పంట రుణాల మంజూరుకు సహకరించండి

ABN , First Publish Date - 2021-01-19T07:10:12+05:30 IST

రైతులకు పంట రుణాల మంజూరులో పూర్తిస్థాయిలో సహా య, సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు బ్యాంకర్లకు సూచించారు.

పంట రుణాల మంజూరుకు సహకరించండి
మాట్లాడుతున్న కలెక్టర్‌


బ్యాంకర్ల సమావేశంలో కలెక్టర్‌ గంధం చంద్రుడు

అనంతపురం క్లాక్‌టవర్‌, జనవరి 18: రైతులకు పంట రుణాల మంజూరులో పూర్తిస్థాయిలో సహా య, సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు బ్యాంకర్లకు సూచించారు. సోమవారం సాయంత్రం స్థానిక ఎన్టీఆర్‌ సహకారభవన్‌లో జిల్లాస్థాయి డీఎల్‌టీసీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వివిధ పంటలకు రాబోయే ఖరీఫ్‌-2021 సీజన్‌, రబీ 2021-22 సీజన్‌కు సంబంధించి బ్యాంకుల ద్వారా మంజూరు చేయాల్సిన ఆర్థిక (రుణ) సహాయంపై వివిధ శాఖల అధికారులు, బ్యాంకర్లతో ముందుగా కలెక్టర్‌ చర్చించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యమైన వేరుశనగ, వరి, అరటి, మామిడి, చీనీ తదితర పంటలకు బ్యాంకుల ద్వారా రైతులకు రుణసహాయంపై ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. వేరుశనగ ఎకరానికి రూ.20వేలు నుంచి రూ.28వేలు వరకు, వరికి ఎకరానికి రూ.36వేలు నుంచి రూ.38వేలు, దానిమ్మకు ఎకరాకు రూ.70వేలు నుంచి రూ.75వేలు వరకు, జామ రూ.35వేలు నుంచి రూ.38 వేలు వరకు, బొప్పాయి రూ.65వేలు నుంచి రూ.70వే లు వరకు, మామిడి రూ.30వేలు నుంచి రూ.35వేలు వరకు పంట రుణసహాయం ప్రతిపాదనలు పంపేలా సమావేశంలో నిర్ణయించి తరువాత ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని తీర్మానించారు. పంట రుణాల విషయంలో ప్రతి బ్యాంకరు రైతుకు సహకారమందించాలని సూచించారు. సమావేశంలో ఏడీసీసీ బ్యాంకు చైర్మన్‌ పామిడి వీరాంజనేయులు, అసిస్టెంట్‌ కలెక్టర్‌ సూర్య, ఏడీసీసీ బ్యాంకు సీఈఓ ఏబీ రాంప్రసాద్‌, జీఎం సురేఖరాణి, ఆప్కాబ్‌ జీఎం విజయభాస్కర్‌రెడ్డి, ఎల్‌డీఎం మోహన్‌మురళీ, నాబార్డు డీఎం మధుసూదన్‌, వ్యవసాయ, పశుసంవర్థక, మత్య్స, ఉద్యానవన శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-19T07:10:12+05:30 IST