వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికులు

ABN , First Publish Date - 2022-09-29T06:22:47+05:30 IST

వైసీపీ ఫ్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ గండి బాబ్జీ అన్నారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డున పడ్డ భవన నిర్మాణ కార్మికులు
కార్మిక శాఖ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న టీడీపీ, టీఎన్‌టీయూసీ కార్యకర్తలు

టీడీపీ దక్షిణ నియోజకవర్గం ఇన్‌చార్జ్‌ గండి బాబ్జీ

అక్కయ్యపాలెం, సెప్టెంబరు 28 : వైసీపీ ఫ్రభుత్వ హయాంలో భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ దక్షిణ నియోజకవర్గం  ఇన్‌చార్జ్‌ గండి బాబ్జీ అన్నారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం కార్మిక శాఖ కార్యాలయం ఎదుట  నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ముఖ్యంగా నిర్మాణరంగ కార్మికులు చాలా అవస్థలు పడుతున్నారని వివరించారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన 25 లక్షల ఇళ్లలో కనీసం 20 వేల ఇళ్లు కూడా ప్రారంభించ లేదని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు మాట్లాడుతూ  ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి కార్మిక సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారని, కార్మికులకు రావలసిన పథకాలను ఆపేసి నిధులు దారి మళ్లించడం దారుణమని ఆరోపించారు.. గత ప్రభుత్వంలో చంద్రబాబు కార్మికుల కోసం పెట్టిన చంద్రన్న బీమా వంటి పథకాలను నిలిపేశారని మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ పథకాలు మరల అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. టీఎన్‌టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ ఉపాధి లేక భవన నిర్మాణ కార్మికులు వలస వెళ్లిపోతున్నారని, వివిధ ప్రాంతాల్లో 60 మందికి పైగా భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు కార్మిక సంక్షేమ బోర్డులో రూ.8 కోట్ల నిధులను ప్రభుత్వ అవసరాల కోసం వాడుకొని కార్మికులను మోసం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కార్మికుల సమస్యలను తీర్చాలని, లేకుంటే ఎద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అనంతరం కార్మిక శాఖాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీఎన్‌టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోగంటి లెనిన్‌బాబు, ఉపాధ్యక్షుడు బండారు అప్పారావు, ఇతర నాయకులు పరుచూరి ప్రసాద్‌, ఎం.అప్పలనాయుడు, ఉగ్రం, నరేంద్ర, రామకృష్ణ, బొడ్డు రమణ, శ్రీనివాసరావు, విల్లా రామ్మోహన్‌ కుమార్‌, నక్కా లక్ష్మణరావు, కొండబాబు, వెంకన్నబాబు, సింహాద్రి, శ్రీకాంత్‌, సూర్యనారాయణ, గురుమూర్తి, తారక్‌, అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-09-29T06:22:47+05:30 IST