కానిస్టేబుల్‌ కుటుంబం నిరసన

ABN , First Publish Date - 2020-07-12T10:36:36+05:30 IST

తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తూ ఓ కానిస్టేబుల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగాడు. శనివారం నెల్లూరులోని జిల్లా

కానిస్టేబుల్‌ కుటుంబం నిరసన

ఎస్పీ కార్యాలయం వద్ద రోడ్డుపై బైఠాయింపు

న్యాయం అడిగితే సస్పెండ్‌ చేస్తారా!

అదుపులోకి తీసుకున్న పోలీసులు


నెల్లూరు (క్రైం), జూలై  11 : తనకు జరిగిన అన్యాయంపై ప్రశ్నిస్తూ ఓ కానిస్టేబుల్‌ తన కుటుంబ సభ్యులతో కలిసి నిరసనకు దిగాడు. శనివారం నెల్లూరులోని జిల్లా పోలీసు కార్యాలయం పక్కన రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశాడు. వేదాయపాలెం పోలీసు స్టేషన్‌ సీఐ ఒక కానిస్టేబుల్‌ను కొట్టడంపై న్యాయం చేయాలని కోరిన తనను సస్పెండ్‌ చేయడం ఎంతవరకు సబబు అని ఆక్రోశం వెలిబుచ్చాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. వివరాలిలా ఉన్నాయి. నాలుగు రోజుల క్రితం నెల్లూరులోని వేదాయపాలెం పోలీసు స్టేషన్‌లో సీఐ తనను దూషించి, దాడి చేశాడని కానిస్టేబుల్‌ గంగాధర్‌ స్టేషన్‌ ఎదుట నిరసన తెలిపాడు.


సమాచారం తెలుసుకున్న పోలీసు అధికారుల సంఘం నాయకులు అక్కడికెళ్లి జరిగిన విషయాన్ని తెలుసుకున్నారు. వారు ఆ ఘటనను ఎస్పీ భాస్కర్‌భూషణ్‌ దృష్టికి తీసుకెళ్లారు. దాంతో ఆయన ట్రాఫిక్‌ డీఎస్పీ మల్లికార్జునరావును విచారణ అధికారిగా నియమించారు.  విచారణ అనంతరం ఆయన పూర్తి వివరాలను ఎస్పీకి నివేదించారు. దీంతో ఎస్పీ కానిస్టేబుల్‌ గంగాధర్‌ను, అతనికి తోడుగా ఉన్న మరో కానిస్టేబుల్‌ నిరంజన్‌ను సస్పెండ్‌ చేశారు. సీఐకి చార్జి మెమో, పోలీసు అఽధికార సంఘం నాయకులకు మెమోలు ఇచ్చారని సమాచారం. విషయం తెలుసుకున్న నిరంజన్‌ తనను అన్యాయంగా సస్పెండ్‌ చేశారని భార్యా పిల్లలతో కలిసి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపాడు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని, నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాల్సిన ఎస్పీ, డీఎస్పీలు తనను అన్యాయంగా  సస్పెండ్‌ చేశారని ఆరోపించాడు. ఈ క్రమంలోనే ఇటీవలే సస్పెండ్‌ అయిన బాలాజీనగర్‌ పోలీసు స్టేషన్‌ హెడ్‌కానిస్టేబుల్‌  శ్రీనివాసులు సైతం తనకూ అన్యాయం జరిగిందని నిరంజన్‌తో కలిసి నిరసన తెలిపాడు.


అదే సమయంలో జేసీ వినోద్‌కుమార్‌ కారులో అటుగా వెళ్తుండడాన్ని గమనించిన నిరంజన్‌ తనకు న్యాయం చేయాలని కేకలు వేశాడు. అక్కడ ఆందోళన గురించి తెలుసుకున్న దర్గామిట్ట సీఐ నాగేశ్వరమ్మ సంఘటనా స్థలానికి చేరుకొని నిరంజన్‌ కుటుంబాన్ని బలవంతంగా స్టేషన్‌కు తరలించారు.  ఏదేమైనా పోలీసుల రగడ రోడ్డుపైకి చేరడంతో ప్రజలంతా పలు రకాలుగా చర్చించుకున్నారు.   

Updated Date - 2020-07-12T10:36:36+05:30 IST