతో పాటు అండాశయాలను తొలగించినప్పుడే మెనోపాజ్‌కు చేరుకునే అవకాశం ఉంటుంది. సాధారణంగా మహిళలు 45 నుంచి 52 ఏళ్ల మధ్య సహజసిద్ధమైన మెనోపాజ్‌ దశకు చేరుకుంటూ ఉంటారు. అయితే ఏ వయసులో ఏ కారణంగా, మెనోపాజ్‌కు చేరుకున్నప్పటికీ, అండాశయాల్లో ఈస్ట్రోజన్‌ ఉత్పత్తి నిలిచిపోవడం మూలంగా మహిళల్లో... వేడి ఆవిర్లు, మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు, మానసిక కుంగుబాటు, మూత్ర సమస్యలూ మొదలవుతాయి. ఈ లక్షణాల ఆధారంగా, వాటిని అదుపు చేసే చికిత్సను ఎంచుకోవలసి ఉంటుంది. 


మెనోపాజ్‌ను వాయిదా వేయవచ్చు

మెనోపాజ్‌ను వాయిదా వేయాలనుకునే కారణం ఆధారంగా చికిత్సను ఎంచుకునే వీలుంది. కొంత మంది మహిళలు, కెరీర్‌లో ఎదిగే క్రమంలో గర్భధారణను వాయిదా వేస్తూ, మెనోపాజ్‌ దశకు చేరుకుంటారు. అలా మెనోపాజ్‌ దశకు చేరుకునే వయసులో గర్భం దాల్చాలని అనుకుంటున్న వాళ్లకు హార్మోన్లను అందిస్తూ, అండాశయాల్లోని అండాల సంఖ్యను పెంచి, మెనోపాజ్‌ను ముందుకు నెట్టే వీలుంది. అలాగే తల్లులై ఉండీ, ఎర్లీ మెనోపాజ్‌ కారణంగా గుండె, ఎముకలు దెబ్బ తినకుండా ఉండాలని కోరుకునే మహిళలు కూడా సహజసిద్ధ మెనోపాజ్‌ దశకు (45 ఏళ్లు) చేరుకునే వరకూ హార్మోన్లను తీసుకుంటూ ఉండవచ్చు. అయితే హార్మోన్లకు దుష్ప్రభావాలు ఉంటాయి. అరుదుగా కేన్సర్‌ ముప్పు కూడా పొంచి ఉంటుంది. కాబట్టి వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి. 45 ఏళ్ల వయసు వరకూ చికిత్సకు ముందు, ఏడాదికోసారి తప్పనిసరిగా కొన్ని పరీక్షలు చేయవలసి ఉంటుంది. 


దుష్ప్రభావాలను తగ్గించే చికిత్సలు

ప్రారంభంలో హెచ్‌ఆర్‌టి చికిత్స (హార్మోన్‌ రీప్లే్‌సమెంట్‌ థెరపీ) విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. అయితే ఈ చికిత్సతో ఒరిగే దుష్ప్రభావాల గురించిన అవగాహన పెరగడంతో, ఆ చికిత్స ప్రభావం శరీరం మొత్తం మీద పడకుండా ఉండే ప్రత్యామ్నాయ చికిత్సలు అందుబాటులోకొచ్చాయి. లక్షణాల ఆధారంగా తగిన చికిత్సను ఎంచుకునే వెసులుబాటు ఉంది. 


వెజైనల్‌ డ్రైనెస్‌: మెనోపాజ్‌లో యోని పొడిబారడం అనేది సర్వసాధారణమైన సమస్య. కొందరు మహిళల్లో మిగతా మెనోపాజ్‌ లక్షణాలేవీ లేకుండా, ఈ ఒక్క లక్షణమే కనిపిస్తే, అలాంటి మహిళల కోసం అంతర్గతంగా అప్లై చేసుకునే వెజైనల్‌ క్రీమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. వీటితో హార్మోన్‌ ప్రభావం శరీరం మొత్తం మీద కాకుండా, ఆ ప్రదేశం మేరకే పరిమితమవుతుంది. అయితే ఈ క్రీమ్‌ను వరుసగా మూడు నెలల పాటు వాడుకుని, లక్షణాలు తగ్గిన తర్వాత వాడకం ఆపేసి, తిరిగి అవసరాన్ని బట్టి వైద్యుల సూచన మేరకు కొనసాగించాల్సి ఉంటుంది. 


మూత్రనాళ ఇన్‌ఫెక్షన్లు: మెనోపాజ్‌కు చేరుకున్న కొందరు మహిళలను పదే పదే యూరినరీ ఇన్‌ఫెక్షన్‌ వేధిస్తూ ఉంటుంది. ఇలాంటి వాళ్లు కూడా వెజైనల్‌ హార్మోనల్‌ క్రీమ్స్‌ వాడుకోవచ్చు. యోని, మూత్రనాళ కణజాలాలు ఒకే రకమైనవి కాబట్టి, ఈ క్రీమ్‌ రెండు సమస్యలకూ తోడ్పడుతుంది.


వేడి ఆవిర్లు: జీవనశైలి మార్పులను అలవరుచుకున్నప్పటికీ ఈ సమస్యతో దైనందిన జీవితం ఇబ్బందికరంగా మారినప్పుడు మాత్రమే వైద్యులు చికిత్సను సూచిస్తారు. 45 నుంచి 52 ఏళ్ల మధ్య సహజసిద్ధ మెనోపాజ్‌కు చేరుకున్న మహిళలు లేదా ఎర్లీ మెనోపాజ్‌కు చేరుకున్న మహిళలు నోటి మాత్రల రూపంలోని తాత్కాలిక చికిత్సనే (మాగ్జిమమ్‌ ఐదేళ్లు) ఎంచుకోవలసి ఉంటుంది. మాత్రలతో శరీరం మొత్తం మీద ప్రభావం పడుతుంది కాబట్టి, ఈ చికిత్సను విడతల వారీగా, లక్షణాల తత్వాన్ని బట్టి ఆపుతూ, కొనసాగిస్తూ ఉండవలసి ఉంటుంది.


స్కిన్‌ ప్యాచెస్‌: మాత్రలు వద్దనుకునేవాళ్లకు, స్కిన్‌ ప్యాచెస్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి వాడకం పట్ల కూడా అప్రమత్తత అవసరమే!


మూత్రం లీక్‌ అవుతుంటే...

ఈ సమస్య రెండు రకాలుగా ఉంటుంది. కొందరు మహిళలు మూత్ర విసర్జన చేయాలని అనిపించిన వెంటనే, బాత్రూమ్‌కు వెళ్లేలోపే మూత్రవిసర్జన జరిగిపోతూ ఉంటుంది. ఇంకొందరికి దగ్గినా, తుమ్మినా మూత్రం లీక్‌ అవుతూ ఉంటుంది. ఈ రెండు సమస్యలకూ రెండు వేర్వేరు చికిత్సలున్నాయి. మొదటి కోవకు చెందిన మహిళల సమస్యను నోటి మాత్రలతో నయం చేయవచ్చు. రెండో కోవకు చెందిన మహిళలకు చిన్నపాటి సర్జరీ అవసరం పడుతుంది.


కోరికలు తగ్గితే...

మెనోపాజ్‌లో లైంగిక కోరికలు, అంతర్గత లూబ్రికేషన్‌, తేమ కూడా తగ్గిపోతాయి. వీటికి మానసిక ఒత్తిడి, నిద్ర లేమి లాంటివి కూడా తోడైతే లైంగికాసక్తి అనేదే లేకుండా పోతుంది. ఇలాంటప్పుడు ఓ పక్క లైంగిక కోరికలను పెంచుతూనే, మరోపక్క అంతర్గత తేమను పెంచే రెండు రకాల మందులు మహిళలకు అవసరమవుతాయి. ఇందుకోసం ఈస్ట్రోజన్‌ కలిగిన లోకల్‌ జెల్‌, లూబ్రికెంట్‌ జెల్స్‌, సప్లిమెంట్లు, క్రీమ్‌లు వాడుకోవచ్చు. అలాగే ఈస్ట్రోజన్‌తో పాటు కొంత టెస్టోస్టెరాన్‌ సప్లిమెంట్లు కూడా వాడుకుంటే, లైంగిక కోరికలు తిరిగి పెరుగుతాయి. ఇలా హార్మోన్లను భర్తీ చేస్తూ, లూబ్రికేషన్‌ను పెంచే కెవై జెల్లీలు వాడితే పూర్వంలా లైంగిక జీవితాన్ని ఆస్వాదించే వీలుంటుంది. 


వైద్యుల పర్యవేక్షణ తప్పనిసరి

మెనోపాజ్‌లో వాడే మందులు హార్మోన్‌ సప్లిమెంట్లు కాబట్టి, ఇతరత్రా తీవ్రమైన దుష్ప్రభావాలు ఇబ్బంది పెట్టకుండా ఉండడం కోసం వైద్యులు చెప్పినంత కాలం, వైద్యులు సూచించిన మోతాదులోనే మందులు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా నోటి మాత్రలు, స్కిన్‌ ప్యాచ్‌లు వాడుకునేవాళు, కుటుంబ చరిత్రలో కేన్సర్‌ ఉన్నవాళ్లు, చికిత్స కొనసాగినంత కాలం పాప్‌స్మియర్‌, మామోగ్రామ్‌ లాంటి పరీక్షలు కూడా చేయించుకుంటూ ఉండాలి. 






జీవితం ఆగిపోకూడదు

మహిళలు మెనోపాజ్‌కు చేరుకుంటే జీవితం ముగిసిపోయిందనే నిర్థారణకు వచ్చేస్తూ ఉంటారు. మెనోపాజ్‌తో ఆగిపోయేది నెలసరి మాత్రమే! జీవితం కాదు. కాబట్టి మెనోపాజ్‌ తర్వాతి అర్థ జీవితాన్ని ఇష్టమైన పనులకు వెచ్చించాలి. నచ్చిన హాబీని సాధన చేయాలి. స్నేహితులతో సమయాన్ని గడపాలి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉన్నవాళ్లు, ఆ దిశగా ప్రయాణం చేయాలి. నిజానికి ఇలా ఇష్టమైన పనులను చేయడం ద్వారా మానసిక కుంగుబాటు, మెనోపాజ్‌ లక్షణాలు తగ్గుముఖం పడతాయి. కాబట్టి ఆలోచనా విధానాన్ని మార్చుకుని, సమతులాహారం తీసుకుంటూ, శరీరాన్ని చురుగ్గా ఉంచుకుంటూ అవసరాన్ని బట్టి మెనోపాజ్‌ చికిత్స కొనసాగిస్తూ, జీవితంలో ముందుకు సాగాలి. 


సోయా తినాలి

కొరియా, జపాన్‌, చైనా దేశాల మహిళల్లో వయసు పైబడే లక్షణాలు ఆలస్యంగా మొదలవుతూ ఉంటాయి. ఆయా దేశాల మెనోపాజ్‌ మహిళల్లో వేడి ఆవిర్ల సమస్య అనేదే ఉండదు. ఇందుకు కారణం ఆయా దేశాల ప్రజలు, ఆహారంలో సోయాను ఎక్కువగా వాడుతూ ఉండడమే! సోయా సహజసిద్ధమైన ప్లాంట్‌ ఈస్ట్రోజన్‌. కాబట్టి ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ భర్తీ చేసుకోవడం కోసం సోయా, టోఫులను తరచూ తీసుకుంటూ ఉండాలి.




-డాక్టర్‌ అమరీందర్‌ కౌర్‌

సీనియర్‌ కన్సల్టెంట్‌ అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ,

ఫోర్టిస్‌ మెమోరియల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, గుర్‌గాం.




Updated Date - 2022-07-26T16:30:33+05:30 IST