అనంత మహాసమాఖ్య విభజనలో వివాదం

ABN , First Publish Date - 2022-08-20T05:20:11+05:30 IST

అనంత మహా సమాఖ్యపై అధికారపార్టీ నేతలు కన్నేశారు. పేద మహిళ లు పొదుపు చేసుకున్న సొమ్ముపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది.

అనంత మహాసమాఖ్య విభజనలో వివాదం
మహాసమాఖ్య కార్యాలయం

అధిక మండలాలు శ్రీసత్యసాయి జిల్లాకు..

రెండు మండలాలు మాత్రమే అనంతకు..

నిధుల గోల్‌మాల్‌పై మతలబు

రూ.మూడు కోట్లకు లెక్కల్లేవ్‌

స్థలం కాజేసేందుకు అధికార పార్టీవారి ఎత్తుగడ


అనంతపురం క్లాక్‌టవర్‌, ఆగస్టు 19 :  అనంత మహా సమాఖ్యపై అధికారపార్టీ నేతలు కన్నేశారు. పేద మహిళ లు పొదుపు చేసుకున్న సొమ్ముపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది. దీంతో కోట్లాది రూపాయల విలువ చేసే మహాసమాఖ్య కార్యాలయ స్థలం, నిధులను కాజేసేందుకు పావులు కదుపుతున్నారు. జిల్లా విభజన నేపథ్యంలో మహాసమాఖ్యను కూడా విభజించాలనే ప్రస్తావన రావడం తో కరిగిపోయిన నిధుల అంశం తెరపైకి వస్తోంది. దీంతో పాటు ఇద్దరు ప్రజాప్రతినిధులు మహాసమాఖ్య  స్థలాన్ని కాజేయాలని కుయుక్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. 


మహాసమాఖ్య అంటే...

ఉమ్మడి జిల్లాలో ఎంపిక చేసిన మండలాల్లో మహిళలు అనంత మహాసమాఖ్యలో సభ్యులుగా ఉంటారు. ఉమ్మడి జిల్లాలో గుడిబండ, మడకశిర, హిందూపురం, బత్తలపల్లి, గాండ్లపెంట, బుక్కరాయసముద్రం, పెద్దవడుగూరు మండ లాల నుంచి అనంత మహాసమాఖ్యలో సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలో స్వయం సహాయక సంఘా ల ద్వారా అమలు చేస్తున్న పథకాల గురించి ఇతర రాష్ట్రాల్లో అవగాహన కల్పించి, అమలు చేసేందుకు మహాసమాఖ్య ద్వారా చర్యలు చేపడుతున్నారు. గత ప్రభుత్వం అనంత మహా సమాఖ్య అభివృద్ధికి  సుమారు రూ.4కోట్ల వరకు నిధులు మంజూరు చేసింది. అయితే గత మూడున్నరేళ్లుగా ప్రస్తుత ప్రభుత్వం మహాసమాఖ్యను నిర్వీర్యం చేయడంతో పాటు సుమారు రూ.3కోట్ల వరకు నిధులు వినియోగించేశారు. అయితే మహిళల అభివృద్ధికి కాకుండా ఇతర కార్యక్రమాల కోసం ఈ నిధులను మళ్లించారు. దీనిపై ప్రశ్నించేందుకు ఎవరూ సాహసించడం లేదు. 


మహాసమాఖ్య స్థలంపై కన్ను

నగరంలోని శారదానగర్‌ ప్రధాన రహదారిలో సుమారు అర ఎకరా స్థలంలో అనంత మహాసమాఖ్య కార్యాలయం ఉంది. ప్రస్తుత మార్కెట్‌ ధర ప్రకారం రూ.10 కోట్ల వరకు దీని విలువ ఉంటుంది. దీంతో ఈ భూమిపై కన్నేశారు. ఇద్దరు ప్రజా ప్రతినిధులు స్థలం కాజేసి ఆక్రమించుకోవా లని విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. జిల్లాల విభజన నేపథ్యంలో మహాసమాఖ్యను శ్రీసత్యసాయి జిల్లా, అనంతపురం జిల్లాలకు వేర్వేరుగా కమిటీలను నియ మించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడే అసలు సమస్య తలెత్తుతోంది. విలువైన ఆస్తులు అనంతపురం జిల్లా పరిధిలో ఉండగా, అధిక మండలాలు శ్రీసత్యసాయి జిల్లాలో ఉన్నాయి. దీంతో స్థలం అమ్మేయాలని ఇద్దరు ప్రజాప్రతినిధులు డీఆర్‌డీఏ అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇక్కడ మహిళా మార్ట్‌ ఏర్పాటు చేయాలని డీఆర్‌డీఏ అధికారులు ఏర్పాట్లు చేయసాగారు. మహాసమాఖ్య ముందు భాగంలో షాపింగ్‌మాల్‌ నిర్మించి మహిళా మార్ట్‌ను ప్రారంభించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ప్రజాప్రతినిధులు ఉన్నతస్థాయి అధికారులను రంగప్రవేశం చేయించి స్థలాన్ని కాజేయాలని యత్నిస్తున్నట్లు సమాచారం. అయితే కీలకంగా ఉన్న మహాసమాఖ్య చైర్‌పర్సన, జిల్లా కలెక్టర్‌ దీనిపై ఏ విధంగా స్పందిస్తారో వేచిచూడాలి. 


కరిగిపోతున్న నిధులు

అనంత మహాసమాఖ్యకు గత ప్రభుత్వం రూ.4కోట్ల వరకు నిధులు కేటాయించారు. గత మూడున్నరేళ్లుగా ప్రస్తుత ప్రభుత్వం ఒక్క పైసా నిఽధులు మంజూరు చేయకపోగా ఉన్న నిధులను ఇతర కార్యక్రమాలకు దారి మళ్లించి మహాసమాఖ్యను నిర్వీర్యం చేశారు. ఇప్పటి వరకు రూ.3కోట్ల వరకు నిధులు వినియోగించేశారు. మిగిలిన రూ.కోటితో మహిళా మార్ట్‌ నిర్మించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఉన్న నిధులను ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర సెర్ప్‌ ఉన్నతాధికారులు మహాసమాఖ్యకు లేఖ పంపారు. అయితే ఇందుకు డీఆర్‌డీఏ, మహాసమాఖ్య అధికారులు అంగీకరించకపోవ డంతో సెర్ప్‌ అధికారులు వెనకడుగువేశారు. అయితే కరిగిపోయిన రూ.3 కోట్ల నిధులకు లెక్కలు లేకపోవడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


ఉన్నతాఽధికారుల ఉత్తర్వుల మేరకు విభజన

రాష్ట్ర ఉన్నతాధికారుల ఉత్తర్వుల మేరకే అనంత మహాసమాఖ్య విభజన ఉంటుంది. శ్రీసత్య సాయి జిల్లాలో గుడిబండ, మడకశిర, హిందూపురం, బత్తలపల్లి, గాండ్లపెంట మండలాలు ఉన్నాయి. బుక్కరాయసముద్రం, పెద్దవడుగూరు మండలాలు అనంతపురం జిల్లా పరిధిలోకి వస్తాయి. పైగా మహాసమాఖ్యకు విలువైన ఆస్తులు అనంతలో, అధిక మండలాలు శ్రీసత్యసాయి జిల్లాలో ఉండడంతోనే విభజనకు కొద్దిగా సమస్య వస్తోంది. మహాసమాఖ్యలో ప్రతి పైసాకు లెక్క ఉంటుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అనంత మహాసమాఖ్య మెజార్టీ సభ్యుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటాం. 

Updated Date - 2022-08-20T05:20:11+05:30 IST