‘10 జన్‌పథ్’ చాణక్యుడు అహ్మద్ పటేల్...

ABN , First Publish Date - 2020-11-25T16:25:11+05:30 IST

అహ్మద్ పటేల్.... గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడు. సోనియా గాంధీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకా అహ్మద్

‘10 జన్‌పథ్’ చాణక్యుడు అహ్మద్ పటేల్...

న్యూఢిల్లీ : అహ్మద్ పటేల్.... గాంధీ కుటుంబానికి అత్యంత ఆప్తుడు. సోనియా గాంధీ తీసుకునే ప్రతి నిర్ణయం వెనుకా అహ్మద్ పటేల్ మాస్టర్ మైండ్ పనిచేస్తూ ఉంటుంది. ఒంటిచేత్తో కాంగ్రెస్ పార్టీని నడిపించిన వ్యక్తి. రాజకీయ ప్రత్యర్థి బలాబలాలను అంచనా వేసి.... కీలెరిగి వాత పెట్టడంలో మంచి దిట్టగా వ్యవహరిస్తారని పేరుంది. కాంగ్రెస్‌లో ట్రబుల్ షూటర్‌గా దివంగత నేత ప్రణబ్ ముఖర్జీ ఉన్నా.... అంతే సమానంగా ట్రబుల్ షూటర్ అని పేరు సంపాదించుకున్నారు అహ్మద్ పటేల్. కాంగ్రెస్ సంక్లిష్టాల తుఫానులో ఎప్పుడు చిక్కుకున్నా.... బయటికి, మీడియాకు ఏమాత్రం కనిపించకుండా ఆ చిక్కు ముడులను విప్పేసి... సోనియా గాంధీకి ఊరటనిచ్చే చాణుక్యుడు. సోనియా గాంధీపై, కాంగ్రెస్‌పై ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎంత విరుచుకుపడ్డా... వాటన్నింటికీ ఎదురు నిలిచి, ఆ వేడి సోనియాకు తాకకుండా వీరోచితంగా నిలబడిన యోధుడు ఈయన.






ముందు నుంచీ గాంధీ పరివారానికి అత్యంత విశ్వసాపాత్రునిగా సేవలందించారు. ఎంతలా అంటే... ఏ విషయమైనా, ఎంతటి నాయకుడైనా సోనియా గాంధీ చెవిన వేయాలంటే అహ్మద్ పటేల్‌కు చెబితే చాలు.. సోనియా గాంధీకి చెప్పినట్లే’’ అనేంతలా. ఒక్క మాటలో చెప్పాలంటే ‘కాంగ్రెస్ చాణుక్యుడు’’ అహ్మద్ పటేల్. తాలూకా స్థాయి రాజకీయాల నుంచి ఏకంగా కాంగ్రెస్ ను వెనకుండి నడిపించేంతలా ఎదిగిన వ్యక్తి. 26 ఏళ్ల ప్రాయంలోనే ఏకంగా లోక్‌సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి కన్నుమూసే వరకూ ఇక వెనుదిరిగి చూసుకోలేదు.


ఇందిరా ఎమర్జెన్సీ విధించిన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. అంతటి క్లిష్ట సమయంలో కూడా అహ్మద్ పటేల్ గుజరాత్‌లో కాంగ్రెస్ జెండాను ఎగరేశారు. అప్పటికి ఆయన వయస్సు కేవలం 28 సంవత్సరాలే. అప్పటి నుంచి గాంధీ పరివారం ఆయన్ను పరిగణనలోకి తీసుకోవడం ప్రారంభించింది. అంతేకాదు... ఏకంగా గాంధీ కుటుంబానికి చెందిన మూడు తరాలతో కలిసి పనిచేశారు. వారికి అత్యంత సన్నిహితంగా మెలిగారు. ఇంత పేరు ప్రతిష్ఠలున్నా ఒక్కసారి కూడా మంత్రివర్గంలో చేరలేదు. బయటికి కనిపించలేదు. అహ్మద్ పటేల్‌దంతా తెరవెనుక మంత్రాంగమే.


‘సంకట మోచన్’ గా కాంగ్రెస్‌ను కష్టాలనుంచి విజయ తీరాలకు చేర్చిన లబ్ధ ప్రతిష్ఠుడు. ఓ రకంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పార్టీలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొని, పార్టీలో ఏకచ్ఛత్రాధిపత్యం కొనసాగిస్తూ వస్తున్నారంటే అది అహ్మద్ పటేల్ వల్లే అనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. భర్త రాజీవ్ గాంధీ మరణం తర్వాత పీవీ నరసింహా రావు, ప్రణబ్ ముఖర్జీ, చెన్నారెడ్డి,  అర్జున్ సింగ్ లాంటి దురంధరులను హ్యాండిల్ చేయడంలో సోనియా గాంధీ తడబడ్డా, ఆ తర్వాత అహ్మద్ పటేల్ సహాయంతో కాంగ్రెస్ పై తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు సోనియా.  ఇంతలా సోనియా పార్టీపై పట్టు పెంచుకోవడం వెనుక ఉంది అహ్మద్ పటేలే. 



రాజీవ్ గాంధీ ఇచ్చిన టాస్క్ ను శక్తిమంతంగా పూర్తి చేసిన అహ్మద్

అహ్మద్ పటేల్ గాంధీ పరివారానికి పూర్తిగా అంతేవాసిగా మారింది రాజీవ్ హయాంలోనే. అప్పట్లోనే అహ్మద్ పటేల్ పనితనాన్ని, చురుకుదనాన్ని గుర్తించిన రాజీవ్... అప్పట్లోనే ఆయనకు కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవిలో కూర్చోబెట్టారు. మాజీ ప్రధాని నెహ్రూ శతజయంతి ఉత్సవాలను పురస్కరించుకొని ‘జవహర్ భవన్’ ను సిద్ధం చేయాలని అప్పట్లో రాజీవ్ గాంధీ ఇతర నేతలకు పురమాయించారు. వారెవ్వరూ ఆ భవనాన్ని సిద్ధం చేయకలేకపోయారు. అప్పటికి పదేళ్లు గడిచిపోయాయి. దీంతో విసుగు చెందిన రాజీవ్.... జవహర్ భవన్‌ను శతజయంతి ఉత్సవాలకు సిద్ధం చేయాలన్న బాధ్యతను అహ్మద్ పటేల్ భుజ స్కంధాలపై మోపారు. ఈ బాధ్యతను విజయవంతంగా నిర్వహించడంతో... గాంధీ పరివారానికి అహ్మద్ పటేల్ మరింత ఆప్తుడయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ ఘటనతోనే గాంధీ కుటుంబంలో ఓ సభ్యుడిగా మారిపోయారు.


సోనియా గాంధీ కాంగ్రెస్ పగ్గాలను చేపట్టిన తర్వాత అహ్మద్ పటేల్ ప్రాభవం కాంగ్రెస్‌లో మరింత ద్విగుణీకృతమైంది. 10 జన్‌పథ్‌లో అహ్మద్ పటేల్ ఎంత అంటే అంతే. ‘‘భారత్ వెలిగిపోతోంది’’ అంటూ అప్పటి ప్రధాని వాజపేయ్ ప్రచారాన్ని తుత్తునీయలు చేసి.... అదంతా అబద్ధమని, కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని మొదట అంచనా వేసింది అహ్మద్ పటేలే. అయితే ఈ మాటలను మిగితా అధిష్ఠానం పెద్దలు అంతలా విశ్వసించలేదు. ఈ ప్రచారం మొదటికే మోసం వస్తుందని అహ్మద్ పటేల్‌పై విరుచుకుపడ్డారు. అయినా సరే... సోనియాను ఒప్పించి, ఉద్ధృతంగా ప్రచారం చేయించి... కాంగ్రెస్‌ను అధికార పీఠంపై కూర్చోబెట్టిన ఘనత అహ్మద్ పటేలే. కాంగ్రెస్‌లో అటు 10 జన్‌పథ్‌లో అంతలా చక్రం తిప్పినా.... ఆయన కుమారుడ్ని మాత్రం అహ్మద్ పటేల్ రాజకీయాల్లోకి తీసుకురాలేదు. అహ్మద్ పటేల్ లేని లోటును కాంగ్రెస్‌లో ఎవరు భర్తీ చేస్తారన్నది వేచి చూడాల్సిందే. 


Updated Date - 2020-11-25T16:25:11+05:30 IST