Pakistan : నా హత్యకు కుట్ర జరుగుతోంది : ఇమ్రాన్ ఖాన్

ABN , First Publish Date - 2022-05-15T16:00:28+05:30 IST

తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని పాకిస్థాన్

Pakistan : నా హత్యకు కుట్ర జరుగుతోంది : ఇమ్రాన్ ఖాన్

ఇస్లామాబాద్ : తనను హత్య చేయడానికి కుట్ర జరుగుతోందని పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆరోపించారు. ఈ కుట్రలో భాగస్వాముల పేర్లను తాను ఓ వీడియోలో రికార్డు చేశానని, తనకు ఏదైనా జరిగితే ఈ వీడియోను బయటపెడతానని చెప్పారు. సియాల్‌కోట్‌లో శనివారం జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, ఈ కుట్ర పాకిస్థాన్‌లోనూ, విదేశాల్లోనూ జరుగుతోందన్నారు. 


‘‘నన్ను హత్య చేయడానికి పాకిస్థాన్‌లోనూ, విదేశాల్లోనూ ఉన్నవారు ప్రయత్నిస్తున్నట్లు నాకు తెలుసు. నాకు వ్యతిరేకంగా జరుగుతున్న కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలతో ఓ వీడియోను రికార్డు చేశాను. దానిని సురక్షిత ప్రదేశంలో భద్రపరిచాను. నన్ను హత్య చేస్తే, ఈ వీడియో బయటపడుతుంది’’ అని ఇమ్రాన్ చెప్పారు. అయితే ఆ కుట్రదారుల పేర్లను ఆయన వెల్లడించలేదు. 


ఆ కుట్రదారులు తాను వారికి అడ్డంకిగా ఉన్నట్లు భావిస్తున్నారని, అందుకే తనను అంతం చేయాలనుకుంటున్నారని చెప్పారు. అంతకుముందు శుక్రవారం విలేకర్లతో  ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ అధికారాన్ని దొంగలకు అప్పగించడానికి బదులు ఓ అణుబాంబు వేసి ఉంటే బాగుండేదన్నారు. 


ప్రధాన మంత్రి షహబాజ్ షరీఫ్ (Shehbaz Sharif) పాకిస్థాన్ పార్లమెంటులో మాట్లాడుతూ, ఇమ్రాన్ ఖాన్ ప్రజల మనసుల్లో విషం నింపుతున్నారని ఆరోపించారు. 


Updated Date - 2022-05-15T16:00:28+05:30 IST