కాంట్రాక్టు సైనికులు

ABN , First Publish Date - 2022-06-16T06:15:13+05:30 IST

త్రివిధ దళాల్లో సైనికులను భర్తీచేసేందుకు కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం కొన్ని ప్రైవేటు కంపెనీల ‘హైర్ అండ్ ఫైర్’ తరహాలో ఉన్నదంటూ విమర్శలకు...

కాంట్రాక్టు సైనికులు

త్రివిధ దళాల్లో సైనికులను భర్తీచేసేందుకు కేంద్రప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన అగ్నిపథ్ పథకం కొన్ని ప్రైవేటు కంపెనీల ‘హైర్ అండ్ ఫైర్’ తరహాలో ఉన్నదంటూ విమర్శలకు గురవుతోంది. ఈ పథకంలో భాగంగా ఏటా ఓ నలభైయాభైవేలమంది అగ్నివీరులను నియమిస్తుంటే, వారిలో మూడువంతులమంది నాలుగేళ్ళ తరువాత ఇంటికిపోవలసి ఉంటుంది. ఓ స్వల్పకాలిక కాంట్రాక్టు పద్ధతిన జరిగే ఈ నియామకంలో నాలుగోవంతు అగ్నివీరులకు మాత్రమే పర్మెనెంట్ కమిషన్ ద్వారా మరో పదిహేనేళ్ళు సైన్యంలో నాన్ ఆఫీసర్ హోదాలో కొనసాగే అవకాశం దక్కుతుంది. తొలి ఏడాది ముప్పైవేల రూపాయల జీతంతో ఉద్యోగం ఆరంభమై, నాలుగో ఏట నలభైవేలతో ముగుస్తుంటే, వారి జీతంలో నుంచి మూడోవంతు మొత్తం కార్పస్ ఫండ్‌కు పోయి ఓ ఐదు లక్షలు వారే సమకూర్చుకుంటారు. దానికి సమాన మొత్తాన్ని కేంద్రం వడ్డీతో సహా చేర్చుతుంది. సుమారు 11లక్షల రూపాయలతో నాలుగేళ్ళ తరువాత ఇంటికి చేరుతున్నవీరికి ఆపైన పింఛను, గ్రాట్యుయిటీ వంటివేమీ ఉండవు. ఇక, నాలుగేళ్ళ తరువాత కొద్దిమందికి సైన్యంలో కొనసాగే అవకాశం దక్కినప్పటికీ ఈ కాలాన్ని లెక్కలోకి తీసుకోరట.


మొత్తం రక్షణరంగ వ్యయంలో సగానికి పైగా సైనికుల జీతాలు, పింఛన్లకే ఖర్చుపెట్టవలసి వస్తున్నందున ప్రభుత్వ పెద్దలకు ఈ పథకం ఆలోచనవచ్చి ఉండవచ్చు. జీతాలకూ, గతంలో కొన్న ఆయుధాల విడతలవారీ చెల్లింపులకూ రక్షణబడ్జెట్ లో ఎక్కువ మొత్తం ఖర్చయిపోగా, కొత్తగా ఆయుధాలు సమకూర్చుకోవడానికి డబ్బు మిగలడం లేదట. ఈ పథకం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, దేశరక్షణ బలోపేతం అవుతుందనీ, భారత సైన్యం యువరక్తంతోనూ, టెక్ సావీలతోనూ నిండిపోతుందని రక్షణమంత్రి అంటున్నారు. కానీ, అంతిమ లక్ష్యం సైనికులమీద పెడుతున్న ఖర్చు తగ్గించి, కొత్త ఆయుధాల కొనుగోలుకు ధనాన్ని మళ్ళించడం. ప్రధానంగా చైనానుంచి సమీపకాలంలో తీవ్రస్థాయి ఘర్షణ తప్పదని అనుకుంటున్న నేపథ్యంలో, సైన్యంలోకి ఎక్కువమంది యువకులను తెచ్చుకోవడం అవసరం కావచ్చు. పదోతరగతి పాసైన ఓ కుర్రవాడికి ఆ నాలుగేళ్ళలోనూ ఏ లోటూ ఉండకపోవచ్చు. యుద్ధంలో కన్నుమూసినా, వైకల్యం సంభవించినా భారీ మొత్తాలే దక్కుతున్నాయి. కానీ, ఈ తరహా స్వల్పకాలిక నియామకాల వల్ల మన దళాల సామర్థ్యం తగ్గుతుందనీ, రక్షణ బలహీనపడుతుందని నిపుణుల వాదన. వడబోతలో భాగంగా మూడువంతులమంది తిరిగి రోడ్లమీదకు వచ్చేస్తారు కనుక, అటువంటివారిని రహస్య విధుల్లో నియమించగలమా, వారు తమకు తెలిసిన కీలకమైన విషయాలను ఎవరికీ చెప్పరని నమ్మకమేమిటి అని రక్షణరంగ నిపుణుల ప్రశ్న. ఆయుధాల వాడకంమీద ఓ స్థాయి శిక్షణ పొందిన వీరు నాలుగేళ్ళ తరువాత చేతిలో ఉద్యోగం లేని స్థితిలో విద్రోహశక్తుల చేతుల్లో పడే ప్రమాదం ఉన్నదనీ అంటున్నారు. బిహార్, యూపీ వంటి రాష్ట్రాల్లో కొత్త గ్యాంగులు తయారుకావడమో, ఉన్నవి బలోపేతం కావడమో జరగవచ్చునని ఓ హెచ్చరిక. నాలుగేళ్ళ తరువాత మమ్మల్ని ఏం చేయమంటారు? అని బిహార్‌కు చెందిన యువకులు కొందరు తమ నిరసనల్లో భాగంగా ప్రశ్నించారు. నాలుగేళ్ళ తరువాత వెనక్కువచ్చి, మిగతావారితో పోటీపడి ఉద్యోగాలు సంపాదించడం సాధ్యమేనా? అన్నది ప్రశ్న. సైన్యంలో చేరాలన్న ఉత్సాహాన్ని యువతరంలో మరింత పెంచవలసిన ప్రభుత్వం ఈ పథకం ద్వారా ఒక ప్రైవేటు సైన్యాన్ని తయారుచేస్తున్న రీతిలో వ్యవహరిస్తూ సైన్యం ప్రతిష్ఠను దిగజార్చిందని అంటున్నారు వారు. ఇంటికి పోతున్నవారిని వారిమానాన వదిలివేయకుండా ప్రభుత్వమే ఉపాధి పథకాలు అమలుచేయాలనీ, ప్రభుత్వోద్యోగాల్లో కొంతశాతం రిజర్వేషన్లు ఇవ్వాలనీ కొందరు అడుగుతున్నారు. ఉద్యోగ భద్రత అన్నది సైన్యంలో చేరాలన్న కోరికకూ, ప్రాణాలకు వెరవనితనానికీ మరింత ఊతాన్నిస్తుంది. కేవలం దేశభక్తి ఆధారంగానే అందరూ సైన్యంలో చేరుతున్నారని అనుకోలేం. రక్షణరంగానికి సంబంధించిన ఈ తరహా పథకాల రూపకల్పనలో అధికారులు, పాలకులు ముందుచూపుతో వ్యవహరించాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ఉపసంహరించవచ్చు లేదా లోపాలను లోతుగా అధ్యయనం చేసి సరిదిద్దవచ్చు.

Updated Date - 2022-06-16T06:15:13+05:30 IST