గూడు.. గోడు!

ABN , First Publish Date - 2020-07-02T10:26:25+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్లస్థలాల పట్టాల పంపిణీ అనేకచోట్ల తగాదాలకు దారితీస్తోంది. ఎమ్మిగనూరు, మంత్రాలయం

గూడు.. గోడు!

ఇంటి స్థలాల సేకరణలో వివాదం

గతంలో పంచిన భూముల సేకరణ

కోర్టును ఆశ్రయించిన బాధితులు

అయినా లెక్కచేయని అధికారులు


ఎమ్మిగనూరు, జూలై 1: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఇళ్లస్థలాల పట్టాల పంపిణీ అనేకచోట్ల తగాదాలకు దారితీస్తోంది. ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో అధికారులు ఇంటి స్థలాలను సిద్ధం చేస్తున్నారు. వీటిలో ఎక్కువ శాతం గత ప్రభుత్వాలు పంపిణీ చేసినవే. దీంతో అప్పట్లో పట్టాలు పొందిన వారు ఈ పనులకు అడ్డుపడుతున్నారు. తమకే ఆ స్థలాలను కేటాయించాలని కోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఎమ్మిగనూరు, మంత్రాలయం, నందవరం, గోనేగండ్ల, కౌతాళం, కోసిగి, ఎమ్మిగనూరు మండలాల్లో ఇంటి స్థలాల పంపిణీలో వివాదాలు చోటుచేసుకుంటున్నాయి. అధికారులు తలలు పట్టుకుంటున్నారు. పోలీసులు బలవంతంగా గుడిసెలను తొలగిస్తున్నారు.


కోర్టును ఆశ్రయించినా..

ఎమ్మిగనూరు పట్టణంలో సర్వే నెంబరు 64, 65లో గతంలో టీడీపీ ప్రభుత్వం 900 మందికి ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. అయితే మౌలిక వసతులు కల్పించకపోవటంతో ఎవరూ నివాసాలు ఏర్పాటు చేసుకోలేదు. ప్రస్తుతం ఆ స్థలాలను స్వాధీనం చేసుకుని ప్లాట్లు వేస్తున్నారు. దీంతో బాధితులు కోర్టును ఆశ్రయించారు. ఆధికారులు ఇవేమీ లెక్కచేయకుండా పోలీసు ఫోర్స్‌తో గడిసెలను కూల్చివేశారు. ఈ ఘటన తరువాత అధికారులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. 


చర్చి వినియోగిస్తున్న స్థలం

ఎమ్మిగనూరు మండలం పార్లపల్లిలో ప్రభుత్వ స్థలంలో పెద్ద నీటి గుంత ఉండేది. దీని పక్కనే ఓ వ్యక్తి స్థలం ఉంది. అధికారులు, ఆ వ్యక్తి అనుమతి తీసుకుని కొన్నేళ్ల క్రితం ఓ ప్రార్థనా సంస్థ నిర్వాహకులు ఆ గుంతను పూడ్చివేశారు. దాదాపు రూ.10 లక్షలు ఖర్చుచేశారు. ప్రస్తుతం ఈ స్థలాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసు బలగాలను ఉపయోగించి పట్టాల పంపిణీకి సిద్ధం చేశారు. మజరా గ్రామమైన గువ్వలదొడ్డిలో 2006లో అప్పటి ప్రభుత్వం ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. కొంతమంది నివాసాలు ఏర్పాటు చేసుకోలేదు. ఈ ఖాళీ స్థలాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని పంపిణీకి సిద్ధం చేసింది. గతంలో పట్టాలు పొందిన లబ్ధిదారులకు అధికారులు నోటీసులు జారీ చేశారు. పట్టాదారులు జేసీని ఆశ్రయించారు. గుడికల్లులో కొంతమందికి టీడీపీ ప్రభుత్వం వ్యవసాయ భూమి మంజూరు చేసింది. ఈ భూమిలో ప్రస్తుతం ఇంటి స్థలాలు ఇవ్వాలని నిర్ణయించింది. వివాదం ముదిరి గొడవకు దారితీసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.


పాత స్థలాలనే..

నందవరం మండలం కనకవీడులో 2002లో అప్పటి ప్రభుత్వం ఇంటి స్థలాలను ఇచ్చింది. గ్రామ శివారులోని 15 ఎకరాల్లో 450 మందికి 3 సెంట్ల ప్రకారం పట్టాలను పంపిణీ చేసింది. కానీ ప్లాట్లు చూపకపోవటంతో ఎవరూ నివాసాలు ఏర్పాటు చేసుకోలేదు. ప్రస్తుతం ఆ స్థలాల్లో పట్టాలు ఇచ్చేందుకు అధికారులు సిద్ధమయ్యారు. గతంలో పట్టాలు పొందిన వారు కోర్టును ఆశ్రయించారు. చేసేదిలేక అధికారులు 12 ఎకరాలను వదలి 3 ఎకరాల్లో ప్లాట్లను సిద్ధం చేస్తున్నారు. 


బలవంతంగా లాక్కుని..

మంత్రాలయం మండలం వగరూరు, చిలకలడోన, చెట్నహల్లి గ్రామాల్లో ఇంటి స్థలాల వివాదాలు చోటు చేసుకున్నాయి. వగరూరులో టీడీపీ హయాంలో అప్పట్లో ఇళ్ల స్థలాల పట్టాలను పంపీణీ చేశారు. అప్పట్లో లబ్ధిదారులు బండలు వేసుకుని హద్దులు ఏర్పాటు చేసుకున్నారు. ఈ స్థలాలను ఈ ఏడాది ఫిబ్రవరిలో బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. పాట్లుగా విభజించి పంపిణీకి సిద్ధం చేశారు. చిలకలడోనలో వందమంది వరకు గతంలో పట్టాలు పొందారు.


కొంతమంది మాత్రమే గుడిసెలు వేసుకున్నారు. మిగతా వారు ఖాళీ స్థలాలను అలాగే ఉంచుకున్నారు. ఈ స్థలాలను కూడా అధికారులు బలవంతంగా స్వాధీనం చేసుకున్నారు. ప్రజా సంఘాలు, లబ్ధిదారులు అడ్డుకున్నా కొత్తగా పంచేందుకు సిద్ధం చేశారు. చెట్నపల్లిలో టీడీపీ ప్రభుత్వం 250 మందికి స్థలాలు పంపిణీ చేసింది. కొందరు గుడిసేలు వేసుకున్నారు. మరికొందరు అలాగే ఉంచుకున్నారు. వాటిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. లబ్ధిదారులు కాళ్లావేళ్లా పడినా పట్టించుకోలేదు. 


సాగు భూములు..

కోసిగి సమీపంలో ప్రభుత్వ భూమిని కొన్నేళ్ల క్రితం ఎస్సీలకు పంచారు. వారు కొంతకాలం సాగు చేశారు. ఆ తరువాత వర్షాభావం, నీటి వసతి లేక పోవటంతో బీడుగా ఉంచారు. ప్రస్తుతం ఈ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఇంటి పట్టాలు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. లబ్ధిదారుల్లో ఒకరు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయన స్థలాన్ని వదలి మిగతా స్థలంలో అధికారులు ప్లాట్లు వేస్తున్నారు. 


కౌతాళం మండలం గుడికంభాళి గ్రామంలో 2007లో ఇంటి స్థలాల పట్టాలు ఇచ్చారు. మౌలిక వసతులు లేకపోవటంతో నివాసాలు ఏర్పాటు చేసుకోలేదు. అధికారులు ఆ స్థలాన్ని కొత్తవారికి ఇచ్చేందుకు ప్రయత్నించారు. పట్టాదారులు అధికారుతో వాగ్వాదానికి దిగారు. కోర్టును అశ్రయించారు. దీంతో అధికారులు మరో చోట స్థలాలను సిద్ధం చేస్తున్నారు.

Updated Date - 2020-07-02T10:26:25+05:30 IST