బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ‘వీఐపీ డిస్‌ప్లే’పై కాంగ్రెస్ ఫైర్

ABN , First Publish Date - 2022-06-10T23:09:30+05:30 IST

బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ఒకరు కారులో అతి వేగంగా వెళ్లడమే కాకుండా అడ్డుకున్న పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించిన

బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ‘వీఐపీ డిస్‌ప్లే’పై కాంగ్రెస్ ఫైర్

బెంగళూరు: కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ఒకరు కారులో అతి వేగంగా వెళ్లడమే కాకుండా అడ్డుకున్న పోలీసులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటనపై కాంగ్రెస్ స్పందించింది. కాంగ్రెస్ నేత డాక్టర్ శంకర గుహ ద్వారకానాథ్ బెల్లూరు ఈ ఘటనపై మాట్లాడుతూ.. బీజేపీపై విరుచుకుపడ్డారు. ఇంట్లో చూసిన వాటిని పిల్లలు ఇమిటేట్ చేస్తున్నారన్న ఆయన.. బీజేపీ ఎమ్మెల్యే కుమార్తె ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేశారు.


 దీనిని సిగ్గుచేటైన విషయంగా అభివర్ణించిన ద్వారకానాథ్.. ఈ విషయంలో కేంద్రం జోక్యం చేసుకుని ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, వీఐపీలు, సాధారణ ప్రజలు అంటూ చట్టం విషయంలో పక్షపాతం వహించొద్దని కర్ణాటక పోలీసులకు హితవు పలికారు. తమ చుట్టూ జరుగుతున్న వాటిని పిల్లలు అనుకరించాలని చూస్తుంటారని, డాక్టర్‌గా తానీ విషయం చెప్పగలనని అన్నారు. పిల్లలు తమ ఇంట్లోని పెద్ద వారిని నుంచి ఎంతో నేర్చుకుంటారని అన్నారు. అయితే, దురదృష్టవశాత్తు ఇంట్లో నేర్చుకున్న దురహంకారాన్ని ఎమ్మెల్యే కుమార్తె బహిరంగంగా ప్రదర్శించిందన్నారు.


మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే కుమార్తెగా ఆమె మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిందని, మరింత వినయంగా, మరింత జాగ్రత్తగా వ్యవహరించి ఉంటే బాగుండేదన్నారు. కుమార్తె చేసిన తప్పును తండ్రి సమర్థించుకోవడం ఇంకా దారుణమైన విషయమని ద్వారకానాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది సిగ్గుచేటని, ఖండించాల్సిన విషయమని అన్నారు. ఈ విషయంలో కేంద్రం సీరియస్‌గా దృష్టిసారించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారం నెత్తికెక్కి సామాన్యులను లెక్క చేయడం లేదని దుమ్మెత్తిపోశారు. వారు చేసిన ఈ పనికి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. 


ఈ విషయంలో పోలీసుల ప్రవర్తనపైనా ద్వారకానాథ్ మండిపడ్డారు. పోలీసులతో అలా అసభ్యంగా ప్రవర్తించిన వ్యక్తి ఓ సాధారణ పౌరుడు అయి ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే జైలుకు పంపి ఉండేవారన్నారు. అలా కాకుండా వారు తీరిగ్గా కూర్చుని ఆమె చెప్పిన కథలు విన్నారని ఎద్దేవా చేశారు. తమ పోలీసులను సరైన దారిలో పెట్టేందుకు బెంగళూరు పోలీసు కమిషనర్ కఠిన చర్యలు తీసుకోవాల్సిందేనని అన్నారు. అది ప్రధానమంత్రి అయినా, సాధారణ పౌరుడు అయినా చట్టం అందరికీ సమానమేనని, ఎవరినీ ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదని ద్వారకానాథ్ తేల్చి చెప్పారు.  


కాగా,  కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలి కూమార్తె వేగంగా కారు నడుపుతూ సిగ్నల్ జంప్ చేయడమే కాకుండా అడ్డుకున్న పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఈ ఘటనను వీడియో తీస్తున్న జర్నలిస్టులుపైనా చిందులు తొక్కారు. తాను ఇప్పుడే వెళ్లాలనుకుంటున్నానని, తన కారును ఆపవద్దంటూ పోలీసులతో గొడవకు దిగిన ఆమె.. ఇది ఎమ్మెల్యే వాహనమని, తన తండ్రి ఎమ్మెల్యే లింబావలి అంటూ పోలీసులను బెదిరించే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ కావడంతో ఆమె తీరుపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తాయి.

Updated Date - 2022-06-10T23:09:30+05:30 IST