యుద్ధ విమానాల రక్షణకు.. అధునాతన ‘చాఫ్’తో కవచం
ABN , First Publish Date - 2021-08-20T07:38:13+05:30 IST
శత్రు రాడార్లు, క్షిపణులను ఏమార్చి.. వాటి బారి నుంచి యుద్ధ విమానాలను కాపాడే అధునాతన చాఫ్‌ను భారత రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది.
శత్రు రాడార్లు, క్షిపణులను ఏమార్చేందుకు దోహదం.. అభివృద్ధి చేసిన డీఆర్‌డీవో
న్యూఢిల్లీ, ఆగస్టు 19: శత్రు రాడార్లు, క్షిపణులను ఏమార్చి.. వాటి బారి నుంచి యుద్ధ విమానాలను కాపాడే అధునాతన చాఫ్‌ను భారత రక్షణ పరిశోధన-అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. శత్రువులు ప్రయోగించే క్షిపణులు, రాడార్ గైడెడ్ క్షిపణులను ఏమార్చేందుకు చాఫ్ వ్యవస్థ అల్యూమినియం, జింక్ కోటెడ్ ఫైబర్ వంటి పలు పదార్థాలతో విమానాలు/నౌకల డమ్మీని సృష్టిస్తుంది. అవే నిజమైన విమానాలు/నౌకలుగా భావించి.. గైడెడ్ క్షిపణులు వాటిపై దాడి చేస్తాయి. ఇప్పటికే శత్రువులకు మన యుద్ధ విమానాల ఉనికి తెలియకుండా అవాక్స్ వంటి పరికరాలు ఉన్నా, శత్రుదేశా లు అధునాతన సాంకేతికతను ఉపయోగిస్తే, ఆ దాడుల నుంచి చాఫ్ కాపాడుతుంది. డీఆర్‌డీవో ఈ సాంకేతికతను మూడు వేరియంట్లలో ఇటీవలే భారత నౌకాదళానికి అందజేసింది. నేవీ దీన్ని అరేబియా సముద్రంలో పరీక్షించింది. ఆశించిన ఫలితాలు రావడంతో వీటిని రూపొందించినట్లు డీఆర్‌డీవో తెలిపింది.