నిలకడగా గోదావరి

ABN , First Publish Date - 2022-08-12T05:53:35+05:30 IST

నిలకడగా గోదావరి

నిలకడగా గోదావరి
భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం

కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక 

భద్రాద్రి వద్ద 52.4 అడుగుల ఎత్తున ప్రవాహం 

మూడు రాషా్ట్రలకు రాకపోకలకు అంతరాయం 

రహదారికి ఇరువైపులా నిలిచిన వాహనాలు

భద్రాచలం, ఆగస్టు 11: భద్రాచలం వద్ద గోదావరి గత 24గంటలుగా నెమ్మదిగా పెరుగుతోంది. బుధవారం అర్ధరాత్రి 12గంటలకు 50.9 అడుగులున్న గోదావరి నీటిమట్టం గురువారం తెల్లవారుజామున 3గంటలకు 51.3, 6గంటలకు 51.5అడుగులకు చేరుకుంది. 9గంటలకు 51.9అడుగులకు, 11గంటలకు 52 అడుగులకు చేరుకొని మూడు గంటల పాటు 52అడుగుల వద్దే నిలకడగా ఉంది. అనంతరం మధ్యాహ్నం 2గంటలకు 52.2 అడుగులకు పెరిగి మళ్లీ రెండు గంటల పాటు నిలకడగా ఉండి నాలుగు గంటలకు 52.3 అడుగులకు చేరింది. ఈ క్రమంలో సాయంత్రం 6గంటలకు 52.4 అడుగులకు చేరుకోగా ఏడు గంటలకు సైతం 52.4 అడుగుల వద్దే నిలకడగా ఉంది. శుక్రవారం వరకు స్వల్పంగా పెరిగే అవకాశాలున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక రెండోరోజు సైతం కొనసాగుతోంది. గోదావరి వరదల కారణంగా భద్రాచలం ఏజెన్సీలో పలు చోట్ల రాకపోకలు గత 48గంటలుగా స్తంభించాయి. రహదారిపై వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా భద్రాచలంలోని స్నాన ఘట్టాలు పూర్తిగా నీట మునగగా, దేవస్థానం కల్యాణ కట్ట కిందిభాగం ఇప్పటికే నీట మునిగింది. దుమ్ముగూడెం మండలంలోని పర్ణశాలలో నారచీరల ప్రాంతం గత మూడు రోజులుగా నీట మునిగి ఉంది. ఇదిలా ఉండగా దుమ్ముగూడెం మండలంలోని సున్నంబట్టి గ్రామంలోని వరద బాధితులను ముందస్తుగా పడవల ద్వారా దాటించి ట్రాక్టర్లలో పునరవాస కేంద్రాలకు తరలించారు. 


మూడు రాషా్ట్రలకు నిలిచిన రాకపోకలు 

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో తెలంగాణ-ఆంధ్రా సరిహద్దుల్లోని గుండాల, రాయనిపేట ప్రాంతంలో రోడ్లపైకి వరద నీరు చేరింది. దాంతో ఆంధ్రా, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశాలకు రాకపోకలు స్తంభించాయి. అదేవిధంగా బూర్గంపాడు నుంచి ఏపీలోని జంగారెడ్డిగూడేనికి వెళ్లే మార్గం సైతం నీట మునిగింది. తెలంగాణ ఆంధ్రా సరిహద్దుల్లోని ప్రధాన రహదారులపై కూడా వరద నీరు చేరింది. దీంతో తెలంగాణ నుంచి ఏపీ, ఛత్తీ్‌సగఢ్‌, ఒడిశా రాషా్ట్రలకు వెళ్లే భారీ వాహనాలను భద్రాచలంలోని రవాణ శాఖ కార్యాలయం సమీపంలో రహదారికి ఇరువైపులా నిలిపివేశారు. భద్రాచలం నుంచి చర్లకు వెళ్లే మార్గంలో తూరుబాక, గంగోలు వద్ద రోడ్లపైకి వరద నీరు చేరింది. మోకాలి లోతులోపు నీరు ఉండటంతో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. పర్ణశాలకు వెళ్లే మార్గంలో రహదారిపైకి వరద నీరు చేరడంతో గత రెండు రోజులుగా రాకపోకలు స్తంభించాయి. అదేవిధంగా అశ్వాపురం మండలంలోని అమీర్ద-అమ్మగారిపల్లి మద్య గోదావరి వరద కారణంగా వాగు పోటెత్తడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చర్ల మండలంలో కుదునూరు వద్ద రహదారికి సమీపంలో వరద నీరు చేరింది. అదేవిధంగా బూర్గంపాడు మండలంలోని బూర్గంపాడు-సారపాక, బూర్గంపాడు-కుక్కునూరు, బూర్గంపాడు-సోంపల్లి రహదారులపైకి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిపివేశారు. 



Updated Date - 2022-08-12T05:53:35+05:30 IST