శరవేగంగా..జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలు

ABN , First Publish Date - 2020-10-31T07:02:25+05:30 IST

వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చే దిశగా ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి

శరవేగంగా..జిల్లాలో రైతు వేదికల నిర్మాణాలు

57 క్లస్టర్లలో రూ.12.54 కోట్లతో కొనసాగుతున్న పనులు 

14 వేదికల నిర్మాణాలు పూర్తి

చివరి దశలో 23 వేదికలు 

ప్రగతిలో 20  

నేడు జనగామలో ప్రారంభించనున్న సీఎం 

పెరగనున్న మరింత వేగం 


(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

వ్యవసాయ రంగంలో మార్పులు తెచ్చే దిశగా ప్రభుత్వం ముందుకుసాగుతోంది. ఇందులో భాగంగా చేపట్టిన రైతు వేదికల నిర్మాణాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలో శరవేగంగా సాగుతున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురవడంతోపాటు కాళేశ్వరం ఎత్తిపోతల పథకంతో జిల్లాలోని మిడ్‌ మానేరు ప్రాజెక్ట్‌, చెరువుల్లోకి నీళ్లు కూడా చేరాయి. వానాకాలం సీజన్‌లోనే నియంత్రిత సాగు విధానంలో జిల్లాలో భారీగా సాగు విస్తీర్ణం పెరిగింది. గతేడాది ఖరీఫ్‌లో 2.37 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయగా ఈ సారి 2.50 లక్షలకు పెరిగింది. పంటల మార్పులో భాగంగా సన్నరకాల సాగుపై రైతులు దృష్టి సారించారు. కష్టాన్ని నమ్ముకున్న రైతులకు సలహాలు సూచనలు అందించే దిశగా రైతులు వేదికల నిర్మాణాలు చేపట్టారు. రూ.22 లక్షల వ్యయంతో జిల్లాలో 57 వ్యవసాయ క్లస్టర్లలో నిర్మిస్తున్నారు. కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, పంచాయతీరాజ్‌ అధికారుల ప్రత్యేక దృష్టితో నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయి. జిల్లాలో రూ.12.54 కోట్ల వ్యయంతో కొనసాగుతున్న నిర్మాణాల్లో ఇప్పటికే 14 రైతు వేదికలు పూర్తి చేశారు. 23 వేదికలు చివరి దశలో ఉన్నాయి. శానిటరీ, ఎలక్ర్టికల్‌ పనులు కొనసాగుతున్నాయి. 20 వేదికలు మాత్రం రూప్‌లెవల్‌కు చేరుకున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం జనగామలో రైతు వేదికలు ప్రారంభిచనుండడంతో జిల్లాలోనూ   రైతు వేదికలు మరింత వేగంగా పూర్తవుతాయని భావిస్తున్నారు. 


వ్యవసాయ రంగంలో మార్పు కోసమే వేదికలు 

 వ్యవసాయ రంగంలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  రైతులు, వ్యవసాయ అధికారులు, రైతు బంధు సమితి సభ్యులు ఒకే చోట పంటలపై చర్చించడానికి రైతువేదికల నిర్మాణం చేపట్టింది.  ప్రతీ 5 వేల హెక్టార్లకు ఒక క్లస్టర్‌గా వేదికలు నిర్మిస్తోంది. వ్యవసాయ విస్తరణ అధికారి కార్యాలయం, సమావేశ మందిరం, గోడౌన్‌తోపాటు రైతు బంధు సమితి సభ్యులు, కోఆర్డినేటర్‌లు కీలకంగా వేదిక ద్వారా పనులు చేయనున్నారు. రైతులకు ఉపయోగకరంగా ఉండే వేదిక భవనాలు త్వరలోనే పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. 

Updated Date - 2020-10-31T07:02:25+05:30 IST