పరస్పర ఆరోపణలు కొత్త కాదు

ABN , First Publish Date - 2022-05-25T15:54:26+05:30 IST

పేరరివాలన్‌ విడుదలపై డీఎంకేను కాంగ్రెస్‌ విమర్శించడం, డీఎంకే కాంగ్రెస్ ను విమర్శించడం కొత్త కాదని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ

పరస్పర ఆరోపణలు కొత్త కాదు

                     - Congress Mp తిరునావుక్కరసు 


పెరంబూర్‌(చెన్నై): పేరరివాలన్‌ విడుదలపై డీఎంకేను కాంగ్రెస్‌ విమర్శించడం, డీఎంకే కాంగ్రెస్ ను విమర్శించడం కొత్త కాదని తమిళనాడు కాంగ్రెస్‌ కమిటీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ తిరునావుక్కరసు అభిప్రాయపడ్డారు. నగరంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ, పేరరివాలన్‌ విడుదలను కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించలేదన్నారు. పేరరివాలన్‌ విడుదల చేసిన సమయంలో కూడా న్యాయస్థానం అతను నిరపరాధి అని చెప్పలేదన్నారు. రాజీవ్‌గాంధీ హత్య జరిగినప్పటి నుంచే అన్నాడీఎంకే, డీఎంకే ప్రకటనలను తమ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడి హత్య ఒక్క కార్యకర్త కూడా మరచిపోయేదికాదన్నారు. డీఎంకే-కాంగ్రెస్‌ మధ్య అభిప్రాయ భేధాలున్నా తాము కూటమిగా కొనసాగుతున్నామని, మా కూటమిని ఎవరూ విచ్ఛిన్నం చేయలేరని, తమ కూటమి కొనసాగుతుందని తిరునావుక్కరసు పేర్కొన్నారు.


డీఎంకే చెప్పేవన్నీ అంగీకరించం: ఎంపీ మాణిక్‌ ఠాగూర్‌

డీఎంకే చెప్పివన్నీ అంగీకరించాల్సిన అవసరం లేదని కాంగ్రెస్‌ ఎంపీ మాణిక్‌ఠాగూర్‌ స్పష్టం చేశారు. విరుదునగర్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, పేరరివాలన్‌ను ఒక త్యాగిగా చూడడం, అతని విడుదలపై వేడుకలు జరుపుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పేరరివాలన్‌ సహా ఏడుగురి విడుదల వ్యవహారంలో డీఎంకే కూటమిలోని ఒక్కో పార్టీ ఒక్కో అభిప్రాయం వ్యక్తం చేయగా, కాంగ్రెస్‌ మాత్రం ఖండిస్తోందన్నారు. డీఎంకే చెప్పినవన్నీ పాటించాల్సిన అవసరం తమకు లేదని, అదే సమయంలో తమ అభిప్రాయాలు కూడా స్వీకరించాల్సిన అవసరం డీఎంకేకు లేదని ఎంపీ మాణిక్‌ఠాగూర్‌ వ్యాఖ్యానించారు.

Updated Date - 2022-05-25T15:54:26+05:30 IST