ధరల పెరుగుదలతో లబ్ధిదారుల ఇక్కట్లు

ABN , First Publish Date - 2021-04-19T06:20:55+05:30 IST

పేదలకు గూడు కల్పించేందుకు ప్రభుత్వ అమలు చేస్తున్న పక్కా గృహాల నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదు.

ధరల పెరుగుదలతో లబ్ధిదారుల ఇక్కట్లు
మధ్యలో నిలచిపోయిన పక్కా గృహం నిర్మాణం

దర్శి, ఏప్రిల్‌ 18: పేదలకు గూడు కల్పించేందుకు ప్రభుత్వ అమలు చేస్తున్న పక్కా గృహాల నిర్మాణం పనులు ముందుకు సాగడం లేదు.  గృహ నిర్మాణ పథకం అమలు వివిధ కారణాలతో అంతంతమాత్రంగా సాగుతోంది. సిమెంట్‌, ఇనుము, ఇటుకలు ధరలు పెరగడంతో నిర్మాణ వ్యయం రెట్టింపు అయింది. ప్రభుత్వ ఇచ్చే నగదు సరిపోకపోవడంతో మూడు సంవత్సరాల క్రితం మంజూరు అయిన గృహాలు కూడా  పలు చోట్ల నేటికి పూర్తి కాలేదు. మండలంలో 2017-18లో 259 గృహాలు మంజూరు కాగా 180 గృహాలు నిర్మాణం పూర్తి అయ్యింది. 50 గృహాల నిర్మాణాలు వివిధ దశల్లో సాగుతున్నాయి. 29 గృహాలు పునాదుల దశలోనే ఉన్నాయి. 2018-19 సంవత్సరంలో 332 గృహాలు మంజూరు కాగా 250 గృహాలు పూర్తయ్యాయి. 58 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయి. 24 గృహాలు ప్రారంభ దశలో ఉన్నాయి. 2019-20 సంవత్సరంలో 161 గృహాలు మంజూరు కాగా 58 గృహాలు పూర్తి అయ్యాయి. 103 గృహాలు ఇంకా నిర్మాణానికి నోచుకోలేదు. గత ప్రభుత్వం హయాంలో మంజూరు అయిన ఈ గృహాలకు ఒక్కొక్క ఇంటికి రు.1.50 లక్షలు ఇస్తారు. ప్రస్తుతం పెరిగిన ధరల వలన ప్రభుత్వం ఇస్తున్న నిధులు పునాదులకే సరిపోతున్నాయి. పేదలైన లబ్ధిదారులు ఇంటి నిర్మాణం చేపట్టలేక అధిక శాతం మంది అలాగే వదిలేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ ఏడాది 3229 గృహాలను మంజూరు చేసింది. ఇటీవల ప్రభుత్వం లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసిన స్థలాల్లో ఈ నిర్మాణాలు చేపట్టవలసి ఉంది. ఇప్పటివరకు లబ్ధిదారులు నిర్మాణం ప్రారంభించలేదు. అతి కొద్దిమంది మాత్రమే పునాదులు తీస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం తొలుత ఇళ్లు నిర్మించి మౌలిక వసతులు కల్పించి ఇస్తామని భరోసా ఇవ్వడంతో గ్రామాలకు సుదూరంగా ఇళ్ల స్థలాలు ఇచ్చినప్పటికి పట్టాలు తీసుకున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇళ్ళు నిర్మించే కార్యక్రమాన్ని పక్కన పెట్టి లబ్దిదారునికి ఒక్కొక్క ఇంటికి రు.1.80 లక్షలు ఇళ్ళు నిర్మించుకునేందుకు నిధులు విడుదల చేస్తున్నారు. లబ్దిదారులకు 90 బస్తాల సిమెంట్‌, ప్రభుత్వం ప్రకటించిన ధరకు అందజేస్తారు. మిగిలిన సొమ్మును నగదు రూపంలో ఇస్తారు. సిమెంట్‌ పోనూ లబ్దిదారునికి రు.1.50 లక్షలు మాత్రమే అందుతుంది. ప్రస్తుతం పెరిగిన ధర ప్రకారం ఇళ్ల నిర్మాణం సాధ్యం కాదని అధిక శాతం మంది లబ్ది దారులు ఏం చేయాలో పాలుపోక అల్లాడుతున్నారు. ఇచ్చిన హామీ ప్రకారం ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి మౌలిక వసతులు కల్పించి ఇవ్వాలని లబ్దిదారులు కోరుతున్నారు.

Updated Date - 2021-04-19T06:20:55+05:30 IST