ఒక్కో రాష్ట్రానికి లక్ష కోట్లు ఇవ్వండి: కాంగ్రెస్

ABN , First Publish Date - 2020-04-05T01:34:01+05:30 IST

కరోనా వైరస్‌తో నిజమైన పోరాటం చేస్తున్నది రాష్ట్రాలేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే రాష్ట్రాలన్నీ నిధుల కొరతతో అల్లాడుతున్నందున కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ..

ఒక్కో రాష్ట్రానికి లక్ష కోట్లు ఇవ్వండి: కాంగ్రెస్

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో నిజమైన పోరాటం చేస్తున్నది రాష్ట్రాలేనని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. అయితే రాష్ట్రాలన్నీ నిధుల కొరతతో అల్లాడుతున్నందున కరోనాను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు ఒక్కో రాష్ట్రానికి లక్ష కోట్ల రూపాయల చొప్పున ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని కేంద్రం ప్రకటించాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. జీఎస్‌టీ కింద రాష్ట్రాలకు ఇవ్వాల్సిన పెండింగ్ బకాయిలు కూడా విడుదల చేయాలని కూడా కాంగ్రెస్ పార్టీ కోరింది. ఇండియాలో పెరుగుతున్న కోవిడ్-19 కేసులపై పోరాటంలో రాష్ట్రాలు ముందు వరుసలో ఉన్నాయని పార్టీ ప్రతినిధి సుప్రియ శ్రినేట్ శనివారంనాడు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.


'అన్నింటికీ ఒకే మంత్రం అనేది అన్నిసార్లు పనిచేయదు. రాష్ట్రాలను వికేంద్రీకరించి, అధికారాలు ఇవ్వాలి. స్థానిక స్థాయిలో పరిస్థితిని అంచనా వేసి తగిన ఆర్థిక వనరులతో పోరాటం చేయడమే కరోనాను ఎదుర్కొనేందుకు తగిన పరిష్కారం. అయితే రాష్ట్రాలు నిధుల కొరతతో అల్లాడుతున్నాయి' అని సుప్రియ అన్నారు. కేంద్ర ప్రభుత్వం చేసినట్టుగా వనరుల సమీకరణ రాష్ట్రాలకు సాధ్యం కాదని ఆమె అన్నారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో రాష్ట్రాలు పూర్తిస్థాయిలో కరోనాపై పోరాటం చేయడానికి లక్ష కోట్ల రూపాయల చొప్పున ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలని కేంద్రాన్ని ఆమె కోరారు. క్వారంటైన్లు ఏర్పాటు చేసేందుకు, వైద్య పరీక్షా సౌకర్యాల కల్పనకు, థర్మల్ స్కానర్ల ఏర్పాటు, వెంటిలేటర్లు, ఎయిర్ ప్యూరిఫైయర్లు తెప్పించుకునేందుకు, ఇతర అవసరాలకు రాష్ట్రాలకు డబ్బులు అవసరమని ఆమె పేర్కొన్నారు. రాష్ట్రాలకు జీఎస్‌టీ బకాయిలను కూడా కేంద్రం వెంటనే విడుదల చేయాలని కోరారు. బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా ఈ విషయమై కేంద్రాన్ని సంప్రదిస్తున్నట్టు సుప్రియ చెప్పారు.

Updated Date - 2020-04-05T01:34:01+05:30 IST