కాంగ్రెస్‌కు దెబ్బ

ABN , First Publish Date - 2021-06-10T05:58:49+05:30 IST

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జితిన్‌ ప్రసాద బుధవారం బీజేపీలో చేరారు....

కాంగ్రెస్‌కు దెబ్బ

ఉత్తర్‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జితిన్‌ ప్రసాద బుధవారం బీజేపీలో చేరారు. దాదాపు ఏడాది క్రితం జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌నూ, మరీ ముఖ్యంగా ప్రియమిత్రుడు రాహుల్‌ గాంధీని వదిలి కమలదళంలో చేరినట్టుగానే, ఇప్పుడు మరో డూన్‌స్కూలు మిత్రుడు, మాజీ కేంద్రమంత్రి పార్టీని విడిచిపోయాడు. పార్టీ అధ్యక్ష బాధ్యతలను రాహుల్‌ గాలికొదిలేశాక జ్యోతిరాదిత్య బాటలోనే జితిన్‌ కూడా నడుస్తారని అధికులు ఊహించారు. కానీ, పశ్చిమబెంగాల్‌ ఎన్నికలకు ముందు ఆయనను పార్టీ ఇంచార్జిగా నియమించడంతో జితిన్‌ను కాంగ్రెస్‌ బాగానే ఆపగలిగిందని అనుకున్నారు. కానీ, అమలు వాయిదాపడిందే తప్ప నిర్ణయం మారలేదని ఈ నిష్క్రమణ అర్థం.


కాంగ్రెస్‌తో మూడుతరాలుగా ఉన్న బంధాన్ని తుంచేసుకొని బీజేపీలో చేరిన జితిన్‌కు తాను విడిచివచ్చినపార్టీ ఇక ఎంతమాత్రం జాతీయపార్టీ కాదని అనిపించింది. సంస్థాగతంగా బీజేపీ ఒక్కటే జాతీయపార్టీ అనీ, మిగతావన్నింటికీ అటువంటి లక్షణాలు లేవని అంటున్నారు. ప్రజాసేవకోసమే పార్టీ మారాననీ, మోదీ నాయకత్వంలో ఆ అవకాశం తనకు దక్కుతుందనీ చెప్పడానికీ ప్రసాద మొహమాట పడలేదు. పన్నెండుశాతం బ్రాహ్మణ ఓటర్లున్న రాష్ట్రంలో, ఠాకూర్‌ యోగి ఆదిత్యనాథ్‌ దెబ్బకు ఆ సంప్రదాయ ఓటుబ్యాంకు సన్నగిల్లిపోతున్నదని బీజేపీకి బెంగపట్టుకున్నదట. రాష్ట్రంనుంచి వచ్చిన నివేదికలు కూడా ఏదో ఒకటి చేయకపోతే బ్రాహ్మణుల ఓట్లు పడవనీ, యోగికి రాజ్‌పుట్‌ పక్షపాతి అన్న చెడ్డపేరు కూడా వచ్చిందని హెచ్చరించాయట. వికాస్‌ దుబే ఎన్‌కౌంటర్‌, అనంతరపరిణామాలు పార్టీకి బ్రాహ్మణులను దూరం చేశాయని అంటారు. అయోధ్య, వారణాసి స్థానిక ఎన్నికల్లో పార్టీ ఓటమి కూడా ఈ భయాన్ని పెంచింది. జితిన్‌ ప్రసాద గత ఏడాది బ్రాహ్మణ చేతనామంచ్‌ ఆరంభించడం వెనుక బీజేపీ పెద్దల ఆశీస్సులున్నాయని కూడా అంటారు. కాంగ్రెస్‌నుంచి వలసవచ్చిన రీటా బహుగుణ జోషి సహా యోగి మంత్రివర్గంలో అరడజనుమంది బ్రాహ్మణులే ఉన్నా, పార్టీ పదవుల్లోనూ వారి సంఖ్య బాగానే ఉన్నా, ఆ సామాజికవర్గంపై జితేంద్ర ప్రసాద కుటుంబానికి ఉన్న పట్టు, గుర్తింపు బీజేపీకి రాజకీయంగా ఉపకరిస్తుందని అంచనా. తమను అధికారంలోకి తీసుకువస్తే భారీ పరశురామ విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తామని హామీ ఇచ్చిన ఎస్పీ, బీఎస్పీ అధినేతలు బీజేపీ పాలనలో బ్రాహ్మణులకు అన్యాయం జరుగుతున్నదని ఇప్పటికే ఎంతో వాపోతున్నారు. 


రాహుల్‌, ప్రియాంకలకు సన్నిహితుడైన జితిన్‌ నిష్క్రమణ కాంగ్రెస్‌ కంటే వారిద్దరికీ వ్యక్తిగతంగా నష్టం. ఉత్తర్‌ప్రదేశ్‌ వ్యవహారాల బాధ్యురాలిగా యోగిమీద తీవ్ర విమర్శలు చేస్తున్న ప్రియాంకకు మరీదెబ్బ. ఈ పరిణామం కాంగ్రెస్‌ను మరింత బలహీనపరచినా, సమాజ్‌వాదీకి మేలు చేస్తుందని కూడా అంటున్నారు. మాయావతి పార్టీ మరింత బలహీనంగా ఉన్న తరుణంలో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటర్లు అఖిలేష్‌ పక్షాన నిలబడ్డారు. ఎన్నికలనాటికి కాంగ్రెస్‌ మరింత నీరసించినపక్షంలో, రాష్ట్రంలో నలభైశాతం సీట్లను ప్రభావితం చేయగలిగే ముస్లింలు సమాజ్‌వాదీవైపు పూర్తిగా మళ్ళిపోయే అవకాశమూ ఉంది. అది బీజేపీకి నష్టం చేస్తుంది. ఇరవైయేళ్ళక్రితం జితిన్‌ తండ్రి జితేంద్రప్రసాద పార్టీ సంస్థాగత ఎన్నికల్లో సోనియాను సవాలు చేశారు. ఇప్పుడు త్వరలోనే సంస్థాగత ఎన్నికలు జరిగి, రాహుల్‌ తిరిగి బాధ్యతలు స్వీకరిస్తారని అనుకుంటున్న తరుణంలో జితిన్‌ పార్టీని విడిచిపెట్టిపోయారు. పదినెలల క్రితం బీజేపీలో చేరబోయి, వెనక్కుతగ్గిన రాహుల్‌ మరో మిత్రుడు సచిన్‌పైలట్‌ కూడా ఇక ఆగకపోవచ్చు. రాహుల్‌ మీద ఆశలు పెట్టుకున్నవారికి ఆయనకానీ, పార్టీకానీ మంచికాలం ముందున్నదన్న హామీ ఇవ్వనంతకాలం నిష్క్రమణలు జరిగిపోతూనే ఉంటాయి.

Updated Date - 2021-06-10T05:58:49+05:30 IST